
దుబాయ్/వాషింగ్టన్: ఇరాన్‌పై భీకర భూతల దాడులకు అమెరికా రం గం సిద్ధం చేసుకొంటోంది. ఇందులో భాగంగా ఆదివారం అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన యుద్ధనౌక యుఎస్‌ఎస్ ట్రిపోలీ పశ్చిమాసియాకు చేరింది. అయితే ఇది ఏ ప్రాంతంలో ఉందనేది వెల్లడికాలేదు. ఈ యుద్ధ నౌకలో 2,500 మంది వరకూ మెరైన్ సైనికులు ఉన్నారు. ఇ ప్పటికే ఇక్కడున్న సైన్యంతో కలిపితే ఇప్పుడు ఇక్కడ అమెరికా నావికాదళం బలం 3,500కు చేరుకుంది. ఇక్కడికి అమెరికా మెరైన్స్ చేరుకున్న విషయాన్ని యుఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్ సోషల్ మీడియా ద్వారా ప్ర కటించింది. ఇక్కడికి చేరిన ట్రిపోలీ అధునాతన ఉభయచర దాడుల సా మర్థపు యుద్ధనౌకగా పేరొందింది. అంతకు ముందు చైనాకు సవాలు విసురుతూ కొంతకాలం జపాన్ తీరంలో మొహరించుకుని ఉంది.
అతి కొద్దిరోజుల్లోనే పశ్చిమాసియాకు అత్యంత సుశిక్షితులైన పదివేల మంది వివిధ స్థాయిల సైనికులను పంపిస్తుందని ట్రంప్ ఇటీవల తెలిపారు. చర్చల్లో పురోగతి ఉందని చెపుతూనే ఇరాన్‌పై ఇకపై దాడి తీవ్రస్థాయిలో ఉంటుందని హెచ్చరిస్తూ వస్తున్నారు. గత 20 సంవత్సరాలలో ఎప్పుడూ లేని విధంగా అమెరికా సేనలు ఇప్పుడు అత్యధిక సంఖ్యలో పశ్చిమాసియాకు చేరాయి. ఇంతవరకూ వైమానిక,క్షిపణుల దాడులలో ఇరాన్ సైన్యం ఎప్పటికప్పుడు శక్తివంతంగా ఉండటం, మరో వైపు అమెరికా సైనిక స్థావరాల ఉన్నాయనే కారణంతో అత్యంత కీలకమైన గల్ఫ్ దేశాలను దెబ్బతీస్తూ ఉండటంతో వెంటనే తీవ్ర కార్యాచరణలో భాగంగా ట్రంప్ ఆదేశాలతోనే భూతలపోరుకు అమెరికా సేనలు సిద్ధం అయినట్లు వెల్లడైంది. ఈ క్రమంలో ఇప్పుడున్న బలగాలతోనే ఇరాన్ లోని అత్యంత కీలకమైన వ్యూహాత్మక ప్రాంతాల్లోకి ఇరాన్ సైనికులు చేరుకుని దాడులకు ,స్వాధీనప్రక్రియకు దిగుతారని వెల్లడైంది. అయితే తక్షణ రీతిలో భూతల దాడులకు అమెరికా దిగుతుందా? లేక మరింత అదును కోసం వేచి చూస్తుందా? అనే విషయంపై స్పష్టత రాలేదు.
అమెరికా సేనలొస్తే తగులబెట్టేస్తాం శవపేటికలే
భూతల దాడుల హెచ్చరికలపై ఇరాన్ స్పీకర్ స్పందన
అమెరికా భూతల దాడులకు సిద్ధం అవుతుందనే వార్తలపై ఇరాన్ స్పీకర్ మెహమ్మద్ బఘెర్ ఖాలిబాఫ్ తీవ్రంగా స్పందించారు. అమెరిక సేనలు ఇరాన్ నేలపైకి వచ్చే ఘడియల కోసం చూస్తున్నాం. వారు చేరుకోగానే మా మంటల్లో వారు మాడిపోవల్సిందే. వారినే కాకుండా వారి ప్రాంతీయ స్థాయి వాటాదార్లను కూడా తగు విధంగా శిక్షిస్తామని ఆయన ఘాటైన పదజాలంతో మండిపడ్డారు. అమెరికాకు ధైర్యముంటే ఇరాన్‌పై పదాతిదళ దాడులకు దిగమనండి చూద్దాం అని సవాలు విసిరారు. వారు ఇక్కడికి వస్తే తమ ప్రతీకారం ఎంతతీవ్రంగా ఉంటుందనేది వారికే కాకుండా వారి మిత్ర దేశాల వారికి కూడా తెలిసివస్తుందన్నారు. ఇక అమెరికా నుంచి వెలువడుతున్న చర్చల ప్రతిపాదన గురించి మాట్లాడుతూ వారి షరతులకు తలొగ్గేది లేదన్నారు. అమెరికా నుంచి 15 అంశాల ఫార్మూలా అందింది.
దీనిని పాకిస్థాన్ ద్వారా పంపించారు. బలప్రయోగం ద్వారా ఏదో చేయాలనుకున్న ట్రంప్ విఫలం చెంది, ఇప్పుడు ఇటువంటి ప్రతిపాదనలతో లాభం పొందాలనుకుంటున్నారని విమర్శించారు. అమెరికా ఎప్పటివరకైతే ఇరాన్ సరెండర్‌ను కోరుతూ ఉంటుందో అప్పటివరకూ తమ చేతిలో చావు దెబ్బలు తప్పవని కూడా ఇరాన్ స్పీకర్ వ్యాఖ్యానించారు. ఇక టెహరాన్ టైమ్స్‌లో తొలిపేజీలో అమెరికా సైనికులను ఉద్ధేశించి వెల్‌కమ్ టు హెల్ అని పెద్ద ప్రకటన వెలువరించారు. ఇక్కడ భూతల దాడులకు వచ్చే అమెరికా సైనికుడు ప్రతి ఒక్కరూ శవపేటికలలో తిరిగి వెళ్లేలా చేస్తామని వ్యాఖ్యానిస్తూ వార్తలు వెలువరించారు.
సౌదీ ఎయిర్‌బేస్‌పై ఇరాన్ క్షిపణిదాడులు
అమెరికా నిఘా విమానం అవాక్స్ ధ్వంసం
దుబాయ్ ః సౌదీ అరేబియాలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు తీవ్రతరం అయ్యాయి. ఆదివారం ఇరాన్ సౌదీలోని అత్యంత కీలకమైన ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై దాడికి దిగింది. అమెరికా నిర్వహణలో ఉండే ఈ ఎయిర్‌బేస్‌ను ఎంచుకుని జరిపిన దాడిలో అమెరికా శక్తివంతమైన నిఘా విమానం అవాక్స్ దెబ్బతింది. అక్కడి ఆయుధ వ్యవస్థ విధ్వంసం జరిగిందని ఇరాన్ ప్రకటించింది. అంతేకాకుండా అమెరికాకు చెందిన అనేక రిఫ్యూయలింగ్ ప్లేన్లు కూడా దెబ్బతిన్నాయని వివరించారు. ఇరాన్ ప్రెస్ టీవీ సంబంధిత ఫోటోలను విడుదల చేసింది. ఇందులో నిఘా యుద్ధ నౌక దెబ్బతిని పడి ఉన్న విషయం స్పష్టంగా ఉంది, ఇందుకు ఇరాన్ ఆరు బాలిస్టిక్ మిస్సైల్స్‌ను వాడింది. 29 డ్రోన్లను కూడా ప్రయోగించారు. ఇప్పుడు దెబ్బతిన్న అమెరికా విమానాన్ని యుఎస్‌ఇ3 సెంట్రీ అవాక్స్ విమానంగా పిలుస్తారు. ఇప్పటి ఈ ఘటనపై అమెరికా సెంట్రల్ కమాండ్ ఎటువంటి ప్రకటనా వెలువరించలేదు. ఆదివారం తమ ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్ దాడులలో అమెరికాకు చెందిన యుఎస్ ఎంక్యూ 9 డ్రోన్ , ఎఫ్ 16 ఫైటర్ జెట్‌ను దెబ్బతీశారు. అయితే ఈ విషయాన్ని ఇతర వర్గాలు ధృవీకరించలేదు.
అబూధాబిలో దాడులలో భారతీయులకు గాయాలు
అరబ్ ఏమిరేట్స్‌పై ఇరాన్ ఆదివారం క్షిపణిదాడులకు దిగింది. ఈ క్రమంలో ఆదివారం అబూధాబిలో పలువురు గాయపడ్డారు. వీరిలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారని నిర్థారణ అయింది. ఇరాన్ క్షిపణి దాడులను తిప్పికొట్టినట్లు యుఎఇ రక్షణ శాఖ తెలిపింది. శకలాల ధాటిలో ఈ ప్రాంతంలోని కెజాద్‌లో కొందరుగాయపడ్డారని వివరించారు.భారతీయులు కూడా గాయపడ్డ వారిలో ఉన్నారని వారిని చికిత్సకు ఆసుపత్రులకు తరలించామని తెలిపారు. ఇరాన్‌కు మద్దతుగా హౌతి మిలిటెంట్లు కూడా రంగలంలోకి దిగారు. వీరికి అత్యంత శక్తివంతమైన క్షిపణులు సమకూరుతున్నాయి. యెమెన్ నుంచి హౌతీ బలగాలు తమ సైన్యంపై దాడులకు దిగిన విషయాన్ని ఇజ్రాయెల్ ఆదివారం నిర్థారించింది.
.ఇస్లామాబాద్‌లో ఆశ ..గల్ఫ్ చర్చలు ఆరంభం
ఇరాన్ నుంచి షరతులతో తాజా ప్రతిపాదన?
గల్ఫ్ యుద్ధం నివారణ దిశలో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఆదివారం ఈజిప్టు, టర్కీ విదేశాంగ మంత్రులతో చర్చలు జరిపారు. ఇక్కడ ఈజిప్టు, పాకిస్థాన్ మధ్యవర్తులుగా చర్చలు వేగవంతం అయ్యాయి. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ డార్ ఆహ్వానం మేరకు ఇస్లామాబాద్ వేదికగా చర్చలకు ముందు ఈజిప్టు , టర్కీ విదేశాంగ మంత్రులతో డార్ మాట్లాడారు. సౌదీ అరేబియా , ఈజిప్టు విదేశాంగ మంత్రులు కూడా ఈ చర్చలలో పాల్గొంటారు. అమెరికా ఫార్మూలాను ఇప్పటికే పాకిస్థాన్ ఇరాన్‌కు పంపించింది. అయితే దీనిని ఇరాన్ తోసిపుచ్చింది. తాజాగా ఇరాన్ నుంచి అతి కొద్ది షరతులతో కూడిన ప్రతిపాదనను పాకిస్థాన్‌కు పంపించినట్లు వెల్లడైంది. వీటిపై ఇస్లామాబాద్‌లో విదేశాంగ మంత్రుల సమావేశంలో సమీక్షించుకుని తరువాతి కార్యాచరణకు దిగుతారని వెల్లడైంది. అయితే ఇరాన్ తాజా ప్రతిపాదనలోని అంశాలు వెంటనే వెలుగులోకి రాలేదు .