Reading Time: < 1 minute
Telugu Directors Association Letter Film Journalists Controversy

తెలుగు సినీ దర్శకుల సంఘం ఒక సంచలన లేఖ విడుదల చేసింది. వాస్తవానికి, తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్‌ను ఉద్దేశిస్తూ ఈ లేఖ రిలీజ్ చేయడం జరిగింది. నిజానికి, కొద్ది రోజుల క్రితం ఒక వెబ్ పోర్టల్‌లో పనిచేసి, ఆ సంస్థ నుంచి బయటకు వచ్చి ఇండిపెండెంట్ జర్నలిస్టుగా మారిన ఒక సీనియర్ జర్నలిస్టుని కొన్ని కారణాలతో తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ సస్పెండ్ చేసింది. రెండు నెలల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు సదరు లేఖలో పేర్కొన్నారు. అయితే, ఇప్పుడు అదే వ్యక్తిని ఉద్దేశిస్తూ తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్‌కి తెలుగు సినిమా దర్శకుల సంఘం ఒక లేఖ రాసింది. ఈ లేఖలో సదరు వ్యక్తి గురించి ప్రస్తావిస్తూ.. తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ పట్ల తమకు అపారమైన గౌరవం ఉందని, కానీ వ్యక్తి కంటే సంస్థ ముఖ్యం గనుక మీ సంస్థ ప్రతిష్టను కాపాడడానికి మీరు తీసుకునే చర్యలకు తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ తరపున సహకారం అందిస్తామని పేర్కొన్నారు.

Also Read:Aamir Khan: ‘నేను సినిమాలు చూడను’.. షాకింగ్ కామెంట్స్ చేసిన అమీర్ ఖాన్..

కానీ, సినిమా జర్నలిజంను స్వార్థ ప్రయోజనాలకు వాడుకునే వ్యక్తిని మీరు గతంలో సస్పెండ్ చేసి, తిరిగి చేర్చుకోవడంతో ఆ వ్యక్తి చేసిన కక్ష సాధింపు చర్యల వల్ల మా సభ్యులు ఎంతో నష్టపోవడం జరిగింది. తెలుగు సినిమాల ప్రచారంలో ఎంతో కీలకంగా ఉండే మీ సంస్థ సభ్యత్వాన్ని ఇలాంటి వ్యక్తులకు ఇచ్చి, వారు దుర్వినియోగం చేయడం వల్ల తెలుగు సినిమా జర్నలిజం కలుషితం అవుతోంది. కావున, మీరు సదరు వ్యక్తిపై సస్పెన్షన్ వంటి తాత్కాలిక చర్యలు కాకుండా, శాశ్వతంగా సభ్యత్వం తొలగించినట్లయితే జర్నలిజం విలువలను కాపాడిన వారవుతారు. అప్పుడే మీకు సహకరించడానికి మా అసోసియేషన్‌కి ఎలాంటి అభ్యంతరం ఉండదు అంటూ సంస్థ అధ్యక్షులు వి. ఎన్. ఆదిత్య, ప్రధాన కార్యదర్శి రామారావు, కోశాధికారి రాజేష్ మరియు మిగతా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులందరి పేరు మీద ఈ లేఖ విడుదల చేశారు. మరి దీనికి తెలుగు ఫిలిం జర్నలిస్టు అసోసియేషన్ ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాల్సి ఉంది.