Reading Time: < 1 minute
ఇరాన్‌తో యుద్ధం.. 21 రోజుల్లో అమెరికాకు వేల కోట్ల నష్టం! మతిపోగొట్టే లెక్కలు..

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఘర్షణలు ప్రపంచ సైనిక సమీకరణాలను కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు కేవలం వ్యూహాత్మకంగానే కాకుండా ఆర్థిక పరంగా కూడా భారీ నష్టాలను మిగుల్చుతున్నాయి. ప్రముఖ పత్రిక ది వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ నివేదిక ప్రకారం కేవలం 21 రోజుల్లోనే అమెరికా సైనిక ఆస్తులకు 1.4 బిలియన్ నుండి 2.9 బిలియన్ డాలర్ల వరకు నష్టం సంభవించినట్లు అంచనా.

ఈ ఘర్షణలో అత్యాధునిక యుద్ధ విమానాల నష్టం అమెరికాకు పెద్ద దెబ్బగా మారింది. ఒక ఘటనలో మిత్రదేశం కువైట్‌కు చెందిన విమానం పొరపాటున అమెరికాకు చెందిన F-15E జెట్‌లను కూల్చివేయడం గమనార్హం. అదేవిధంగా అత్యాధునిక F-35A లైట్నింగ్ II కూడా అత్యవసర ల్యాండింగ్‌కు దిగాల్సి రావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. విమానాలకే కాకుండా ఇంధన సరఫరా వ్యవస్థ కూడా తీవ్రంగా దెబ్బతింది. KC-135 స్ట్రాటోట్యాంకర్‌లపై జరిగిన దాడుల్లో సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అదనంగా MQ-9 రీపర్ డ్రోన్‌లు కూడా భారీగా నాశనమయ్యాయి. ఒక్కో డ్రోన్ విలువ మిలియన్ల డాలర్లలో ఉండటంతో ఈ నష్టం మరింత పెరిగింది.

రాడార్ వ్యవస్థలు కూడా ఈ దాడుల ప్రభావాన్ని తప్పించుకోలేకపోయాయి. జోర్డాన్, ఖతార్ ప్రాంతాల్లో ఉన్న కీలక రక్షణ వ్యవస్థలు దెబ్బతినడంతో అమెరికా నిఘా సామర్థ్యంపై ప్రభావం పడింది. ఇదే సమయంలో సముద్రంలో కూడా సమస్యలు ఎదురయ్యాయి. యూఎస్ నేవీకి చెందిన యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్. ఫోర్డ్ విమాన వాహక నౌకలో అగ్నిప్రమాదం సంభవించడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో పెంటాగన్‌ అదనంగా 200 బిలియన్ డాలర్ల నిధులను కోరుతున్నట్లు సమాచారం. పూర్తి స్థాయి భూయుద్ధం ప్రారంభం కాకముందే ఈ స్థాయి నష్టం సంభవించడం ప్రపంచ భద్రతపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి