Reading Time: 2 minutes

ఉద్యోగం ఉంది.. జీతం వస్తుంది అయినా.. : అప్పులు, ఆందోళనలతో జీవితాలు నెట్టుకొస్తున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్

Caption of Image.

భారతదేశ మధ్యతరగతి కల ఇప్పుడు ఒక నిశ్శబ్ద సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఒకప్పుడు ఇంజనీరింగ్ లేదా కామర్స్ డిగ్రీ ఉంటే జీవితం సెటిల్ అయిపోతుందనే నమ్మకం ఉండేది. కానీ ప్రస్తుత కాలంలో ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల నుంచి డిగ్రీలు పొందుతున్న విద్యార్థులు కూడా నిరుద్యోగంతో లేదంటే తక్కువ జీతాలతో సతమతమవుతున్నారు. నవీ ముంబైలోని ఒక కంట్రోల్ రూమ్ నుంచి 100 మంది ఆపరేటర్లు 30వేల ఏటీఎంలను పర్యవేక్షిస్తుండటం అనేది మారుతున్న కాలానికి నిదర్శనం. గతంలో ఈ పని కోసం 60వేల మంది సెక్యూరిటీ గార్డులు ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ స్థానాన్ని ఏఐ బాట్స్, సెన్సార్లు భర్తీ చేశాయి. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే; దేశవ్యాప్తంగా ఆటోమేషన్, ఏఐ మధ్యతరగతి జీవనాధారమైన క్లరికల్, సేల్స్, ఐటీ ఉద్యోగాలను మింగేస్తున్నాయి.

ఆదాయం కంటే వేగంగా ఖర్చులు:
మధ్యతరగతి ప్రజల ఆదాయం గత దశాబ్దంలో నామమాత్రంగా పెరిగితే.. ఖర్చులు మాత్రం రెట్టింపు వేగంతో దూసుకుపోతున్నాయి. హెల్త్ కేర్ ఖర్చులు ఏటా 14 శాతం, ఎడ్యుకేషన్ 8-10 శాతం, ఫుడ్ ఖర్చులు 11 శాతం పెరుగుతున్నాయి. ఒక అంచనా ప్రకారం 2016లో నెలకు ఒక లక్ష రూపాయలతో హాయిగా బతికిన కుటుంబం.. ప్రస్తుతం అదే స్థాయి జీవనం గడపాలంటే రెండు లక్షల రూపాయలు అవసరమవుతున్నాయట. కానీ జీతాలు మాత్రం ఆ స్థాయిలో పెరగలేదు. దీనివల్ల సాధారణ మధ్యతరగతి కుటుంబం ప్రతి సంవత్సరం ఆర్థికంగా వెనుకబడిపోతోంది. ఈ అంతరాన్ని పూడ్చుకోవడానికి చాలామంది అప్పుల ఊబిలోకి దిగుతున్నారు.

రుణాల ఊబిలో మిడిల్ క్లాస్:

పెరుగుతున్న ఖర్చులను భరించడానికి భారతీయులు పర్సనల్ లోన్స్ పై ఎక్కువగా ఆధారపడుతున్నారు. మన దేశంలోని గృహేతర అప్పుల శాతం అమెరికా, చైనా కంటే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని నిపుణులు అంటున్నారు. ఇందులో విషాదం ఏమిటంటే.. ఈ అప్పులు ఆస్తుల సృష్టి కోసం కాకుండా, కేవలం ఇంటి అద్దెలు, మెడికల్ బిల్స్, స్కూల్ ఫీజుల వంటి అవసరాల కోసం వాడుతున్నారు. మరోవైపు చదువుకున్న యువత తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో స్టాక్ మార్కెట్లో F&O ట్రేడింగ్ చేసి కోట్లాది రూపాయలు నష్టపోతున్నారు. దాదాపు 90 లక్షల మంది భారతీయులు ఏటా రూ.లక్ష కోట్లకు పైనే డబ్బుఈ రకమైన ట్రేడింగ్‌లో పోగొట్టుకుంటున్నారని తేలింది.

►ALSO READ | 4 లక్షల కిట్‌క్యాట్ చాక్లెట్స్ చోరీ : ఈ భారీ దొంగతనంపై కంపెనీ ఫన్నీ రియాక్షన్

దేశంలో డిగ్రీ ఉన్నవారిలో నిరుద్యోగిత శాతం 29.1%గా ఉంది. అసలు బడికి వెళ్లని వారి కంటే తొమ్మిది రెట్లు ఎక్కువగా ఉండటం ఆశ్చర్యకరం. ఏటా 80 లక్షల మంది గ్రాడ్యుయేట్లు మార్కెట్లోకి వస్తున్నా.. వైట్ కాలర్ ఉద్యోగాల వృద్ధి రేటు 11 శాతం నుండి 1 శాతానికి పడిపోయింది. ఐటీ రంగం నియామకాలను భారీగా తగ్గించుకుంది. మధ్యతరగతి ప్రజలు ఖర్చు చేయడం తగ్గిస్తే.. మార్కెట్లో డిమాండ్ తగ్గి, తద్వారా కొత్త ఉద్యోగాలు రావు. ఈ పరిస్థితులతో దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న వినియోగం దారుణంగా పడిపోయింది. పన్నులు కడుతూ దేశాన్ని నడిపిస్తున్న ఈ 40 మిలియన్ల మధ్యతరగతి ప్రజలు ప్రస్తుతం అటు రాజకీయంగా గొంతుక లేక, ఇటు ఆర్థికంగా భద్రత లేక వేదన అనుభవిస్తోంది.

©️ VIL Media Pvt Ltd.