Reading Time: < 1 minute

డాక్టర్లేనా అసలు ? సర్జరీ టైంలో జోకులు వేస్తూ, నవ్వుతు.. లాహోర్ ఆసుపత్రిలో నిర్వాకం!

Caption of Image.

పాకిస్థాన్‌లోని ఒక ఆసుపత్రిలో జరిగిన అమానుష ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లు, ఆపరేషన్ థియేటర్‌ను ఆట స్థలంగా మార్చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

సమాచారం ప్రకారం అసలేం జరిగిందంటే.. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఒకే ఆపరేషన్ థియేటర్‌లో ఇద్దరు రోగులకు విడివిడిగా సర్జరీలు జరుగుతున్నాయి. అక్కడ ఉన్న ఇద్దరు సర్జన్ల బృందాలు ఎవరో చెప్పినట్టుగా ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఆపరేషన్లు చేస్తున్నారు. ఎవరు ఫాస్ట్ గా సర్జరీ పూర్తి చేస్తారు అనే దానిపై అక్కడ ఉన్నవారు జోకులు వేస్తూ, నవ్వుతూ వీడియో తీశారు.

వీడియోలో ఏముందంటే 
ఆపరేషన్ థియేటర్‌లో ఇద్దరు మహిళలకు సిజేరియన్ (C-Section) జరుగుతున్నట్లు కనిపిస్తోంది. వీడియో తీస్తున్న వ్యక్తులు “త్వరగా పూర్తి చేయండి” అంటూ డాక్టర్లను ఉత్సాహపరుస్తున్నారు. రోగులు అత్యంత నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, వారి ప్రాణాలతో ఇలా చెలగాటం ఆడటంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

►ALSO READ | ఇజ్రాయెల్లో యుద్ద వ్యతిరేక నిరసనలు.. వేలాది మంది వీధుల్లోకి

నెటిజన్ల ఫైర్ 
ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. రోగుల ప్రైవసీని గాలికి వదిలేశారు.. ఇలాంటి వారికి డాక్టర్ లైసెన్స్ రద్దు చేయాలి అని ఒకరు అంటుండగా… ఆపరేషన్ థియేటర్‌లో నవ్వుతూ వీడియో తీసిన వారిని ముందు శిక్షించాలి అని మరొకరు కామెంట్ చేశారు. పాకిస్థాన్‌లో వైద్య ప్రమాణాలు ఇంతలా పడిపోవడంపై చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విచారణకు ఆదేశం
ఈ ఘటన లాహోర్‌లోని లేడీ విల్లింగ్‌డన్ ఆసుపత్రిలో జరిగినట్లు తెలుస్తోంది. వీడియో వైరల్ కావడంతో ఆసుపత్రి యాజమాన్యం సీరియస్ అయ్యింది. ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మాట్లాడుతూ.. దీనిపై ప్రత్యేక కమిటీని వేశాం. ఆపరేషన్ థియేటర్‌లోకి కెమెరా ఎలా వచ్చింది ? వీడియో ఎవరు తీశారు ? అనే విషయాలపై కూడా విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.
 

©️ VIL Media Pvt Ltd.