Reading Time: 2 minutes

ఈనెల 12 రోజుల్లోనే 95,454 ట్రిప్పులు

నీటిని పొదుపుగా వాడుకోవాలి

ప్రతి కుటుంబం 20 శాతం నీటిని ఆదాచేయాలి

ఎండీ అశోక్‌రెడ్డి

మనతెలంగాణ, సిటీబ్యూరో ః ఈ సంవత్సరం మార్చి నెలలో మొత్తం 2,24,421 ట్యాంకర్ ట్రిప్పులను డెలివరీ చేశామని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్‌రెడ్డి వెల్లడించారు. ఈ నెలలో 12వ తేదీ నాటికే 95,454 ట్రిప్పులు సరఫరా చేసినట్టు తెలిపారు. వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, నగర పరిధిలో భూగర్భ జలాల తగ్గుదల నేపథ్యంలో తాగునీటి డిమాండ్ నీటి వినియోగంపై ప్రతి పౌరుడు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి విజ్ఞప్తిచేశారు. నీటి అవసరాలు గణనీయంగా పెరుగుతున్నందున, నీటిని వృధా చేయకుండా నీటి పొదుపు చర్యలను కచ్చితంగా పాటించడం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. వేసవి కార్యాచరణ, ట్యాంకర్ మేనేజ్‌మెంట్‌పై అశోక్ రెడ్డి జలమండలి జేఎండీ మయాంక్ మిట్టల్‌తో పాటు రీజినల్ ఈడీలు, డైరెక్టర్లలు, సీజీఎంలు, జీఎంలతో జూమ్ మీటింగ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్‌రెడ్డి మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయిలో నీటి సరఫరా, ట్యాంకర్ బుకింగ్స్, డెలివరీ టైమ్ తదితర వివరాల్ని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ వేసవిలో గత ఏడాది కంటే ఓవరాల్ గా ట్యాంకర్ బుకింగ్ ఘననీయంగా పెరగకపోయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లోని ఫిల్లింగ్ స్టేషన్ లలో గత ఏడాదికంటే బుకింగ్ పెరిగిందని చెప్పారు.

పెరిగిన బుకింగ్స్..

గత ఏడాదికంటే మణికొండ, బంజారాహిల్స్, డోయెన్స్, హఫీజ్‌పేట్, నేతాజీ పార్క్ ఫిల్లింగ్ స్టేషన్‌లో బుకింగ్స్ పెరిగినట్టు వెల్లడించారు. ఈ పెండెన్సీని తగ్గించుకోవడానికి.. ఈ రెండు రోజుల్లో సున్నానికి తగ్గించుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ ఫిల్లింగ్ స్టేషన్‌లో నీటిసరఫరా సరఫరాలను, సరఫరా సమయాన్ని పెంచడం, డిమాండ్ తక్కువ ట్యాంకర్ బుకింగ్ నమోదు అవుతున్న ఫిల్లింగ్‌స్టేషన్ నుంచి అధికంగా డిమాండ్‌ని డెలివరీ చేసేందుకు ప్రత్యేక ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు.

రాత్రి వేళల్లో ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేయడంతో.. పెండెన్సీ బాగా తగ్గించుకున్నామని తెలిపారు. అవసరమైతే నైట్ షిఫ్ట్‌లో పనిచేసే వారికి ప్రత్యేక అలవెన్స్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాత్రి సమయాల్లో కమర్షియల్ వినియోగదారులకు టాంకర్లను సరఫరా చేయడానికి ఏర్పాటు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇలాగే ప్రత్యేక దృష్టి పెడితే బుక్ చేసిన 12 గంటల్లోపే ట్యాంకర్ డెలివరీ చేసే వీలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

నీటి పొదుపుపై ఎండీ విజ్ఞప్తి:

————————————హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు .. వేసవి తీవ్రత దృష్ట్యా తాగునీటి వినియోగంపై జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అత్యంత కీలకమని ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. రాబోయే రోజులలో నీటి డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నందున, ప్రతి పౌరుడు నీటిని బాధ్యతాయుతంగా వినియోగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నగరంలోని ప్రతి కుటుంబం కనీసం 20 శాతం వరకు నీటిని ఆదా చేయాలని సూచించారు. చిన్నచిన్న అలవాట్ల మార్పులతోనే పెద్ద మొత్తంలో నీటిని సంరక్షించవచ్చని ఆయన పేర్కొన్నారు.

పౌరులకు ముఖ్య సూచనలు:

———————————-విలువైన తాగునీటిని వాహనాల శుభ్రపరిచేందుకు, ఇళ్ల పరిసరాలను కడగడానికి ఉపయోగించరాదు. బ్రష్ చేసేటప్పుడు నల్లా (ట్యాప్) నిరంతరం తెరిచి ఉంచకుండా, మగ్గులో నీరు తీసుకుని వినియోగించాలి. స్నానం చేసేటప్పుడు షవర్ వినియోగాన్ని తగ్గించి, బకెట్ నీటితో స్నానం చేయడం ద్వారా గణనీయంగా నీటిని ఆదా చేయవచ్చు. లీకేజీలు ఉన్న పైపులు, ట్యాపులు వెంటనే మరమ్మతులు చేయించుకోవాలి. అవసరానికి మించి నీటిని నిల్వ చేయడం, వృథా చేయడం నివారించాలి. జలమండలి ఇప్పటికే వేసవి అవసరాలను దృష్టిలో ఉంచుకుని సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడానికి చర్యలు చేపడుతోందని ఎండీ తెలిపారు. అయినప్పటికీ, వేసవిని సమర్థంగా ఎదుర్కోవాలంటే ప్రజల సహకారం అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు. నీరు అమూల్యమైన వనరు. ప్రతి చుక్కను విలువైనదిగా భావించి వినియోగిస్తేనే భవిష్యత్ తరాలకు నీటి భద్రత కల్పించగలం అని అశోక్ రెడ్డి పేర్కొన్నారు. వేసవిలో తాగునీటి సమస్యలను అధిగమించేందుకు ప్రతి పౌరుడు నీటిని వృధా చేయకుండా నీటి పొదుపు చర్యలను పాటిస్తూ జలమండలికి సహకరించాలని ఆయన మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈ జూమ్ మీటింగ్ లో లో రీజియన్ ఈడీలు పంకజ, అశోక్ సామ్రాట్, సంతోష్, డైరెక్టర్లు ఆపరేషన్స్-1,2,3 వినోద్ భార్గవ, నారాయణ, శీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.