Reading Time: 2 minutes

4 లక్షల కిట్‌క్యాట్ చాక్లెట్స్ చోరీ : ఈ భారీ దొంగతనంపై కంపెనీ ఫన్నీ రియాక్షన్

Caption of Image.

చాక్లెట్ ప్రియులకు తీపి కబురు చెప్పాల్సిన కిట్‌క్యాట్.. ఇప్పుడు ఒక చేదు వార్తతో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. అది కూడా సాదాసీదా దొంగతనం కాదు.. ఏకంగా 12 టన్నుల చాక్లెట్ బార్ల దోపిడీతో. అవును మీరు విన్నది నిజమే. సినిమాల్లో భారీ బంగారు బిస్కెట్ల కంటైనర్లను ఎత్తుకెళ్లినట్టు.. కొందరు దొంగలు పక్కాగా ప్లాన్ చేసి ఏకంగా కిట్‌క్యాట్ ట్రక్కునే మాయం చేశారు. ఈ దొంగతనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు జీటీఏ 6  కంటే ముందే కిట్‌క్యాట్ హీస్ట్ వచ్చేసింది అంటూ క్రేజీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

స్విస్ దిగ్గజం నెస్లే సంస్థకు చెందిన కిట్‌క్యాట్ బ్రాండ్, యూరప్‌లో తన కొత్త రేంజ్ చాక్లెట్లను మార్కెట్లోకి విడుదల చేసే క్రమంలో దొంగతనం చోటుచేసుకుంది. దాదాపు 4లక్షల14వేల చాక్లెట్ యూనిట్లతో వెళుతున్న ట్రక్కు ఇటలీ నుంచి బయలుదేరి పోలాండ్ వైపు వెళ్తుండగా మార్గమధ్యలో మాయమైపోయింది. సుమారు 12 టన్నుల బరువున్న ఈ చాక్లెట్ లోడ్ ఎక్కడ.. ఎలా దొంగిలించబడిందనేది ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంది. 

కంపెనీ అదిరిపోయే రియాక్షన్:
సాధారణంగా ఇలాంటి దొంగతనాలు జరిగినప్పుడు కంపెనీలు సీరియస్‌గా స్టేట్‌మెంట్లు ఇస్తాయి. కానీ కిట్‌క్యాట్ మాత్రం తనదైన శైలిలో పంచ్ వేసింది. “మేము ఎప్పుడూ అందరినీ కిట్‌క్యాట్‌తో ఒక ‘బ్రేక్’ తీసుకోమని చెబుతుంటాం. కానీ ఈ దొంగలు మా స్లోగన్‌ను మరీ సీరియస్‌గా తీసుకున్నట్టున్నారు.. అందుకే ఏకంగా 12 టన్నుల చాక్లెట్లతోనే బ్రేక్ తీసుకున్నారు” అంటూ రియాక్ట్ అయ్యింది. వినియోగదారుల భద్రతకు ఎలాంటి ముప్పు లేదని, మార్కెట్‌లో సరఫరాకు ఆటంకం కలగదని స్పష్టం చేస్తూనే.. అనధికారిక మార్గాల్లో అమ్మే చాక్లెట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని కస్టమర్లను హెచ్చరించింది.

►ALSO READ | ట్రంప్ దెబ్బ.. మన స్టాక్ మార్కెట్ మటాష్ : భారీ నష్టాలకు కారణాలు ఏంటో తెలుసుకోండి..!

ఇప్పుడే ఎందుకు ఇలా జరిగింది?
ప్రస్తుతం యూరప్‌లో ఈస్టర్ పండుగ సీజన్ దగ్గర పడింది. ఈ సమయంలో చాక్లెట్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. దీన్ని సొమ్ము చేసుకోవడానికే కేటుగాళ్లు ఈ భారీ స్కెచ్ వేసినట్లు కంపెనీ అనుమానిస్తోంది. దొంగిలించిన ప్రతి చాక్లెట్ బార్‌పై ఒక ప్రత్యేకమైన బ్యాచ్ కోడ్ ఉంటుందని.. ఎక్కడైనా అనుమానాస్పదంగా చాక్లెట్లు కనిపిస్తే ఆ కోడ్ స్కాన్ చేసి తమకు సమాచారం అందించాలని కంపెనీ సూచించింది. స్థానిక పోలీసులు, లాజిస్టిక్స్ భాగస్వాములతో కలిసి కిట్‌క్యాట్ ఈ స్వీట్ క్రైమ్ మిస్టరీని ఛేదించే పనిలో పడింది. ఏది ఏమైనా.. ఈ చాక్లెట్ దోపిడీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. కంపెనీకి జరిగిన నష్టం కంటే ఎక్కువగా ఫ్రీ పబ్లిసిటీని తెచ్చిపెడుతోంది. 

©️ VIL Media Pvt Ltd.