
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనుచిత ప్రవర్తన వివాదాస్పదంగా మారింది. ఎమ్మెల్యే కడియం శ్రీహరిని తుపాకీతో కాల్చి చంపుతానని పాడి కౌశిక్ రెడ్డి బెదిరించడం కరెక్ట్ కాదంటూ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయాలని మండిపడింది. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
కడియం శ్రీహరి తండ్రి లాంటి వారని.. పాడి కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చెయ్యాలన్నారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. సభలో కొత్త సభ్యులకు ఎలాంటి సంస్కృతి నేర్పుతున్నారని యశస్విని రెడ్డి ప్రశ్నించారు. సభలో ఇప్పటి వరకు నేర్చుకున్న కొంతో గొప్పో అది కూడా బీఆర్ఎస్ సభ్యుల ప్రవర్తనతో మర్చిపోతున్నామని చెప్పారు. సభా సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నారని ప్రశ్నించారు. పార్టీ అంటే సభలో బీఆర్ఎస్ ఒక్కటే కాదన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కడియం శ్రీహరికి సారీ చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేలు డిమాండ్ చేశారు. కడియంపై కౌశిక్ రెడ్డి తీరుకు కేటీఆర్, హరీశ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కడియంపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు శోచనీయమని కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలను పరిశీలించి స్పీకర్ చర్యలు తీసుకోవాలన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు దళితులంటే గౌరవం లేదన్నారు కవ్వంపల్లి సత్యనారాయణ.కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయాలన్నారు. దళిత ఎమ్మెల్యేని బీఆర్ఎస్ సభ్యులు అవమానించారని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే బాలూ నాయక్.దళితుల పట్ల బీఆర్ఎస్ నేతలకు చులకన భావం ఉందన్నారు.కౌశిక్ రెడ్డి అహంకార పూరితంగా ప్రవర్తించారని ఫైర్ అయ్యారు.
కడియం శ్రీహరిని అవమానించేలా ప్రవర్తించడం సరికాదన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్. కడియం పట్ల అనుచితంగా ప్రవర్తించిన కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో ఇలాంటి బిహేవియర్ చూడలేని ఫైర్ అయ్యారు వినోద్.
అసెంబ్లీలో దళిత ఎమ్మెల్యేను చంపేస్తామని బెదిరించడం సరికాదన్నారు ఎమ్మెల్యే వేముల వీరేశం.తమ జాతులకు చట్ట సభలో రక్షణ లేకుంటే బయట రక్షణ ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డిని సభ నుండి శాశ్వతంగా బహిష్కరించాలన్నారు. నిండు శాసనసభలో దళిత సభ్యుడిని చంపుతా అని బెదిరించిన తీరునుఖండిస్తున్నామన్నారు.
సభలో అడ్డంకులు సృష్టించడమే బీఆర్ఎస్ ఎజెండాగా పెట్టుకుందన్నారు ఎమ్మెల్యే మట్టా రాగమయి. కడియం శ్రీహరి వయసులోనూ , అనుభవంలో పెద్దవారని.. కనీసం ఇంతమంది చెప్పిన కౌశిక్ రెడ్డికి పశ్చాత్తాపం లేదన్నారు. మహిళలంటే కౌశిక్ రెడ్డికి గౌరవం లేదు , మహిళా సభ్యులు మాట్లాడుతుంటే డిస్ట్రబ్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు.