
సహ జీవనంలో ఉన్న జంటలకు భారత ప్రభుత్వం ఇకపై కుటుంబ హోదా కల్పించాలని నిర్ణయించింది. అయితే తాము చాలా సంవత్సరాలుగా సహ జీవనంలో ఉన్నట్లు ఆ జంట నిర్ధారిస్తేనే ఈ కుటుంబ హోదాను ప్రభుత్వం కల్పిస్తుంది.
స్వీయ గణన పోర్టల్లో ఈ విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశ 16వ జనాభా లెక్కల సమయంలో అడిగే ప్రశ్నలకు సులభంగా సమాధానాలు ఇచ్చేందుకు వీలుగా, ఈ పోర్టల్‌లో తరచుగా అడిగే ప్రశ్నల (FAQs) జాబితా ఉంది. 2026 ఏప్రిల్ 1 నుంచి మన దేశంలో జనగణన మొదలవుతున్న సంగతి తెలిసిందే.
మొత్తం 33 ప్రశ్నలను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ 33 ప్రశ్నల్లో.. ‘‘సహజీవనం చేస్తున్న జంటను పెళ్లైన జంటగా పరిగణిస్తారా?’’ అనే ప్రశ్న కూడా ఉంది. సహ జీవనం చేస్తున్న జంట వారి సంబంధాన్ని ఒక స్థిరమైన, చాలా ఏళ్లుగా కలిసి ఉంటున్న బంధంగా నిర్ధారిస్తే.. వారిని కూడా పెళ్లైన జంటగా.. ఒక కుటుంబంగా పరిగణించాలని ఈ ప్రశ్నకు సమాధానంగా FAQలో స్పష్టంగా ఉంది.
ఈసారి జనగణన పూర్తిగా డిజిటల్ రూపంలో జరగబోతున్నది. టాబ్లెట్‌ల ద్వారా డేటా సేకరిస్తారు. తొలి దశలో ఏప్రిల్-సెప్టెంబర్ 2026 మధ్య కాలంలో గృహ జాబితా తయారీ, రెండో దశలో ఫిబ్రవరి 2027 నుంచి జన, కులగణన జరగనున్నాయి. ప్రభుత్వం అందించే పోర్టల్, మొబైల్ యాప్ ద్వారా స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నది. ఇందుకోసం 16 భాషలతో కూడిన మొబైల్ యాప్‌లను రెడీ చేస్తున్నారు. డేటా మాత్రం సేఫ్‌గా ఉంటుందని హోంశాఖ భరోసా ఇచ్చింది. జనగణనలో జనాభాతో పాటు కుల గణన కూడా చేపడ్తారు.
జనాభా లెక్కల సేకరణ కోసం 30కి పైగా ప్రశ్నలను కేంద్రం సిద్ధం చేసింది. ప్రతీ రాష్ట్రంలో 2 దఫాల్లో జనగణన నిర్వహిస్తున్నట్లు హోంశాఖ అధికారులు ప్రకటించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం.. దేశ జనాభా 121 కోట్లు. ఇందులో 62.27 కోట్ల మంది (51.54 శాతం) పురుషులు ఉండగా.. 58.64 కోట్ల మంది (48.46 శాతం) స్త్రీలు ఉన్నారు. కాగా, 2027 జన గణనలో ఎస్సీలు, ఎస్టీలు మాత్రమే కాకుండా ఓబీసీలు సహా అన్ని కులాలను కవర్ చేసేలా కులగణన ఉండనున్నది.
ఫస్ట్ ఫేజ్లో.. హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ (హెచ్ఎల్వో) నిర్వహిస్తారు. ఇందులో ప్రతీ ఇంటి కండీషన్ ఎలా ఉంది? ఎన్ని ఆస్తులు ఉన్నాయి? ఇంట్లో ఉన్న సౌలత్లకు సంబంధించిన డేటాను సేకరిస్తారు. సెకండ్ ఫేజ్లో.. పాపులేషన్ ఎన్యుమరేషన్ (పీఈ) చేపడ్తారు. ఈ స్టెప్‌లో ఒక్కో ఇంట్లో ఎంత మంది నివాసం ఉంటున్నారు? సామాజిక, ఆర్థిక పరిస్థితి ఏంటి? ప్రతి వ్యక్తి కల్చరల్ డీటెయిల్స్ సేకరిస్తారు. ఈ ఫేజ్‌లోనే సదరు వ్యక్తి కులం తెలుసుకుంటారు. క్యాస్ట్, సబ్ క్యాస్ట్, ఒక్కో కుటుంబంలో ఎంత మంది ఉన్నారనే వివరాలు సేకరించి డిజిటలైజ్ చేస్తారు.