Reading Time: 3 minutes

వెలుగు ఓపెన్ పేజీ : భారతదేశం స్వయం సమృద్ధిని విస్మరించిందా?

Caption of Image.

భారతదేశం  నేడు ఒక  విభిన్నమైన ఆర్థిక స్థితిలో ఉంది.  ఒకవైపు  ప్రపంచంలోనే వేగంగా వృద్ధి  చెందుతున్న ఆర్థికవ్యవస్థగా  గుర్తింపు పొందుతుండగా, మరోవైపు పెరుగుతున్న ముడి చమురు ధరలు,  గ్యాస్ కొరత  దేశ ఆర్థిక స్థిరత్వాన్ని సవాలు  చేస్తున్నాయి.  ఈ సమస్య నేటిది కాదు.  దీని మూలాలు 1991లో  మనం అంగీకరించిన ఆర్థిక సంస్కరణల్లో ఉన్నాయి.1990వ  దశకం ప్రారంభంలో భారత్  తీవ్రమైన చెల్లింపుల  సంక్షోభాన్ని ఎదుర్కొంది.  అప్పట్లో  మన విదేశీ మారక నిల్వలు కేవలం  రెండు వారాల దిగుమతులకు మాత్రమే సరిపోయేలా ఉండేవి.  ఈ స్థితిలో ఐఎంఎఫ్,  ప్రపంచ బ్యాంకు సూచనల మేరకు భారత్ తన ఆర్థిక వ్యవస్థను ప్రపంచానికి తెరిచింది.  దీనినే సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ (ఎల్​పీజీ)  అంటాం.  ప్రపంచీకరణ వల్ల విదేశీ వస్తువుల దిగుమతి సులభమైంది.  దేశీయంగా  చమురు అన్వేషణ,  ఉత్పత్తిపై  భారీగా పెట్టుబడి పెట్టడం కంటే, అంతర్జాతీయ మార్కెట్ నుంచి చమురును  కొనుగోలు చేయడం అప్పట్లో లాభదాయకంగా  కనిపించింది.  దీనివల్ల ప్రస్తుతం భారత్  తన చమురు అవసరాలలో 85% పైగా,  గ్యాస్  అవసరాలలో 50% పైగా  దిగుమతుల పైనే  ఆధారపడుతోంది. 

క్షీణించిన దేశీయ ఉత్పత్తి

దేశీయ ఉత్పత్తి క్షీణించడం వల్ల, అంతర్జాతీయ మార్కెట్‌లో చిన్న మార్పు వచ్చినా మన దేశంలో ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి.  ఇంతకుముందు చమురు ధరలను ప్రభుత్వం నియంత్రించేది.   కానీ  సంస్కరణల తర్వాత,  క్రమంగా  ధరల  నిర్ణయాధికారాన్ని చమురు కంపెనీలకే  వదిలేశారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు రోజువారీ అంతర్జాతీయ ముడిచమురు ధరలపై ఆధారపడి మారుతున్నాయి. చమురు రంగంలో రిలయన్స్, నయారా వంటి ప్రైవేట్ సంస్థల  ప్రవేశం వల్ల పోటీ పెరిగినప్పటికీ, అవి ప్రధానంగా ఎగుమతులపై లాభాలపై దృష్టి సారించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు, ప్రైవేట్ కంపెనీలు దేశీయంగా విక్రయించడం కంటే విదేశాలకు  ఎగుమతి చేయడం వల్ల దేశంలో  గ్యాస్,  పెట్రోల్  కొరత  ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలైన  IOCL,  BPCL,  HPCL లు  సబ్సిడీల భారాన్ని  మోస్తూ  నష్టాల్లోకి వెళ్లడం వల్ల సరఫరా గొలుసు  దెబ్బతింటోంది.  ప్రపంచీకరణ వల్ల భారత్   ప్రపంచంలోని ప్రతి రాజకీయ మార్పుకు బాధితురాలిగా మారుతోంది.  రష్యా-, ఉక్రెయిన్  యుద్ధం వల్ల  సరఫరా మార్గాలు దెబ్బతిన్నాయి. రష్యాపై ఆంక్షల వల్ల చమురు లభ్యత తగ్గింది. ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు,    ఎర్ర సముద్రంలో  నౌకలపై  దాడులు  భారత్‌కు వచ్చే చమురు రవాణా ఖర్చులను పెంచాయి. అంతర్జాతీయంగా చమురు వ్యాపారం  డాలర్లలో  జరగడం వల్ల,  అమెరికా ఆర్థిక విధానాలు  భారత్ వంటి దేశాల ఇంధన ధరలను శాసిస్తున్నాయి.

 ఇంధన భద్రతకు పునాది

డాక్టర్ సయ్యద్ హుస్సేన్ జహీర్ (1901-–1975) భారత రసాయన శాస్త్రవేత్త,  కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) మాజీ డైరెక్టర్ జనరల్. భారతదేశం స్వయం సమృద్ధి సాధించాలంటే  దేశీయ వనరులను సమర్థవంతంగా వాడుకోవాలని  బలంగా నమ్మేవారు. దేశంలో ముడి చమురు  నిల్వలు తక్కువగా ఉన్నాయని,  కానీ బొగ్గు నిల్వలు  పుష్కలంగా  ఉన్నాయని  జహీర్  గుర్తించారు. అందుకే ఆయన హైదరాబాద్‌లోని రీజినల్ రీసెర్చ్ లాబొరేటరీ (ప్రస్తుతం IICT) డైరెక్టర్‌గా ఉన్నప్పుడు బొగ్గుపై విస్తృత పరిశోధనలు చేయించారు. భారతదేశంలో లభించే నాణ్యత తక్కువగా ఉన్న బొగ్గును  నేరుగా వాడటం కంటే,  దానిని వాయువుగా మార్చడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందవచ్చని ఆయన  నిరూపించారు.  బొగ్గు నుంచి  గ్యాస్,  తద్వారా  సింథటిక్  పెట్రోల్, ఇతర  రసాయనాలను  తయారు చేసే  సాంకేతికతను  ప్రోత్సహించారు. ఇది దేశ ఇంధన భద్రతకు పునాది వేసింది.   హైదరాబాద్‌లోని  సెంట్రల్ లాబొరేటరీస్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్​ను  రీజినల్ రీసెర్చ్ లాబొరేటరీ (RRL)గా  మార్చడంలో  జహీర్  కీలక పాత్ర పోషించారు. ఆయన నాయకత్వంలోనే ఈ సంస్థ బొగ్గు పరిశోధన,  పురుగుమందులు, ఫార్మా  రసాయనాల తయారీలో అంతర్జాతీయ గుర్తింపు పొందింది.

నెహ్రూ దార్శనికత 

నెహ్రూ భారతదేశాన్ని ఆధునిక పారిశ్రామిక దేశంగా మార్చాలని కలలు కనేవారు. ఆ కల సాకారం కావాలంటే అంకితభావం గల శాస్త్రవేత్తల అవసరం ఉందని ఆయన నమ్మారు. డాక్టర్ జహీర్  ప్రతిభను గుర్తించిన నెహ్రూ ప్రభుత్వం.. 1962లో ఆయన్ను కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) డైరెక్టర్  జనరల్‌గా నియమించింది. నెహ్రూ స్వయంగా CSIRకి అధ్యక్షుడిగా ఉండేవారు.  ఆ రోజుల్లో విదేశాల నుంచి సాంకేతికతను దిగుమతి  చేసుకోవడం కంటే,  మన దేశంలోనే కొత్త ఆవిష్కరణలు చేయాలని నెహ్రూ పిలుపునిచ్చారు. భారతీయ బొగ్గుతో నడిచే పైలట్ ప్లాంట్ల ఏర్పాటుకు నెహ్రూ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది.

బొగ్గు గ్యాసిఫికేషన్​ ప్రాజెక్టులు భారతదేశానికి అత్యంత ఆవశ్యకమైనవని నెహ్రూ వంటి నాయకులు గుర్తించినప్పటికీ, అవి ఆశించిన స్థాయిలో అమలు కాకపోవడానికి,  నేటికీ  ఇంధన కొరత ఎదుర్కోవడానికి వెనుక అనేక సాంకేతిక, ఆర్థిక, రా జకీయ కారణాలు ఉన్నాయి.  ఆ కాలంలో అంతర్జాతీయ చమురు దిగ్గజాలు, దేశీ కంపెనీలు భారతదేశం స్వయంగా ఇంధనాన్ని ఉత్పత్తి చేసుకోవడాన్ని ఇష్టపడలేదు.  భారత్​ తన సొంత బొగ్గు ద్వారా గ్యాస్ లేదా చమురును తయారు చేసుకుంటే, అంతర్జాతీయ చమురు మార్కెట్‌పై మనం ఆధారపడటం తగ్గిపోతుంది. దీనివల్ల విదేశీ కంపెనీల వ్యాపారం దెబ్బతింటుంది.ఈ కారణంతో విదేశీ శక్తులు  దేశీయంగా ఉన్న కొందరు అధికారులు ఆ ప్రాజెక్టుల కంటే  విదేశీ చమురు దిగుమతులే చౌక అని ప్రభుత్వాన్ని నమ్మించారు.  1964లో నెహ్రూ మరణం తర్వాత  ప్రభుత్వ  ప్రాధాన్యతలు మారాయి.  ఒకవేళ అప్పుడే మనం ఆ ప్రాజెక్టులను అమలు చేసి ఉంటే, నేడు మనం చమురు, గ్యాస్​ కోసం ఇతర దేశాలపై 
ఆధారపడాల్సిన అవసరం ఉండేది కాదు. 

‌‌- డా. ఎ. శంకర్
వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి.
 స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.

©️ VIL Media Pvt Ltd.