Reading Time: < 1 minute

అసెంబ్లీ సాక్షిగా సిఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని బిఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్‌రావు విమర్శించారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ మంత్రి పొంగులేటిది కాదని ముఖ్యమంత్రి చెప్పడం దుర్మార్గం అని మండిపడ్డారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి భార్య, కొడుకు, తమ్ముడు.. దూరపు బంధువులు ఎలా అవుతారని ప్రశ్నించారు. రాఘవ పేరు స్వయాన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తండ్రి పేరు అని, ఆ కంపెనీ ఆయనదేనని లోకమంతా తెలుసు అని పేర్కొన్నారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ డైరెక్టర్లుగా ఉన్నది పొంగులేటి సతీమణి మాధురి, కొడుకు హర్ష రెడ్డి, తమ్ముడు ప్రసాద్ రెడ్డి అని చెప్పారు. శనివారం అసెంబ్లీ సమావేశం వాయిదా పడిన తర్వాత బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలతో కలిసి హరీష్‌రావు అసెంబ్లీ లాబీలో నిరసనకు దిగారు

. మైనింగ్ స్కాం చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలంటూ బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు నినాదాలు చేశారు. అనంతరం హరీష్‌రావు మాట్లాడుతూ, సిఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీని తప్పుదోవ పట్టించారని అన్నారు. సభలో కాంగ్రెస్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని అసహనం వ్యక్తం చేశారు. అక్రమాలపై ప్రశ్నిస్తే డొంకతిరుగుడు సమాధానాలా..? అని అడిగారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జవాబుదారీతనం లేకుండా సభలో దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ పాలకుల తీరు శోచనీయం అని పేర్కొన్నారు.