Reading Time: 3 minutes

చదవాల్సిన పుస్తకం:  అరతి కుమార్ రావ్, ఒక పర్యావరణ ఫోటోగ్రాఫర్, రచయిత, కళాకారిణి. నేషనల్ జియోగ్రాఫిక్ ఎక్స్పో్ల రర్‌గా పర్యావరణ క్షీణత తాలుకు ప్రభావాలను నమోదు చేస్తున్నారు. ప్రధానంగా భారత ఉపఖండంలో పనిచేస్తూ, ఆమె ప్రకృతి దృశ్యాలలో మనుషులు తెచ్చిన, తెస్తున్న మార్పులు, వాటి కారణంగా జీవనో పాధి, సంస్కృతి జీవవైవిధ్యంలో వచ్చే మార్పులను నమోదు చేస్తుంటారు. 2023 సంవత్సరపు BBC 100 మహిళల జాబితా లో ఆమెకు చోటు దక్కింది.

సామాన్యంగా మనం ఏ పుస్తకం చదివినా ఏదో రకంగా అది మన అనుభవాల్ని కదిలిస్తుంది. దీనికి కూడా స్థాయి, భేదం ఉంటుంది. ఉపశమించిన ఒక ఘర్షణ, అశాంతి, ఆగ్రహం, నిస్పృహ వంటి గాఢమైన అనుభవాలు రక్తనిష్ఠం అవుతాయి.ఒక తీవ్రత చొచ్చుకుని మనలోకి చొరబడినప్పుడు. రచయిత్రి, గంగ, బ్రహ్మపుత్ర, సుందరవనాల గురించి, ప్రధానంగా దూరదృష్టి లేని ఫరక్కా బేరేజి నిర్మాణం చర్చించినప్పుడు నాకు పాత గాయం రేగినట్టయింది. వేలాది మత్స్యకార కుటుంబాలు ఫరక్కా వల్ల మట్టిలో కలిసిపోయాయి. గంగ ప్రవాహ దిశను మార్చుకుంది. గంగలో నివసించే డాల్ఫిన్లు అంతరించాయి. మూడు నదుల్లో చేపలు తగ్గిపోయాయి. అనుభవజ్ఞులైన ఇంజినీర్లు తయారు చేసిన ఈ పథకాలు ఎందుకు వికటిస్తాయి? ఇప్పుడు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసానికి కారణం ఎవరు? ప్రజల చితికిపోయిన జీవితాలకు పూచీ ఎవరిది?

విద్యావంతులైన సాంకేతిక నిపుణులకీ, ఇంజినీర్లకీ, ప్లానర్‌లకి, రాజకీయ నాయకులకీ, డాక్టర్లకీ జ్ఞానం లేక కాదు. వారి జ్ఞానానికి పరిమితులు ఉంటాయనే జ్ఞానం లేకపోవడం, వివేకం లోపించడం. వివేచనా శక్తిలేని జ్ఞానం వినాశానికి దారి తీస్తుంది. జీవావరణ వ్యవస్థల్ని పట్టించుకోకపోవడం, వాటి గురించి తెలియకపోవడం, వాటికి హాని కలిగించే అభివృద్ధి పథకాలు ఎక్కువ కాలం మనలేవు. అదే ఉత్తరాఖండ్‌లో జరుగుతోంది. కొన్ని వందల ఉదాహరణలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఇంక రాజకీయ నాయకులకి దురహంకారం, అజ్ఞానం వల్ల ఏర్పడ్డ సంకుచిత దృష్టి. దీనికి తోడు వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరాలనే ఒకే ఒక జీవితాశయం వారి సహజ వివేచనా శక్తిని ఆవిరి చేస్తుంది. అధిక శాతం ప్రజానీకానికి ఆసక్తి లేకపోవడం వల్ల, తెలియకపోవడం వల్లా, మధ్య తరగతి స్వార్థం వల్లా, ప్రజాస్వామిక చైతన్యం లేకపోవడం వల్లా, దురదృష్టకరమైన దాస్య ప్రవృత్తి వల్లా ప్రభుత్వాల్ని ప్రశ్నించే శక్తి క్షీణించింది.

ఈ పుస్తకంలో భూమి గురించి ప్రస్తావన చాలా ఉంది. మన పూర్వజులు జీవావరణ వ్యవస్థల్ని గమనించి, వారున్న భూ స్వభావాన్ని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా తమ జీవన విధానాల్ని నిర్మించుకుని ఈ ప్రాణికోటిలో తాము కూడా ఒక భాగమనే వినమ్ర భావంతో జీవించారు. ఇతర జీవరాశుల కంటే తాము ముఖ్యమని గానీ, ఉన్నతులమని గానీ అనుకోలేదు. ఇది మన ప్రాచీనుల నైతికత. ఇటువంటి నీతి అభివృద్ధికి ఆటంకమనుకునే ప్రబలమైన అజ్ఞానం ఇవాళ అనేక ప్రభుత్వాల్ని నడిపిస్తోంది. ప్రాచీనులు జీవించినట్టు మనం జీవించలేం. కానీ వారి నైతిక స్పృహతో జీవించినప్పుడు స్వార్థపూరితమైన విధ్వంసం జరగదు. ప్రపంచ నాగరికతల్ని నిర్మించినది నేల.

మడ అడవుల పరిస్థితి గురించి రచయిత్రి సుందరవనాల లంక గ్రామాల్లో జీవిస్తున్న మత్స్యకారుల జీవితాల్ని స్వయంగా చూసి వారితో ఉండి మనకి తెలియచేసింది. సముద్రపు కోతకి గ్రామాలు ములిగిపోతున్నాయి. సముద్రపు కోత ఎందుకు ఎలా జరుగుతుందో స్పష్టంగా చెప్తోందామె. మడ అడవులు విధ్వంసం కథ, ముంబై విమానాశ్రయం. సముద్రంమీది వంతెన నిర్మాణం చాలా కాలం నుంచీ పత్రికల్లో నానుతూనే ఉంది. నగరాన్ని కాపాడే మడ అడవులు, మత్స్య సంతతి వృద్ధి చేసే మడ అడవుల్ని ఎవరి సౌకర్యం కోసం ధ్వంసం చేశారు? అసలు మన దేశంలో పర్యావరణ చట్టాల్ని ఎవరి కోసం కత్తిరించారు? ప్రస్తుతం కేరళ తీరం 60 శాతం సముద్రంలో కలిసిపోయింది. బెంగుళూరులో చెరువులను పూడ్చి టెక్ పార్కులూ, పెద్ద భవనాలూ నిర్మించిన తరువాత ఏ దుస్థితిలో ఉన్నదిప్పుడు? రియల్ ఎస్టేట్‌కి, సంపద వృద్ధి చెయ్యడానికీ ఇప్పుడు భేదం లేదిక్కడ. మనం ఏదేనా నమ్ముతాం.

ఈ పుస్తకంలో అదానీ గారి సిమెంటు కంపెనీ కేరళ తీరం కోతకు ఎట్లా కారణం అయిందో రచయిత్రి సశాస్త్రీయంగా వివరించింది. అనేక సందర్భాలలో ఇంజినీరింగ్ సొల్యూషన్స్ విఫలమౌతాయి. నదిని గానీ, సముద్రాన్ని గానీ మనం నియంత్రించి వాటి ప్రవాహమార్గాల్ని మార్చాలనుకోవడం పొరపాటు. ఇప్పుడున్న సాంకేతిక శక్తి వల్ల అటువంటిది చెయ్యడం కష్టం కాదు. రచయిత్రి తిరువనంతపురం దిగువ తీరంలో జరిగిన పెద్ద పొరపాటు చర్చించింది.

Arati Kumar థార్ ఎడారి అనుభవాలు అందరకీ తెలియాలి. ఎడారిలో శతాబ్దాల నుంచీ సుఖంగా జీవిస్తున్న ఎడారివాసుల జీవితాల్ని ఒక అభివృద్ధి ప్రణాళిక ఎలా తలకిందులు చేసిందో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. యేటికేడాది శుభ్రమైన మంచినీరు, పాలు, పెరుగు, నెయ్యి, గొర్రెలకీ ఒంటెలకీ అవసరమైన పచ్చిక సమృద్ధిగా దొరికే ఎడారిలో ఇందిరాగాంధీ నహర్ అనే ఒక కాలువని పంజాబు నుంచి తవ్వేరు. దీనివల్ల ఎడారి వాసుల నీటి వనరులు పోయాయి. పచ్చిక అంతరించింది. అనారోగ్యం ఎరుగని, దోమ అనే జీవి ఉంటుందని తెలీని ఈ దురదృష్టవంతులు రోగాల పాలయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఇంజినీర్లు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఏ ఒక్కరూ థార్ ఎడారి వాసులని మీకు మంచినీళ్లు ఎక్కణ్నించి వస్తాయని అడగలేదు. స్థానిక జీవావరణ వ్యవస్థల్ని అర్థం చేసుకోకుండా అభివృద్ధి కార్యక్రమాలు రచించకూడదు. ఇప్పుడు కాకినాడ సమీపంలో ఉప్పాడ దగ్గిర 300 కోట్ల రూపాయలు వెచ్చించి సముద్రాన్ని నిలవరించడానికి గోడకట్టే ప్రయత్నంలో ఉంది మన రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ పర్యావరణశాఖ సలహా సంప్రదింపులు జరిగాయో లేదో తెలీదు. మన పర్యావరణ చట్టాల ప్రాణం, రాష్ట్ర ప్రభుత్వాల అధికార పార్టీలకి రాజ్యసభలో ఎంతమంది సభ్యులున్నారనే దానిమీద ఆధారపడి ఉంటుందంటున్నారు.

– పతంజలి శాస్త్రి