Reading Time: 2 minutes
Sunil Narine Creates Ipl History Most Matches By A Foreign Player Surpasses Pollard

Sunil Narine Creates IPL History: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో వెస్టిండీస్ మిస్టరీ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన విదేశీ ఆటగాడిగా నరైన్ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ 2026లో ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున బరిలోకి దిగడంతో ఈ రికార్డు నెలకొల్పాడు. ఇది నరైన్‌కు 190వ ఐపీఎల్ మ్యాచ్ కావడం విశేషం. అన్ని మ్యాచ్‌లను కేకేఆర్ తరఫునే ఆడడం విశేషం.

సునీల్‌ నరైన్‌ తన సహచర వెస్టిండీస్ ఆటగాడు కీరన్‌ పొలార్డ్‌ రికార్డును అధిగమించాడు. పోలార్డ్ ముంబై ఇండియన్స్ తరఫున 189 మ్యాచ్‌లు ఆడగా.. నరైన్ ఇప్పుడు 190 మ్యాచ్‌లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో ఏబీ డివిలియర్స్‌ (184 – ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), డేవిడ్‌ వార్నర్‌ (184 – ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్), డ్వేన్ బ్రావో (161 – చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ లయన్స్, ముంబై ఇండియన్స్) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Also Read: MI vs KKR: ముంబై-కోల్‌కతా మ్యాచ్‌లో సినీ తారల సందడి.. స్పెషల్ అట్రాక్షన్‌గా ‘ధురంధర్’ బ్యూటీ, వీడియో వైరల్!

సునీల్ నరైన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ 2012 వేలంలో రూ. 3.4 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లోనే జట్టుకు టైటిల్ అందించిన నరైన్.. ఆ తర్వాత కూడా రెండు సార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచాడు. ప్రారంభంలో మిస్టరీ స్పిన్నర్‌గా గుర్తింపు పొందిన నరైన్.. కాలక్రమేణా అద్భుతమైన ఆల్‌రౌండర్‌గా మారాడు. బౌలింగ్‌లో ఇప్పటివరకు 187 ఇన్నింగ్స్‌లలో 192 వికెట్లు తీశాడు. ఇందులో ఏడు సార్లు నాలుగు వికెట్లు, ఒకసారి ఐదు వికెట్లు సాధించాడు. బ్యాటింగ్‌లో 122 ఇన్నింగ్స్‌లలో 1780 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఏడు అర్ధశతకాలు ఉన్నాయి. 2024 సీజన్ నరైన్‌కు ప్రత్యేకంగా నిలిచింది. ఆ సీజన్‌లో 488 పరుగులు చేసి, 17 వికెట్లు పడగొట్టి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెరిశాడు. ఈ ప్రదర్శనతో అతడిని 2025 వేలానికి ముందు కేకేఆర్ రూ. 12 కోట్లకు రిటైన్ చేసింది. అయితే 2025 సీజన్‌లో 12 మ్యాచ్‌లలో 12 వికెట్లు మాత్రమే తీసి, బ్యాటింగ్‌లో 246 పరుగులు మాత్రమే చేశాడు.

ఐపీఎల్‌లో విదేశీ ఆటగాళ్ల అత్యధిక మ్యాచ్‌లు:
190 – సునీల్ నరైన్ (కోల్‌కతా నైట్ రైడర్స్)
189 – కీరన్‌ పోలార్డ్ (ముంబై ఇండియన్స్)
184 – ఏబీ డివిలియర్స్‌ (ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
184 – డేవిడ్‌ వార్నర్‌ (ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్)
161 – డ్వేన్ బ్రావో (చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ లయన్స్, ముంబై ఇండియన్స్)