Reading Time: 2 minutes

నేను, నా సాహితీయాత్ర: 1974లో నా పదమూడవ ఏట నా సాహిత్య ప్రయాణం మొదలయింది. వరంగల్ జిల్లా ఖానాపురం అనే గ్రామంలో ఎనిమిదవ తరగతి చదువుతున్నపుడు మా తెలుగు ఉపాధ్యాయుడు తేలు లక్ష్మీనారాయణ గారి ప్రోత్సాహంతో కవితలను రాయడం మొదలుపెట్టాను. స్కూలు వార్షికోత్సవ కార్యక్రమంలో కొన్ని వందల మంది గ్రామస్తుల సమక్షంలో నా తొలి కవితను చదివే అవకాశాన్ని పొందాను. స్కూల్ రోజుల్లో కొన్ని పద్యాలు రాశాను. నేను రాసిన తొలి కథ ‘వెలుగు రేఖలు’ 1978లో యోజన అనే పత్రికలో అచ్చయింది. కవిత్వం వైపు పూర్తిగా మళ్లడం వల్ల మళ్ళీ నేను కథలు రాయలేదు. నేను వ్యవసాయ ఆర్థిక శాస్త్రంలో MSc (Ag) పూ ర్తి చేసాక 1984లో ఆంధ్రా బ్యాంక్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా ఉద్యోగంలో చేరి కలకత్తాలో, హుబ్లిలో పనిచేసి పొన్నూరుకు వచ్చాను. అక్కడ ఉన్నప్పుడే తుమ్మపూడిలో ఉండే సంజీవదేవ్‌తో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాను.

గుంటూరులో ఉన్న కాలంలో పా పినేని శివశంకర్ గారి ద్వారా ఎన్నో సాహిత్యవిషయాలను తెలుసుకున్నాను. అక్కడే ‘చినుకు’ అనే బులెటిన్‌కు సహ సంపాదకుడిగా పనిచేసాను. రోమిలా థాపర్ రాసిన Sati in history అనే దీర్ఘ వ్యాసాన్ని చరిత్రలో సతిగా అనువదించాను. దాన్ని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఒక చిన్న పుస్తకంగా ప్రచురించింది. 1987లో నా తొలి కవితా సంపుటి ‘జీవన వీచిక’ ను తెనాలిలో సంజీవదేవ్ గారు ఆవిష్కరించారు. ఆ తర్వాత వచ్చిన నా కవితా సంపుటులు ఇవి: ప్రవాహం (1992), ముఖాముఖం (1995), వేళ్ళు మాట్లాడే వేళ (1999), ఆట (దీర్ఘ కవిత – 2001), నాగటిచాళ్ళు (2004), నేల గంధం (2009), పొలం గొంతుక (2013), పత్రహరితం (2016). ధాన్యం గింజలు (2019), బాలల కోసం బాటసారి పదాలు (2020), జొన్నచేను ముందు (2023). నా లేఖా సంపుటి 2021లో పలకరింపుగా వెలువడింది.

నా విమర్శ వ్యాసాల సంపుటి ఇష ్టవాక్యం (2012)లో వచ్చింది. అమితావ్ ఘోష్, మహాశ్వేతా దేవి, వాసుదేవ నాయర్, దామోదర్ మౌజోలతో పాటు మరి కొందరితో నేను చేసిన ఇంటర్వ్యూల సంపుటి అనుభవం మాట్లాడింది (2025)లో. నా తొలి ఆంగ్ల కవితా సంపుటి Scents of the Soil (2016)లో వచ్చింది. నా కవితలను కొన్నింటిని దేశెట్టి కేశవరావు ఆంగ్లంలోకి అనువదించగా Green Fingers and other poems అనే సంపుటిగా తెచ్చాను. వ్యవసాయం, నా యాత్రలు, మానవ సంబంధాలు, రాజకీయాల తీరుతెన్నులు, నా లోపలి చింతనలూ ఉహలూ స్థూలంగా ఇవీ నా కవితా వస్తువులు. నా కవితలు సరళంగా, గాఢతతో, దృశ్యమానంగా వుండాలని అభిలషిస్తూ ఆ దిశగా సాధన చేసాను. 2004 నుంచి 2014 వరకు వెలువడిన కవిత వార్షిక సంచికలకు సహ సంపాదకుడిని. 2015 నుంచి 2024వరకు సంపాదకుడిగా కవిత్వం వార్షిక సంచికలను రూపొందించాను.

కాళోజీతో సహా ఎందరినుంచో నేను స్ఫూర్తిని పొందాను. సాహిత్యం ప్రజాహితానికీ, మానవ సంస్కారానికీ దోహదం చేయాలని నా నిశ్చితాభిప్రాయం. నా కవిత్వానికీ, నా వ్యక్తిత్వానికీ నడుమ భేదం ఉండకూడదనీ, నేను కవిత్వంలో ప్రతిపాదించే విలువలకు భిన్నంగా జీవించకూడదనీ నాకు నేను పెట్టుకున్న ప్రమాణాలు. నా ప్రయాణంలో ఫ్రీవర్స్ ఫ్రంట్, సినారె పురస్కా రం, గరికిపాటి పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయ సాహిత్య పురస్కారం, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ సాహితీ పురస్కారంతో పాటు దాదాపు ఇరవై అయిదు పురస్కారాలను పొందాను. 1992లో బ య్యారం అనే ఊళ్లో రైతులమీద నేను రాసిన కవిత ను చదివినపుడు, అక్కడ కొందరు రైతులు నన్ను సమీపించి మా గురించి రాశారు, చాలా సంతోషం గా ఉంది అని అన్నారు. అది నా సాహిత్య జీవితం లో నేను పొందిన అత్యున్నత పురస్కారమని అనుకుంటాను. నా విస్తార సాహిత్య ప్రయాణానికి నా సహచరి కమల, పిల్లలు మానస రవళి, చైత్ర మౌ నిక అందించిన తోడ్పాటును మాటల్లో చెప్పలేను.

– దర్భశయనం శ్రీనివాసాచార్య