దేశంలో పెట్రోల్, డీజిల్ పెరగడం అనేది కొన్ని ముఖ్యమైన అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ ముడి చమురు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పన్నుల ప్రభావం, రూపాయి విలువ పతనం , డీలర్ కమీషన్, రవాణా ఖర్చులు ఇవన్ని ఇందన ధరల మార్పుల్లో కీలక పాత్ర పోషిస్తాయి.
అంతర్జాతీయ ముడిచమురు ధరలు: పెట్రోల్, డీజిల్ తయారు కావాలంటే ముడిచమురు అనేది చాలా ముఖ్యం. మన దేశంలో ముడిచమురు నిల్వలు చాలా తక్కువ కాబట్టి మనం సుమారు 85 శాతం ముడి చమురును ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తున్నాం. కాబట్టి అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర పెరిగితే, మన దేశంలో కూడా లీటరు పెట్రోల్ ధర పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగడం లేదా ఉత్పత్తి తగ్గడం వల్ల ఈ ధరలు మారుతుంటాయి.
రూపాయి మారకం విలువ: మనం దేశం అంతర్జాతీయ మార్కెట్ నుంచి ముడి చమురును కొనుగోలు చేసేందుకు రూపాయల్లో కాకుండా అమెరికన్ డాలర్లలో చెల్లింపులు చేస్తుంది. కాబట్టి డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గితే, దిగుమతి ఖర్చులు పెరిగి ఇంధన ధరలు కూడా పెరుగుతాయి. అదే డాలర్ విలువ తగ్గితే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గుతాయి.
పన్నులు: సాధారణంగా ప్రభుత్వానికి పన్నుల ద్వారానే ఆదాయం వస్తుంది. మనం చెల్లించే పెట్రోల్, డీజిల్ ధరలో ఎక్కువ భాగం పన్నులే ఉంటాయి. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి కేంద్ర ప్రభుత్వం విధించే పన్ను, రాష్ట్రాల విధించే పన్ను. అయితే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన పన్ను రేటు ఉండటం వల్లే మన దేశంలో రాష్ట్రానికో ధర ఉంటుంది.
రిఫైనింగ్ ఖర్చులు: ముడిచమురును పెట్రోల్, డీజిల్‌గా మార్చడానికి అయ్యే ప్రక్రియను రిఫైనింగ్ అంటారు. రిఫైనరీల సామర్థ్యం, ఉపయోగించే ముడిచమురు రకాన్ని బట్టి ఈ ఖర్చులు మారుతుంటాయి, ఇది చివరకు వినియోగదారుడిపై పడే ధరను ప్రభావితం చేస్తుంది.
డిమాండ్, డీలర్ మార్జన్, రవాణా ఖర్చులు: మార్కెట్లో ఇంధనానికి ఉన్న డిమాండ్, దాని సరఫరా మధ్య సమతుల్యత కూడా ధరలను నిర్ణయిస్తుంది. డిమాండ్ ఎక్కువగా ఉండి సరఫరా తక్కువగా ఉంటే ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. అలానే చమురు కంపెనీల నుండి బంకుల వరకు చమురును చేరవేయడానికి అయ్యే రవాణా ఖర్చులు, పెట్రోల్ బంకు నిర్వాహకులకు ఇచ్చే కమీషన్ కూడా ధరలో భాగంగా ఉంటాయి. కాబట్టి ఇవి కూడా ధరల పెరుగుదలను ప్రభావింతం చేస్తాయి.





