
పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో వివాదాలు ఒక దాని తర్వాత ఒకటి బయటపడుతున్నాయి. తొలుత బంతి రంగు మార్పు వివాదం బయటపడగా.. ఆ తర్వాత పలువురు ఆటగాళ్లు, కామెంటేటర్ కూడా మాకొద్దు బాబోయ్ అంటూ ఆ లీగ్ నుంచి బయటకు వచ్చారు. వారందరూ ఐపిఎల్‌లో చేరడం గమనార్హం. అయితే తాజాగా పిఎస్‌ఎల్‌లో బాల్ టాంపరింగ్ కలకలం సృష్టించింది. పిఎస్‌ఎల్‌లో లాహోర్ ఖ్వాలండర్-కరాచీ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన జరిగినట్లు వార్తలు వచ్చాయి.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన కరాచీ 19 ఓవర్లలో 115/5 స్కోర్ వద్ద నిలిచింది. చివరి ఓవర్‌లో కరాచీ విజయానికి ఇంకా 14 పరుగులు అవసరం ఉంది. ఆ చివరి ఓవర్ వేసేందుకు హారిస్ రఫూఫ్‌కి కెప్టెన్ షహీన్ షా అఫ్రిదీ బంతిని ఇచ్చాడు. ఈ క్రమంలో రఫూఫ్‌తో ఫకర్ జమాన్, షహీన్ కాసేపు చర్చ జరిపారు. ఈ సమయంలో ఫకర్ బాల్ టాంపరింగ్ చేసినట్లు ఫీల్డ్ అంపైర్లు గుర్తించారు. బంతి ఆకారాన్ని మార్చేందుకు అతడు ప్రయత్నించినట్లు తెలియడంతో లాహోర్‌కు ఐదు పరుగులు పెనాల్టీ విధించారు.
దీంతో కరాచీ విజయానికి 9 పరుగులే లక్ష్యంగా మారింది. ఈ ఓవర్‌లో మొదటి బంతికే రవూఫ్.. ఖుష్దిల్‌ని ఔట్ చేశాడు. ఆ తర్వాత వైడ్ వేసిన రవూఫ్.. ఆ తర్వాతి ఓ ఫోర్ ఇచ్చాడు. మూడో బంతికి అబ్బాస్ అఫ్రిదీ సిక్స్ కొట్టి తన జట్టు కరాచీని గెలిపించాడు. ఒకవేళ ఆ ఐదు పరుగులే ఉండి ఉంటే.. పోటీ కాస్త తీవ్రంగా ఉండేది. లాహోర్ గెలిచే అవకాశాలు ఉండేవని విశ్లేషకులు అంచనా వేశారు. అయితే బాల్ టాంపరింగ్ గురించి తమకు తెలియదని షహీన్ అఫ్రిదీ అన్నాడు. అక్కడ కెమెరాల్లో చూడొచ్చని.. తాము కేవలం చివరి ఓవర్ గురించి చర్చించుకున్నామని పేర్కొన్నాడు. అయినా సరే, ప్రత్యర్థి జట్టుకు ఐదు పరుగులు పెనాల్టీ రూపంలో వెళ్లిందని.. ఈ విషయంలో తాము చేసేదేమీ లేదని వాపోయాడు.
This is so Shameful
— Ehtisham Siddique (@iMShami_) March 29, 2026