
Ajinkya Rahane injury: ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత ఓవర్లలో 220 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇందులో కెప్టెన్ అజింక్య రహానే పాత్ర కీలకం. ముంబై స్టార్ బౌలర్లను లెక్కచేయకుండా రహానే 40 బంతుల్లో 67 పరుగులు చేసి జట్టుకు పటిష్టమైన పునాది వేశాడు. ఫిన్ అలెన్, అంక్రిష్ రఘువంశీలతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. అయితే, సుదీర్ఘ సమయం పాటు క్రీజులో ఉండి బ్యాటింగ్ చేయడం వల్ల రహానే తీవ్రంగా అలసిపోయాడు.
మైదానంలో కుప్పకూలిన కెప్టెన్..
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ ఐదో ఓవర్ సమయంలో ఈ ఘటన జరిగింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్ వేస్తుండగా, ఫీల్డింగ్ చేస్తున్న రహానే ఒక్కసారిగా కాలి నొప్పితో మైదానంలో పడిపోయాడు. కండరాలు పట్టేయడం (క్రాంప్స్) వల్ల ఆయన తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు కనిపించింది. వెంటనే జట్టు వైద్యడు (ఫిజియో) మైదానంలోకి వచ్చి రహానేను పరీక్షించారు. నడవడానికి కూడా ఇబ్బంది పడుతుండటంతో, వైద్యుల సలహా మేరకు ఆయన మైదానాన్ని వీడాల్సి వచ్చింది. రహానే వెనుదిరిగిన తర్వాత రింకూ సింగ్ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టారు.
నిబంధనలు ఏం చెబుతున్నాయి?
క్రికెట్ నియమావళి ప్రకారం, ఒక ఆటగాడు గాయపడితే అతని స్థానంలో ప్రత్యామ్నాయ ఫీల్డర్‌ను అనుమతించవచ్చు. అయితే, ఆ ప్రత్యామ్నాయ ఆటగాడు బౌలింగ్ చేయడానికి లేదా బ్యాటింగ్ చేయడానికి వీలుండదు. అలాగే సదరు ఆటగాడికి కెప్టెన్సీ చేసే అధికారం కూడా ఉండదు. అందుకే రహానే స్థానంలో మరొకరు ఫీల్డింగ్‌కు వచ్చినప్పటికీ, మైదానంలో జట్టును నడిపించే బాధ్యతను రింకూ సింగ్‌కు అప్పగించారు.
రోహిత్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్..
కెప్టెన్ లేని సమయంలో ముంబై ఇండియన్స్ ఓపెనర్లు రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ కోల్‌కతా బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా రోహిత్ కేవలం 23 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసి ముంబైకి అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. దీంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది ముంబై టీం. అంతకుముందు కోల్‌కతా బ్యాటర్లలో రఘువంశీ (51), ఫిన్ అలెన్ (37) రాణించగా, ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌లో వికెట్లు తీయలేకపోవడం గమనార్హం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..