
ప్రస్తుత ప్రపంచ స్థాయి పరస్పర ఘర్షణల దశలో ఉత్తర కొరియా ఆదివారం అత్యంత శక్తివంతమైన ‘ ఘన ఇంధన క్షిపణి ఇంజిన్‌ను ’పరీక్షించింది.అమెరికా టార్గెట్‌గా ఉండే అత్యంత శక్తివంతమైన ఆయుధ వ్యవస్థ ఛోదక శక్తిగా ఈ ఇంజిన్ నిలుస్తుంది. గుర్తు తెలియని ప్రదేశం నుంచి జరిగిన క్షిపణి ఇంజిన్ పరీక్షను ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ వీక్షించారు. దేశ అత్యంత కీలకమైన సైనిక సామర్థం , శత్రు లక్షాల ఛేదనకు వీలుగా ఉండే ఈ ఇంజిన్ తయారు అయిందని ఉత్తరకొరియా అధికారిక వార్తా సంస్థ తెలిపింది. అమెరికా, అమెరికా మిత్రదేశాలను లక్షంగా ఎంచుకుని మరిన్ని శక్తివంతమైన సుదూర దాడి సమర్థవంతపు ఆయుధ వ్యవస్థ నిర్మాణానికి కిమ్ వెలువరించిన ఆదేశాల మేరకు ఉత్తర కొరియా ఎప్పటికప్పుడు కీలక పరీక్షలకు దిగుతోంది.
ఇప్పుడు పరీక్షించిన ఇంజిన్ శక్తి గరిష్టంగా 2500 కిలోటన్నులవరకూ ఉంటుంది. దీనిని పూర్తి స్థాయి కాంపోజిట్ కార్బన్ ఫైబర్ తో నిర్మించారు. ఉత్తరకొరియా క్షిపణుల వార్‌హెడ్ ను వేగంగా నిర్థిష్టంగా తీసుకువెళ్లగలిగే థ్రస్ట్‌ను ఈ ఇంజిన్ సంతరించుకుందని అధికార వర్గాలు తెలిపాయి. అమెరికా చర్యల క్రమంలో దేశానికి అత్యంత కీలకమైన సైనిక చర్యల నిరోధక శక్తి అవసరం అని కిమ్ భావిస్తూ వస్తున్నారు. ఆయన ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు శక్తివంతమైన క్షిపణుల పరీక్షలు జరుగుతున్నాయి. ఐదేండ్ల ఆయుధ వ్యవస్థ బలోపేత కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఈ ఇంజిన్ సమర్థతను పరీక్షించినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కెసిఎన్‌ఎ) తెలిపింది. ఇప్పటి ఇంజిన్ పరీక్ష దేశ అత్యంత వ్యూహాత్మక సైనిక బలోపేతానికి ఆయువుపట్టు అని కిమ్ స్పందించినట్లు ఈ వార్తా సంస్థ తెలిపింది. పరీక్ష ఎప్పుడు? ఎక్కడ జరిగిందనేది అధికారికంగా వెల్లడికాలేదు.