Reading Time: 2 minutes

OTT Thriller: ఓటీటీలోకి తెలుగు క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

Caption of Image.

90s వెబ్ సిరీస్, కోర్ట్, దండోరా సినిమాలతో ఆకట్టుకున్న శివాజీ.. ఇటీవలే ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’తో వచ్చారు. క్రైమ్‌ కామెడీ ఫ్యామిలీ డ్రామాతో వచ్చిన ఈ మూవీని స్వయంగా శివాజీనే నిర్మించారు. మార్చి 6, 2026న మూవీ థియేటర్లోకి వచ్చింది.

సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శివాజీ, లయ భార్యాభర్తలుగా నటించారు. 90s వెబ్ సిరీస్‌లో శివాజీకి కొడుకుగా నటించిన యంగ్ ఆర్టిస్ట్ రోహన్ ఈ సినిమాలో కూడా అదే తరహా పాత్రలో కనిపించాడు. ప్రిన్స్, లయ, ఆలీ, రోషన్, ధనరాజ్‌ కీలక పాత్రల్లో నటించారు.

థియేటర్లో డిసెంట్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా, నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. లేటెస్ట్గా ఈ సినిమా ప్రీమియర్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. శుక్రవారం ఏప్రిల్‌ 3 నుంచి ఈటీవీ విన్‌ (ETV Win) లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది.

గమనించదగ్గ విషయం ఏమిటంటే, మొదట ఈ సినిమాను ఫిబ్రవరి 12న నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే, చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకుని థియేటర్లలో రిలీజ్ చేశారు. అక్కడ ప్రేక్షకుల నుంచి మంచి స్పందనతో పాటు డీసెంట్ కలెక్షన్స్ కూడా సాధించింది.

ఇప్పుడు థియేట్రికల్ రన్ ముగియడంతో, మళ్లీ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. థియేటర్లలో మిస్ అయిన వారికి, ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమా మరో అవకాశం ఇవ్వబోతోంది.

కథేంటంటే:

శ్రీరామ్ (శివాజీ) ఒక నిజాయితీ గల పంచాయితీ సెక్రటరీ. భార్య ఉత్తర (లయ), కొడుకు బిట్టు (రోహన్). ఇలా శ్రీరామ్ తన ఫ్యామిలీతో సాదాసీదా జీవితం గడుపుతుంటాడు. చూడటానికి వీళ్లది చాలా సింపుల్ ఫ్యామిలీ. కానీ, డిఫెరెంట్ మనస్తత్వం ఉన్న ఫ్యామిలీ కూడా!

శ్రీరామ్ పంచాయితీ కార్య‌ద‌ర్శిగా సక్రమంగా విధులు నిర్వర్తిస్తూ పేరు సంపాదించుకుంటాడు. అలా మంచికి మారుపేరైన వ్యక్తిగా, తప్పును సమర్థించని మనస్తత్వం కలిగిన వాడిగా పనిచేస్తాడు. ఈ క్రమంలోనే ఆడవాళ్ల పిచ్చి ఉన్న స్థానిక ఎస్సై విక్రమ్ (ప్రిన్స్).. శ్రీరామ్ భార్య ఉత్తరపై కన్నేస్తాడు.

►ALSO READ | డాన్ బాస్కో మూవీ షూట్ కంప్లీట్

ఇదే సమయంలో, శ్రీరామ్ ఇంట్లో లేని టైం చూసుకుని వారి ఇంటికి వెళతాడు. అక్కడ జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ద్వారా విక్రమ్ అనూహ్యంగా హత్యకు గురవుతాడు. అప్పటివరకు ఓ వింత చేష్టలతో గడిపే శ్రీరామ్ ఫ్యామిలీ, ఎస్సై విక్రమ్ చావుతో ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది.

అసలు ఎస్సై విక్రమ్ని ఎవరు, ఎలా చంపారు? ఈ క్రైమ్ నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి శ్రీరామ్ ఏం చేశాడు? శవాన్ని మాయం చేసే ప్రయత్నంలో శ్రీరామ్కి ఎదురైన గందరగోళం ఏంటి? మరోవైపు, కోటి రూపాయల గిఫ్ట్ బ్యాగ్ కోసం ఎలాంటి తతంగం నడిచింది? ఈ గందరగోళంలో కానిస్టేబుల్ సుధీర్ (ధనరాజ్), లోకల్ ఎమ్మెల్యే పాత్ర ఎంత? చివరికి శ్రీరామ్ ఫ్యామిలీ ఈ క్రైమ్ నుంచి బయట పడిందా? లేదా అన్నదే మిగతా కథ. 

విశ్లేషణ

క్రైమ్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను కలిపి దర్శకుడు సుధీర్ శ్రీరామ్ చాలా చక్కగా తెరకెక్కించాడు. శ్రీరామ్ పాత్ర సాంప్రదాయానికి అనుగుణంగా ఉంటే, ఉత్తర పాత్ర సుప్పనాతితనంతో ఉంటుంది. మిక్కీ పాత్ర సుద్దపూసలా కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. ఈ విధంగా వీరి క్యారెక్టర్లతో సినిమా టైటిల్కి న్యాయం చేశాడు డైరెక్టర్ సుధీర్. 

ఫస్టాఫ్ శ్రీరామ్ కుటుంబం చుట్టూ తిరిగే సరదా సన్నివేశాలు, వారి డిఫరెంట్ బిహేవియర్ ప్రేక్షకులను నవ్విస్తాయి. ముఖ్యంగా ఎస్సై విక్రమ్ హత్య తర్వాత కథ అసలు ట్రాక్‌లోకి వచ్చి క్రైమ్ కామెడీగా మారుతుంది.

శవాన్ని మాయం చేసే క్రమంలో వచ్చే గందరగోళం, కామెడీ సన్నివేశాలు వినోదాన్ని పంచుతాయి.అదే సమయంలో కథలో సస్పెన్స్ కూడా కొనసాగుతుంది. అయితే, కొన్ని చోట్ల కథనం నెమ్మదిగా అనిపించే ఛాన్స్ ఉంటుంది. 

అయినప్పటికీ కామెడీ ట్రాక్, ట్విస్ట్‌లు సినిమాను ఆసక్తికరంగా తీసుకెళ్తోంది. శివాజీ, లయ తమ పాత్రల్లో సహజంగా నటించి ఆకట్టుకున్నారు. మొత్తంగా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఎంటర్‌టైన్ చేసే క్రైమ్ కామెడీ ఫ్యామిలీ డ్రామా.

©️ VIL Media Pvt Ltd.