
పాట్నా: ఫేస్‌బుక్ లైవ్ డ్యాన్ చేస్తూ జాతీయ రహదారిపై అతివేగంగా కారులో వెళ్లడంతో వాహనం పల్టీలు కొట్టి ముగ్గురు మృతి చెందిన సంఘటన బీహార్ రాష్ట్రం మధేపూరా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఘన్ శ్యామ్ కుమార్(28), వసంత్(23), అంకిత్ కుమార్(22), సాగర్(23) అనే యువకులు శ్రీరామ నవమి వేడుకలలో పాల్గొని తిరిగి కారులో వస్తున్నారు. ఫేస్‌బుక్ లైవ్ లో భోజ్‌పురి పాటలకు డ్యాన్ చేస్తూ, కేకలు వేస్తూ కారులో అతి వేగంగా ప్రయాణిస్తున్నారు. గ్వాల్ పూర్ ప్రాంతంలో కారు అదుపుతప్పి ఓ ఎలక్ట్రిక్ పోల్‌ను ఢీకొట్టింది. అనంతరం అక్కడి నుంచి 20 అడుగులు ఎత్తు ఎగిరి సుర్సార్ నదిలో పడింది. నదిలో నలుగురు గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జుగా మారింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నదిలో ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. మూడు మృతదేహాలను బయటకు తీసి స్థానిక ఆస్పత్రికి తరలించారు. సాగర్ మృతదేహం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడవద్దని, అతివేగంతో ప్రయాణం చేస్తే ప్రాణాలు పోతాయని ఈ ఘటనే నిదర్శనం. మీ సరదానే మీ ప్రాణాలు తీసిందని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.