Reading Time: < 1 minute

 ఐపిఎల్ సీజన్ 2026లో ముంబై ఇండియన్స్ శుభారంభం చేసింది. ఆదివారం కోల్‌తా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోరు సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ముంబై 19.1 ఓవర్లలోనే నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి జయకేతనం ఎగుర వేసింది. ఓపెనర్లు రియాన్ రికెల్టన్, రోహిత్ శర్మలు అద్భుత బ్యాటింగ్‌తో ముంబైని ఆదుకున్నారు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ 38 బంతుల్లోనే ఆరు సిక్సర్‌లు, మరో 6 ఫోర్లతో 78 పరుగులు చేశాడు. చెలరేగి బ్యాటింగ్ చేసిన రికెల్టన్ 8 సిక్స్‌లు, 4 బౌండరీలతో 43 బంతుల్లోనే 81 పరుగులు సాధించాడు. దీంతో ముంబై అలవోక విజయం అందుకుంది.

శుభారంభం..

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేపట్టిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఓపెనర్లు అజింక్య రహానె, ఫిన్ అలెన్‌లు శుభారంభం అందించారు. అలెన్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. రహానె కూడా మెరుగ్గానే బ్యాటింగ్ చేశాడు. ఇటు రహానె అటు అలెన్‌లు జోరుగా ఆడడంతో స్కోరు వేగంగా పరిగెత్తింది. ఈ జోడీని విడగొట్టేందుకు ముంబై బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. అలెన్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగి పోయాడు. అయితే 17 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 18 పరుగులు చేసిన అతన్ని శార్దూల్ ఠాకూర్ వెనక్కి పంపాడు.

దీంతో 69 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత వచ్చిన వేలం పాట కింగ్ కామెరూన్ గ్రీన్ ఆశించిన స్థాయిలో రాణించలేక పోయాడు. కేవలం 18 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. మరోవైపు కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన రహానె 40 బంతుల్లో ఐదు సిక్స్‌లు, మూడు ఫోర్లతో 67 పరుగులు చేసి వెనుదిరిగాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన అంగ్‌క్రిస్ రఘువంశీ 29 బంతుల్లోనే 51 పరుగులు చేశాడు. రింకు సింగ్ 4 ఫోర్లతో 33 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.