
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా ఉండాల్సిందేనని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరిని ప్రకటించాలని ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. కేంద్రం ఈ నెల 16, 17 ,18 తేదీల్లో పార్లమెంట్ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకోవాలన్నారు. మహిళా బిల్లు లక్ష్యం నెరవేరాలంటే బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని దేశంలోని మెజారిటీ రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయని పేర్కొన్నారు.
సోమవారం అసెంబ్లీ ఎదుట ఉన్న అమరవీరుల స్థూపం వద్ద నిరసన తెలుపుతామని, ఈ నెల 16న ఢిల్లీలో బీసీ మహిళలతో కలిసి ధర్నా చేపడుతామని తెలిపారు. మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా పార్లమెంట్లో ప్రధాని మోదీ నివాళులర్పించడం అభినందనీయమన్నారు. పూలే ఆశయాల అమలుకు కృషి చేయాలని కోరారు.