Reading Time: 2 minutes

ట్రంప్ దెబ్బ.. మన స్టాక్ మార్కెట్ మటాష్ : భారీ నష్టాలకు కారణాలు ఏంటో తెలుసుకోండి..!

Caption of Image.

అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ ఇరాన్ పై యుద్ధాన్ని మరో కొత్త స్థాయికి తీసుకెళుతున్న వేళ గ్లోబల్ మార్కెట్లు కుప్పకూలాయి. ప్రధానంగా జపాన్ స్టాక్ మార్కెట్లు ఊహించని విధంగా పడిపోవటంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపైనా కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు. సోమవారం ఇంట్రాడేలో ఉదయం 10.14 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 875 పాయింట్లు నిఫ్టీ 230 పాయింట్లు నష్టంలో కొనసాగుతున్నాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ 1215 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 930 పాయింట్లు తగ్గి నష్టాల్లో ముందుకు సాగుతున్నాయి. సోమవారం స్టాక్ మార్కెట్ల భారీ పతనానికి దారితీసిన కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య మొదలైన ఉద్రిక్తతలు 5వ వారానికి చేరుకోవడం, యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు కూడా ఈ పోరులో భాగం కావడంతో అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొంది. ఈ పరిణామాలతో క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకడం, రూపాయి విలువ క్షీణించడం వంటి అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.

ముడిచమురు సెగలు:
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 3 శాతం పెరిగి 116 డాలర్లకు చేరుకుంది. 1990లో కువైట్‌పై ఇరాక్ దాడి చేసినప్పటి పరిస్థితుల కంటే ఇప్పుడు చమురు ధరలు అత్యంత వేగంగా పెరగడం గమనార్హం. దీనివల్ల భారత్ వంటి క్రూడ్ ఇంపోర్టింగ్ దేశాల్లో ద్రవ్యోల్బణం పెరిగి, జీడీపీ వృద్ధి రేటు తగ్గుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక సంవత్సరం 2027లో కార్పొరేట్ లాభాల వృద్ధి మందగించే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

బ్యాంకింగ్ రంగంపై ప్రభావం:
రూపాయి విలువలో తీవ్ర అస్థిరతను అరికట్టేందుకుRBI కఠిన చర్యలు చేపట్టింది. బ్యాంకులు తమ ఫారెక్స్ నెట్ ఓపెన్ పొజిషన్లను 100 మిలియన్ డాలర్లకు పరిమితం చేయాలని ఆదేశించడంతో బ్యాంక్ నిఫ్టీ 2 శాతానికి పైగా పడిపోయింది. ఈ నిబంధనల వల్ల బ్యాంకులు డాలర్లను విక్రయించాల్సి రావడం, గతంలో చేపట్టిన ఆర్బిట్రేజ్ ట్రేడ్ల నుంచి తప్పుకోవాల్సి రావడం మార్కెట్‌పై ఒత్తిడి పెంచింది.

విదేశీ ఇన్వెస్టర్ల ఉపసంహరణ:
మార్చి నెలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు రికార్డు స్థాయిలో రూ.లక్షా18వేల 093 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. గల్ఫ్ దేశాల నుంచి వచ్చే రెమిటెన్స్‌లు తగ్గుతాయన్న భయం, బలహీనపడుతున్న రూపాయి, యుద్ధం వల్ల ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూలతలే ఇందుకు ప్రధాన కారణాలు. ఇటు నిఫ్టీ డెరివేటివ్స్ ఎక్స్‌పైరీ కూడా తోడవడంతో ఓలటాలిటీ ఇండెక్స్ 8 శాతం పెరిగి 28.78కి చేరింది. ఇది మార్కెట్లో భయాందోళనలు ఏ స్థాయిలో ఉన్నాయో సూచిస్తోంది. 

©️ VIL Media Pvt Ltd.