
‘అభివృద్ధి పేరుతో మనం చేస్తున్నదంతా విధ్వంసమే’ అన్న ఫ్రెంచ్ తాత్వికుడు రూసోను, ‘మరేంటి మార్గం మీరే చెప్పండి’ అంటే, ఆయన తడుముకోకుండా ఇచ్చిన జవాబు, ‘ఏముంది, వెనక్కి మళ్లీ ప్రకృతిలోకే’ అని! ఇరాన్, ఇజ్రాయిల్ అమెరికా యుద్ధం, అనుబంధ పరిణామాలు మళ్లీ రూసోను గుర్తుకు తెస్తున్నాయి. యుద్ధం తో వాణిజ్య ఎల్‌పిజి, వాహనాల సిఎన్‌జీ, ఎల్‌పిజి మీద ప్రత్యక్ష ప్రభావం పడింది. ప్రభుత్వం కొరత లేదని చెబుతున్నా గృహ వినియోగ వంటగ్యాస్ మీద కూడా ప్రభావముంది. యుద్ధ ప్రభావం వల్ల ఉత్పత్తి, పంపిణి, రవాణా అతలాకుతలమై దేశంలోకి వచ్చే సరుకు నిష్పత్తి తగ్గడం వల్ల దాని ప్రభావం వచ్చే అయిదారు మాసాలు తీవ్రంగా ఉంటుంది. విదేశాల నుంచి రావాల్సిన ముడిసరుకు రాక ఔషధ తయారీ, మొత్తం ఫార్మా రంగం మీద కూడా ప్రతికూల ప్రభావం ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. యుద్ధ పరిణామాలను బట్టి ఈ ప్రతికూలత ఆపై మరింత కాలం ఉన్నా ఆశ్చర్యం లేదు. హోటళ్లు, ఫుడ్ హబ్స్, క్లబ్బులు, అతిథి గృహాలు, గురుకులాలు ఇప్పటికే ప్రభావితమయ్యాయి.
రానురాను దీని ప్రభావం ఇంకా పలు రంగాలకు, విభాగాలకు, సదుపాయాలకు విస్తరించనుంది.ఈ దిశలో ప్రస్తుత, రానున్న పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని సగటు మనిషి తన జీవనశైలిని మార్చుకోవాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. ఆహారం తయారీ, వినియోగంలోనూ మార్పుల ఆవశ్యకత ఏర్పడుతోంది. ఇలా మాట్లాడుకోవడం కొంత విడ్డూరంగానే కనిపించినా, కాదనలేని వాస్తవం! శిలాజ ఇంధనాలైన పెట్రోలు, డీజల్, సిఎన్‌జీ ఎల్‌పిజి వంటి గ్యాస్‌పెట్రో ఉత్పత్తుల మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడాల్సిన పరిస్థితి నుంచి వీలయిన మేర మనిషి వైదొలగాలి. క్రమంగానైనా సాధ్యమైన ప్రత్యామ్నాయాల వైపు మొగ్గాలి. మనకు అవేం కొత్త కాదు. ఇదివరకు మనం, మన పూర్వీకులు అనుసరించిన పద్ధతులు, విధానాలే! నిజానికి, అవే ప్రకృతి సహజ సిద్ధమైనవి, సుస్థిర జీవన విధానాల్లో భాగం తప్ప, ఇన్నాళ్లు సౌఖ్యంలా కనిపించి, ఇప్పుడు ఉన్నపళంగా ఇబ్బందిపెడుతున్నవన్నీ తాత్కాలికమైన సదుపాయాలు, సౌకర్యాలుగానే పరిగణించాలి.
ఇందుకు మానసికంగా కొంత, ఆచరణపరంగా మరికొంత మనమంతా సంసిద్ధం కావాల్సిన అవసరం ఉంది. అటువంటి ప్రత్యామ్నాయాల్లోనే ప్రకృతి అనుకూల, పర్యావరణ హిత అంశాలు ఇమిడి ఉన్నాయి. విద్యార్థులు, యువకులు, నడివయస్కులు వీలయిన ప్రతిచోట చిన్నపాటి దూరాలకు సైకిల్ వినియోగాన్ని పెంచాలి. నిర్వహణ చవకేకాక అది మన ఆరోగ్యానికీ, వాతావరణ రక్షణకు మంచిది. పూర్తిగా శిలాజ ఇంధనాలపై ఆధారపడే వాహనాల వినియోగాన్ని సుదూరాలు, సమయ అనివార్యతలున్న చోటుకు మాత్రమే పరిమితం చేయాలి. అక్కడ కూడా, వాటి స్థానే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలి. ఆ విద్యుత్తు కూడా మళ్లీ బొగ్గు అధారిత పద్ధతిలో కాకుండా సౌర, పవన వంటి పునరుత్పాదక పద్ధతిన తయారయిందిగా చూసుకోవాలి. ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పిజి), కంప్రెస్డ్ సహజ వాయువు (సిఎన్‌జి) కి ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి. మనది వ్యవసాయిక దేశం కనుక బయోగ్యాస్ వినియోగాన్ని రమారమీ పెంచాలి. ఒకప్పుడు మురికినాళాల నుంచి తయారుచేసే ‘గట్టర్ గ్యాస్’నూ వాడేది.
ఇప్పుడా మాటే ఎక్కడా వినిపించదు. పశువుల పేడనుంచి తయారు చేసే ‘గోబర్‌గ్యాస్’ వినియోగం కూడా రమారమీ తగ్గింది. పశు సంపదే పోయింది. ఉన్నచోట పేడను మధ్య ప్రాచ్య ఆసియా ఎడారి దేశాలకు ఎగుమతి చేయడమో, ఇక్కడే పంటలకు సేంద్రియ ఎరువుగా వాడటమో చేస్తున్నారు. కట్టెల పొయ్యి కూడా క్రమంగా కనుమరుగయింది. ఉప్పెనలా వచ్చిపడ్డ గ్యాస్ వినియోగం వల్ల పొయ్యిల వాడకమే పోయింది. వాడిన రోజుల్లోనూ పొగరాని పొయ్యిని మెరుగుపరచే పరిశోధనలే జరుగలేదు. పరిమితంగా జరిగిన చోట తగిన ప్రోత్సాహం లభించలేదు. అడవులతోపాటు, వాటి అంచులు అంతరించడం, భూవినియోగంలో వచ్చిన పెనుమార్పుల వల్ల ప్రభుత్వ భూములు, గైరాన్, పడావ్, బంజరు భూములంటూ లేకపోవడంతో ఒకవంక వంట చెరుక లభ్యత, మరోవైపు పశుసంతతి దేశంలో రమారమీ తగ్గింది. వంటచెరుకుతో నడిపే పొయ్యి ఇంధన సామర్థ్యం తక్కువని, 10 నుంచి 20 శాతం మంట వృథా పోతోందనే విమర్శ అప్పట్లో ఉండేది. అలవాట్లు, పద్ధతులు మారిన ఈ రోజుల్లో అది మరింత అధ్వానమే! ఎందుకంటే, వారసత్వం కొనసాగక సంప్రదాయ జ్ఞానం పోయింది. ఒకప్పుడు ఒక కర్రతో సాధ్యమైన వంట ఇప్పుడు మూడు, నాలుగు కర్రలు కాలిస్తే తప్ప సాధ్యపడకపోవచ్చు.
నైపుణ్యాలు లేవు, శిక్షణ లేదు, పరిశోధనలు సున్నా! మంట బాగుంటే మంచి వంట, వంట బాగుంటేనే మంచి ఆహారం, ఆహారం బాగుంటేనే మంచి ఆరోగ్యం సాధ్యమేది సరళరేఖా సూత్రం! శిలాజ ఇంధనాల వాడకం మానేసి, 2070 నాటికి ‘జీరో’ న్యూట్రాలిటీ సాధిస్తామని అంతర్జాతీయ సమాజానికి భారత్ మాటిచ్చింది. పెట్రోలియం ఉత్పత్తుల వాడకం మాని సౌర విద్యుత్తు, పవన, జల విద్యుత్తు వంటి ప్రత్యామ్నాయాల వైపు పూర్తిగా మళ్లాల్సిందే! ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రిక్ పొయ్యిల గురించి ఇపుడు అంతా మాట్లాడుతున్నారు. ఆ విద్యుత్తు కూడా బొగ్గుతో తయారయేది కాకూడదు. సౌర విద్యుత్తుకు సమస్యలున్నాయి. ఓటుబ్యాంకు రాజకీయాల్లో భాగంగా అందరికీ వంటగ్యాస్ సిలెండర్ ఇచ్చే సదుపాయాన్ని మన రాజకీయ వ్యవస్థ కల్పించింది. ఫలితంగా వంటకు కట్టెల పొయ్యి, ఇతర సంప్రదాయ వనరుల వాడకం కనుమరుగయింది. ‘సిలెండర్ ఇవ్వడమంటే పర్స్ ఇవ్వడం లాంటిది, పైసలివ్వటం కాదు, పైసలు ఎవరివి వారే సమకూర్చుకోవాలి.
ఇవ్వాల్టిలాగా పైసలే (గ్యాస్) లేనపుడు, పర్సు (సిలెండర్) వల్ల ప్రయోజనమేమి?’ అన్న జియోసైంటిస్ట్ డాక్టర్ సాయిభాస్కర్ మాట ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. ఆయన ఎన్నో ఏళ్లు పరిశోధన చేసి 2005 నుంచి 50 రకాల ‘సామర్థ్యం గల పొయ్యి’లను తయారు చేశారు. అందులో చిన్న ఫ్యాన్ అమర్చి తక్కువ వంట చెరుకు, ఇతర వనరుల్ని వాడి పొగ లేకుంటా ఎక్కువ నీలిరంగు మంటనిచ్చే (సామర్థ్యపు) పొయ్యిలను రూపొందించారు. మనదేశంలోనే కాకుండా కెన్యా, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్, జర్మనీ వంటి పలుదేశాల్లో వాటిని వినియోగిస్తున్నారు. వాటిపై పలు ప్రదర్శనలు జరిగాయి, పుస్తకాలు వచ్చాయి. ఆన్‌లైన్‌లో సమాచారం అందుబాటులో ఉంది. కోళ్లు తినటానికి మన జనాభా కన్నా ఇరవై రెట్లు కోళ్లను అభివృద్ధి చేసుకున్నపుడు, వంటచెరుకు కోసం అవసరమైనంత ‘ఇంధనకలప’ అభివృద్ధి చేయడంలో తప్పేమిటి? అంటారాయన. వ్యవసాయ వ్యర్థాలనూ వాడొచ్చు. తద్వారా ప్రకృతిలోని కార్బన్‌డయాక్సయిడ్ వినియోగమై ఆక్సిజన్ మనకు లభిస్తుందని, వాతావరణ కాలుష్యం తగ్గుతుందని, ఈ విధానం ప్రకృతితో సయోధ్య వంటిదంటారాయన.
యుద్ధపరిణామాలు కావచ్చు, శిలాజ ఇంధన వినియోగాలపై కట్టడి కావచ్చు.. ఇవాల్టి సంకటాన్ని ‘జాతీయ అత్యయిక పరిస్థితి’గా పరిగణించాలని, యూనివర్శిటీలు, మిలిటరీ ల్యాబొరెటరీలు, ఇతర పరిశోధనా సంస్థలు ప్రత్యామ్నాయ వంట మార్గాలపైన పరిశోధనలు జరపాలని, కోర్సులు నిర్వహించాలని, తగు శిక్షణ ఇవ్వాలని ఆయన సూచించారు. పొయ్యిల సామర్థ్యం లేక, భద్రతా ప్రమాణాలు కొరవడి దేశంలో ఏటా అయిదు లక్షల మంది మహిళలు పొయ్యి దగ్గర దుర్మరణం పాలవుతుంటే ప్రభుత్వాలకు కనిపించదా? అని ప్రశ్నిస్తారు. పూర్తిగా కాకపోయినా మన తిండి, ఆహారపు అలవాట్లూ క్రమంగా మారాల్సిందే! నూనెల్లో లోతుగా మరిగించిన (డీప్ కుక్‌డ్), మసాలాలతో నిండిన వంటలు తగ్గించి, సహజ ఆహారం, సగం ఉడికించిన ఆహారాల వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ప్రోటీన్లు ఇతర పోషకాల లభ్యతకు ప్రాధాన్యతనిస్తూ శాఖాహార పద్ధ్దతుల వైపు మళ్లాలని, క్రమంగా మాంసాహార వినియోగాన్ని తగ్గించాలనే ప్రతిపాదన వస్తోంది. ఇది దీర్ఘకాలిక ఆరోగ్యానికి, ఖరీదైన చికిత్సల కన్నా రోగాల ముందస్తు నివారణకు మంచి మార్గమని ఆహార, వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు.
సంప్రదాయ ఆహారపు అలవాట్లకు ఆధునిక శాస్త్రసాంకేతికతను జోడిస్తూ పిల్లలు, కిశోర బాలలు, యువకులు, పెద్దవాళ్లు, వృద్ధులు.. ఇలా ఎవరికి, ఏ ఆహారం సముచితమో, సహజ పద్ధతుల్లో వాటి తాయారీ నైపుణ్యాలపై పరిశోధనలు, శిక్షణ ఉండాలనే సూచన వస్తోంది. పండ్లు, గడ్డలు, జావాలు, కీర, క్యారెట్.. వంటి వాటితో ‘సలాడ్’లు, సహజ ఆహారాలను పెద్దగా వండే అవసరం లేకుండా తయారు చేసే పద్ధతులు పెరగాలంటున్నారు. యుద్ధమేఘాల నీడలో.. ఏ పరిస్థితి ఎలా ఉంది? ఏ వనరు ఎంత లభ్యం? ఏ అవసరాన్ని ఎంత కాలంలో సమకూరుస్తారు? ఏ సమస్యను ఎప్పట్లోగా, ఎలా పరిష్కరిస్తారు? ఇలా ప్రతి విషయంలో స్పష్టమైన సమాచారం (డేటా)తో డ్యాష్ బోర్డులు నిర్వహించాలి. పారదర్శకంగా ప్రజలకు తెలియపరుస్తూ ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా ఉండాలి. ప్రజలు అందుకు తగ్గ ముందస్తు ప్రణాళికతో, కనీస జాగ్రత్తలతో ఉంటారు. ఈ యుద్ధం ఆగిపోవచ్చు. రేపు ఇంకోటి రావచ్చు. పైకి ఏ కారణాలు చెప్పినా.. అక్కడ అమెరికా ఆధిపత్య పోరైనా, ఇక్కడ ప్రభుత్వాల భద్రతా నిర్వాకాలైనా నేలకింద ఉన్న చమురు కోసమో, ఖనిజాల కోసమో అని తెలిసినపుడు మనిషి రక్తం సలసలా కాగుతుంది. పారదర్శకత, దూరదృష్టి ముఖ్యం.
– దిలీప్ రెడ్డి ( సమకాలీనం)
– రచయిత పొలిటికల్ అనలిస్ట్, డైరెక్టర్ ‘ పిపుల్స్ పల్స్’ రీసెర్చి సంస్థ