Reading Time: 3 minutes

అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైన కేరళ రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయంగా అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న పినరయి నేతృత్వం లోని వామపక్ష కూటమి (ఎల్‌డిఎఫ్) మూడోసారి అధికారం లోకి రావడానికి అభివృద్ధి మార్కుతో గట్టి ప్రయత్నాలు చేస్తుండగా, పదేళ్లుగా అధికారానికి దూరమైన కాంగ్రెస్ నాయకత్వం లోని యుడిఎఫ్ రాష్ట్రంలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న ముస్లిం క్రైస్తవ ఓటర్లను ఆకర్షించడానికి పూర్తిస్థాయిలో నిమగ్నమై ఉంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఊహించని విధంగా విజయాలను దక్కించుకున్న బిజెపి స్థానిక నాయకత్వంలో మంచి ఊపు వచ్చింది. కేంద్రం లోని ప్రధాని మోడీ తోసహా ఇతర నేతలు కేరళలో ప్రచారం ముమ్మరం చేయడంతో రాష్ట్రంలో బలమైన ముద్రవేయాలని బిజెపి భావిస్తోంది. అయితే ఇప్పుడు అన్ని పార్టీలకు ఫిరాయింపుల ప్రహసనం సమస్యగా మారింది. బిజెపి ఈమేరకు ఫిరాయింపుదార్లకు స్వాగతం పలకడం ప్రారంభించింది. కాంగ్రెస్ సీనియర్ నేతలైన ఎ.కె. ఆంటోనీ, కె. కరుణాకర్ వంటి వారి తనయలు అనిల్ ఆందోనీ, పద్మజా వేణుగోపాల్ బిజెపిలో చేరడం కాంగ్రెస్‌కు ఒక విధంగా తీవ్ర అసౌకర్యానికి గురి చేసింది.

ఇదే సమయంలో బిజెపికి చెందిన అధికార ప్రతినిధి సందీప్ వారియర్ కాంగ్రెస్ లోకి చేరడం, త్రిక్కర్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలబడడం జరిగాయి. రాష్ట్రంలో పెద్ద పార్టీ అనిపించుకున్న సిపిఎం ఐదుగురు సీనియర్ నేతలను కోల్పోయింది. వారు ప్రత్యర్థి రాజకీయ శిబిరంలో చేరారు. మాజీ మంత్రి జి. సుధాకరన్, అయిషా పొట్టి, ఎస్ రాజేంద్రన్, పికె శశి, కారత్ రసక్, వీరంతా మాజీ ఎంఎల్‌ఎలు సిపిఎంను విడిచిపెట్టేశారు. కన్నూర్ నుంచి ఇద్దరు సిపిఎం సీనియర్ నేతలు వి. కుంజు క్రిష్ణన్, టి.కె గోవిందన్ కూడా సిపిఎంను విడిచిపెట్టి వ్యవస్థాపరమైన సంక్షోభాన్ని మిగిల్చారు. నామినేషన్లకు తుది గడువు సమీపిస్తున్న తరుణంలో వర్కలాకు చెందిన సిపిఎం ఏరియా కమిటీ సభ్యురాలు స్మితా సుందరేశన్ కాషాయం నీడలో చేరడానికి నిర్ణయించడం సిపిఎంకు ఏం తోచడం లేదు. ఆమెను బిజెపి తక్షణం స్వాగతించి వర్కలా నియోజకవర్గంనుంచి బరిలోకి దింపింది. ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం సిపిఎం నాయకుడు వి. జాయ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సిపిఐకి కూడా ఫిరాయింపుల సమస్య తప్పలేదు.

ఈ పార్టీకి చెందిన ఇద్దరు మాజీ శాసనసభ్యులు కె. అజిత్, సిసి ముకుందన్ కాంగ్రెస్ మద్దతు కోసం విఫలయత్నం చేసిన తరువాత పార్టీని విడిచిపెట్టి బిజెపి గొడుగు కింద చేరారు. సిపిఎం నుంచి అనూహ్యంగా ఆ పార్టీ నాయకులు పార్టీని విడిచిపెట్టి పోవడం రాష్ట్రం లో రాజకీయ వాతావరణం మారుతోందనడానికి ప్రబల తార్కాణంగా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్)తీవ్రంగా విమర్శిస్తోంది. దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న ఎల్‌డిఎఫ్ కూటమికి ఈ ఫిరాయింపులు నిజమైన సవాళ్లను విసురుతున్నాయి. సిపిఎం తన సైద్ధాంతిక భావజాలాన్ని విస్తృతంగా వ్యక్తం చేసినప్పటికీ, ఎన్నికల ఫలితం పార్టీకి, అసమ్మతివాదులకు ఇద్దరికీ నిర్ణయాత్మకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇది తాజాగా పార్టీకి సమస్యగా తయారు కావచ్చు. ఇదిలా ఉండగా ఈసారి కేరళ అసెంబ్లీ ఎన్నికలపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం కొంత ఉంటుందని అంటున్నారు.

త్రిముఖ పోటీతో తీవ్ర ఉత్కంఠభరితంగా తయారైన ఈ ఎన్నికల పోరులో ప్రతి ఓటూ ముఖ్యమైనదే. అందుకని గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాస కేరళ ఓటర్లను ఓటింగ్‌కు రప్పించడానికి పార్టీలు అవసరమైతే ఛార్టర్డ్ విమానాలు వినియోగించాలనే యోచనలో ఉన్నాయి. కేరళ తుది జాబితా లోని 2.69 కోట్ల ఓటర్లలో 2.23 లక్షల ఓటర్లు ప్రవాస ఓటర్లేనని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. అనేక నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను వీరు నిర్ణయించే పరిస్థితి కనిపిస్తోంది. ఉదాహరణకు కోజికోడ్ లోని కుట్టేయవాడి స్థానంలో 16,002 మంది ప్రవాస ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో విజయం నిర్ణయించిన మార్జిన్ కేవలం 333 ఓట్లే కావడం గమనార్హం. పొరుగున ఉన్న నాదపురం సీటులో 12,424 ప్రవాస ఓటర్లు ఉన్నారు. ఇక్కడ విజయం నిర్ణయించిన మార్జిన్‌లో కేవలం 3385 ఓటర్లు మాత్రమే. రాష్ట్రానికి చెందిన ప్రవాస ఓటర్లలో ఎక్కువ మంది మలబార్ రీజియన్ వారే. కొజికోట్‌లో (57,679), కన్నూరులో (52163), మలప్పురం లో (39501) ఉన్నారు.

ఈ గల్ఫ్ దేశాల ఓటర్లు ఓటు వేయకపోతే కొన్ని నియోజకవర్గాల్లో వెలువడే ఫలితాలపై ప్రభావం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. గల్ఫ్ ప్రాంతంలో ఉన్న కేరళ వాసుల సంఖ్య సుమారు 22 లక్షలు. ఎన్నికలప్పుడు తమ ఓటు వేయడానికి యుఎఇ, సౌదీ అరేబియా, కువైట్ తదితర దేశాల నుంచి స్వరాష్ట్రమైన కేరళకు తిరిగి రావడం పరిపాటిగా జరుగుతోంది. ఈసారి ఎన్నికలతోపాటు ఈస్టర్, ఇతర పండగలు ఉండడంతో సొంత ప్రాంతాలకు వచ్చే వారి సంఖ్య భారీగా ఉండేది. కానీ ఇప్పుడు యుద్ధం వల్ల వారు సులభంగా స్వదేశానికి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. వచ్చినా సగానికి సగం సంఖ్య తగ్గుతుందని ప్రవాస గ్రూపులు అంచనా వేస్తున్నాయి. సాధారణంగా యుఎఇ నుంచి 8 చార్టర్డ్ విమానాలను ఏర్పాటు చేసే వాళ్లమని, ఈసారి అలాంటి పరిస్థితి లేదని యుఎఇ కేరళ ముస్లిం కల్చరల్ సెంటర్ ప్రెసిడెంట్ పుదుర్ రెహమాన్ వెల్లడించారు. ఈ ప్రభావం ఉత్తర కేరళ లోని మలప్పురం, కొజికోడ్, కాసర్‌గోడ్, పాలక్కార్, త్రిశ్శూర్, నియోజకవర్గాల్లో కనిపించనుంది. ఈ నేపథ్యంలో ముస్లిం లీగ్ జనరల్ సెక్రటరీ పిఎంఎ సలాం, సీనియర్ కాంగ్రెస్ నేత విడి సతీశన్ ఈసారి ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు ప్రవాస ఓటర్ల కోసం ఛార్టర్డ్ విమానాలను వినియోగించే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు.