Reading Time: < 1 minute
Tollywood: ప్లేట్ పట్టుకుని వెళ్తే భోజనం లేదు పోరా అన్నాడు.. ఆ తర్వాత నా దగ్గరే పని చేశాడు

కన్నడ రియల్ స్టార్, విలక్షణ దర్శకుడు ఉపేంద్ర గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో ఎదురైన పలు ఆసక్తికర సంఘటనలను వివరించారు. తెరపై ఎంతో ఇంటెన్స్‌గా, దూకుడుగా కనిపించే తాను, నిజ జీవితంలో మాత్రం చాలా సెన్సిటివ్ అని ఆయన స్పష్టం చేశారు. సమాజం, రాజకీయాలు, మీడియా వ్యవస్థలపై తన సినిమాల్లో వేసే సెటైర్ల వెనుక ఒక బలమైన ఆలోచన ఉంటుందని, విదేశాలకు వెళ్లినప్పుడు మన దేశం కూడా అంతటి అభివృద్ధిని ఎందుకు సాధించకూడదనే తపన నుంచే తన కథలు పుడతాయని వివరించారు. ముఖ్యంగా ‘ఏ’ సినిమా తర్వాత పదేళ్ల సుదీర్ఘ విరామం తీసుకోవడం వెనుక, ప్రేక్షకులకు ఏదైనా కొత్తగా, బలమైన థాట్‌తో చెప్పాలనే ఉద్దేశ్యం ఉందని తెలిపారు. తాను ఒక సినిమాను రాసేటప్పుడు కేవలం దర్శకుడిగానే కాకుండా, ఒక సామాన్య ప్రేక్షకుడి కోణంలో ఆలోచిస్తానని, ఆ క్రియేటివ్ ప్రక్రియను తాను ఎంతో ఆస్వాదిస్తానని చెప్పారు.

తమ జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను ఎదుగుదలకు మెట్లుగా ఎలా మార్చుకోవాలో ఉపేంద్ర తన సొంత ఉదాహరణలతో వివరించారు. తాను ఏమీ లేని ‘జీరో’ స్థాయి నుంచి ప్రయాణాన్ని మొదలుపెట్టానని, అందుకే తనకు దేనినీ కోల్పోతామనే భయం లేదని పేర్కొన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో ఒక ప్రొడక్షన్ బాయ్ తనను భోజనం దగ్గర అవమానించిన సంఘటనను, భోజనం లేదని చెప్పిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ, తాను హీరో అయ్యాక కూడా అతనిపై పగ పెంచుకోకుండా అదే గౌరవం ఇచ్చానని చెప్పారు.

ఆ తర్వాత అతడు తన దగ్గరే పని చేశాడని చెప్పారు. ఒక వ్యక్తికి ఎదురయ్యే చేదు అనుభవాలు అతడిని క్రూరుడిగా మార్చకూడదని, మరింత మెరుగైన మనిషిగా తీర్చిదిద్దాలని ఆయన హితవు పలికారు. తన మొదటి చిత్రంలో పాటలు రాసినా, నటించినా కనీసం పేరు కూడా టైటిల్ కార్డులో రాలేదని, కానీ దాని కోసం తాను గొడవ పడకుండా మౌనంగా వదిలేశానని చెప్పారు. ఆ తర్వాత తన పనిని గుర్తించి దర్శకుడే స్వయంగా టైటిల్ కార్డు ఇచ్చారని గుర్తుచేస్తూ, ఏదైనా వస్తువును లేదా పేరును మనం అతిగా ఆశించనప్పుడే అది మన వెతుక్కుంటూ వస్తుందని ఉపేంద్ర తన జీవన తత్వాన్ని వెల్లడించారు. అవమానాలను స్ఫూర్తిగా మలుచుకుని సానుకూల దృక్పథంతో ముందుకు సాగడమే తన విజయ రహస్యమని ఆయన స్పష్టం చేశారు.