
- ఇరాన్‌పై యుద్ధాన్ని ఆపడంలో ప్రధాని ఫెయిల్
- వామపక్ష, ప్రజాసంఘాల నేతల ఫైర్
- హైదరాబాద్‌లో భారీ ర్యాలీ, బహిరంగ సభ
హైదరాబాద్, వెలుగు: అమెరికా చేతిలో ప్రధాని మోదీ కీలుబొమ్మగా మారారని, ఆయన విశ్వగురువునని చెప్పుకోవడం సిగ్గుచేటని వామపక్ష, ప్రజా సంఘాల నేతలు విమర్శించారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు చేస్తున్న దాడులను ఆపేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాల యుద్ధాన్ని నిరసిస్తూ ఆదివారం యుద్ధ వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో చార్మినార్ నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో కాంగ్రెస్, వామపక్షాలు, టీజేఎస్ సహా విద్యార్థి, యువజన, ఉపాధ్యాయ, మహిళా, రైతు సంఘాల నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమెరికా సామ్రాజ్యవాదానికి, ప్రధాని మోదీ అనుసరిస్తున్న విదేశీ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఎగ్జిబిషన్ మైదానంలో టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె.నారాయణ మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంపద ఉన్న దేశాలపై దాడులు చేస్తూ అరాచకం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా 90 శాతం మంది ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తుంటే ప్రధాని మోదీ మాత్రం అమెరికాకు బానిసలా వ్యవహరిస్తూ నోరు మెదపకపోవడం సిగ్గుచేటన్నారు. తక్షణమే యుద్ధాన్ని ఆపేలా భారత్ చొరవ చూపాలని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ ఎలాంటి కారణం లేకుండా ఇరాన్‌పై దాడి చేయడం అమెరికా నైజమని, అమాయక ప్రజలను చంపడం అతిపెద్ద టెర్రరిజమని ఆరోపించారు.
సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు మాట్లాడుతూ బ్రిక్స్‌కు అధ్యక్షుడిగా ఉండి కూడా యుద్ధాన్ని ఖండించే సాహసం ప్రధాని మోదీ చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకుడు ఎండీ రియాజ్ మాట్లాడుతూ ఇరాన్‌తో భారత్‌కు ఉన్న చారిత్రక సంబంధాలను మోదీ విస్మరించారని, కాంగ్రెస్ ఎప్పుడూ ప్రపంచ శాంతినే కాంక్షిస్తుందని చెప్పారు.
సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ.. యుద్ధాన్ని తక్షణమే నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ అధికార ప్రతినిధి చలపతిరావు మాట్లాడుతూ గతంలో పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడి చేసినప్పుడు ప్రపంచ దేశాలు వ్యతిరేకించకపోవడంతో దానిని ఆసరాగా తీసుకుని ఇప్పుడు ఇరాన్‌పై దాడికి పాల్పడుతోందన్నారు. సీపీఐ నేతలు సయ్యద్ అజీజ్ పాషా, పశ్య పద్మ, ఏఐటీయూసీ నేత ఎస్.బాల్‌రాజు తదితరులు పాల్గొన్నారు.