Reading Time: 2 minutes

హైదరాబాద్: ఔటరింగ్ రోడ్డులో సతీష్ షా ల్యాండ్ పోయిందని బెదిరింపులకు గురిచేశారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. స్థలం ఇచ్చే ఉద్దేశం లేదని షా కుటుంబం తెలిపింది అని అన్నారు. గౌలిదొడ్డిలోని భూమిని బిఆర్ఎస్ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ.. వట్టినాగులపల్లిలో సతీష్ షా కుటుంబం 60 ఏళ్లుగా ఉంటున్నారని రూ.1400 కోట్ల విలువ చేసే భూమిపై కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కన్నుపడిందని విమర్శించారు. ఓ అక్రమార్కుని అడ్డం పెట్టుకుని 27 ఎకరాల భూమిని గుంజుకునే ప్రయత్నం చేశారని, సతీష్ షా ను ఇక్కడే సజీవంగా పాతిపెడతామని బెదిరించారని మండిపడ్డారు. అబీబుల్లా ఖాన్ అనే సిన్సియర్ అధికారి వీరికి రక్షణ కల్పించారని, తెల్లారే ఆ నిజాయితీ పోలీసు అధికారిని ట్రాన్స్ ఫర్ చేశారని కెటిఆర్ తెలియజేశారు. సిఎం రేవంత్ రెడ్డి పలుకుబడిని అడ్డుపెట్టుకుని భూములు గుంజుకుంటున్నారని, భూమి బౌండరీలను మార్చే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు.

మహేశ్వరం నియోజకవర్గంలో వేల ఎకరాలు కబ్జా చేస్తున్నారని, అధికారులను అడ్డు పెట్టుకుని అరాచకత్వం చేపడుతున్నారని దుయ్యబట్టారు. కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టారని, సతీష్ షా లాంటి ఎందరో బాధితులు ఇంకా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నేనే రాజు.. నేనే మంత్రి మా రాజ్యం ఇష్టమున్నట్లు చేస్తాం అనేలా..ధిక్కార ధోరణితో రాష్ట్రంలో గూండాగిరి రాజ్యం కొనసాగుతుందని అన్నారు. పొంగులేటి అక్రమాలపై సభా సంఘం వేయమని కోరుతున్నామని సూచించారు. వందల క్రషర్లు కొనసాగుతున్నాయని సభా సంఘం వేయమని కోరుతుతన్నామని కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో చేర్చడంపై గవర్నర్ వద్దకు వెళ్తామని అన్నారు.

అవసరమైతే కోర్టుకు వెళ్తాం.. న్యాయం జరిగేలా చూస్తామని, తమకు పోలీసు అధికారి గతి పడుతుందేమోనని పోలీసులు భయపడుతున్నారు అని పేర్కొన్నారు. పోలీసులు ప్రజల వైపు నిలబడాలని..అక్రమాలకు అండగా నిలబడొద్దని కోరుతున్నామని, నిజాం కాలం నుంచి ఉన్న భూములను నిషేధిత జాబితాలో పెట్టారని పలువురు బాధపడుతున్నారని అన్నారు. తమ పేర్లు బయట పెట్టవద్దని వారు అంటున్నారని చెప్పారు. తమ పేర్లు బయటపెట్టకుండా చూస్తామని, తమ లీగల్ సెల్ ద్వారా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కోటి ఎకరాల భూమి అక్రమంగా గుంజుకోవాలనుకునే యత్నాన్ని అడ్డుకుంటామని, సిబిసిఐడి ఎంక్వయిరీ వేసి పొంగులేటిని కాపాడాలని చూస్తున్నారని అన్నారు. మంత్రి రాజీనామా చేస్తేనే సిబిసిఐడి నిష్పక్షపాతంగా పనిచేస్తుందని, భూకుంభకోణాలు, మైనింగ్ కుంభకోణాలను బయటపెడతామని కెటిఆర్ సవాల్ విసిరారు.