
వారానికి 300 గ్రాముల కంటే ఎక్కువ చికెన్ తింటే జీర్ణాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఇటలీ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాదు.. ఇలా తినడం వల్ల ఆయుష్షు తగ్గిపోయి మరణించే అవకాశాలు 27 శాతం ఎక్కువగా ఉన్నాయని తేలింది. ప్రొటీన్ కోసం చికెన్ను ఎగబడి తినేవాళ్లకు ఇదో పెద్ద షాక్ అని చెప్పక తప్పదు. చికెన్ తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని.. బలవర్ధకమైన ఆహారం అని చాలా మంది భావిస్తారు. అది నిజమే గానీ మోతాదుకు మించి ఎక్కువగా చికెన్ తినడం వల్ల అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్టేనని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.
కోడి మాంసం ఎక్కువగా తినడం వల్ల 2.3 శాతం జీర్ణాశయ క్యాన్సర్ల ప్రమాదం ఉందని ‘న్యూట్రియెంట్స్’ అనే జర్నల్లో స్పష్టం చేశారు. అయితే.. చికెన్ తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందనే అధ్యయనాన్ని కొందరు వైద్య నిపుణులు కొట్టిపారేస్తున్నారు. కోడి మాంసం తినడం వల్ల కాదని.. చికెన్ వండేందుకు వాడే నూనెలు, మసాలాల వల్ల క్యాన్సర్ ప్రమాదం ఉందని చెబుతున్నారు.
కోడి మాంసాన్ని గ్రిల్ చేసినప్పుడు, వేయించినప్పుడు లేదా ఎక్కువ మంట మీద వండినప్పుడు.. అందులో హెటెరోసైక్లిక్ అమైన్స్ (HCAలు), పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (PAHలు) వంటి సమ్మేళనాలు ఏర్పడతాయి. వీటికి క్యాన్సర్తో సంబంధం ఉంది. అందువల్ల చికెన్ ఎలా వండుతారనే దానిపైనే మంచి చేస్తుందా..? చెడు చేస్తుందా..? అనే విషయం ఆధారపడి ఉంటుందని వైద్య నిపుణులు వివరించారు. గడ్డకట్టిన చికెన్ నగ్గెట్‌ను తింటే క్యాన్సర్ ప్రమాదం ఉండొచ్చు.
బ్రెడ్ పూత పూసి వేయించిన చికెన్ ఆరోగ్యానికి మంచిది కాదు. ఎక్కువ వేడి మీద వేయించే చికెన్ కూడా అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. మరి చికెన్ తినడం మానేయాలా అంటే అవసరం లేదు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించేవాళ్లు, ఫ్యామిలీ హిస్టరీలో క్యాన్సర్ బాధితులు ఉన్నవాళ్లు.. వారానికి 200 గ్రాముల చికెన్ తీసుకోవడం బెటర్. చికెన్ బదులు చేపలు, పప్పుధాన్యాలు, ప్రోటీన్‌లు పుష్కలంగా ఉండే ఆకుకూరలు తినడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.