
మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా మద్దతునివ్వాలని బిజెపి లోక్‌సభ సభ్యురాలు డికె అరుణ కోరారు. ఈ బిల్లు ఆమోదంతో దేశ రాజకీయాల్లో కొత్త యుగానికి నాంది పడుతుందని ఆమె తెలిపారు.యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అనే మన భారతీయ సంస్కృతి ప్రకారం, ఎక్కడ మహిళలను గౌరవిస్తారో అక్కడ దేవతలు నివసిస్తారని, అటువంటి గొప్ప సంప్రదాయం మన దేశంలో ఉందని ఆమె శనివారం విలేకరుల సమావేశంలో అన్నారు. ఈ నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మహిళా 33 శాతం రిజర్వేషన్ బిల్లును ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్‌లో తీసుకువచ్చి మహిళల ప్రాధాన్యాన్ని మరింతగా చాటి చెప్పారని ఆమె తెలిపారు.
నారీ శక్తి వందన్ అధినియమ్ ద్వారా మహిళలకు రాజకీయాల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించడం చారిత్రాత్మక నిర్ణయం అని ఆమె అన్నారు. 2029 ఎన్నికల్లో ఈ రిజర్వేషన్ అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆమె వివరించారు. ఎన్నో సంవత్సరాలుగా మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడినా, గత ప్రభుత్వాలు చిత్తశుద్ధి చూపించలేదని ఆమె విమర్శించారు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ అన్ని పార్టీలను సమన్వయం చేసి ఈ బిల్లును తీసుకురావడం గొప్ప విషయమన్నారు. ఈ బిల్లు అమలు అయితేనే దాని సార్థకత ఉంటుంది. అందుకే అన్ని పార్టీల ఎంపీలు పార్టీలకు అతీతంగా ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ఇది కేవలం ఒక చట్టం కాదు కోట్లాది మహిళల ఆశలు, ఆకాంక్షలకు ప్రతీక, దేశ రాజకీయాల్లో కొత్త యుగానికి నాంది పలికే బిల్లు అని ఎంపీ డికె అరుణ తెలిపారు.
తొమ్మిది ఎంపీ సీట్లు మహిళలకు
మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం లభించిన తర్వాత తెలంగాణలో పార్లమెంట్ స్థానాలు పెరిగి, దాదాపు 9 మంది మహిళలు పార్లమెంట్‌కు వెళ్లే అవకాశం వస్తుందని ఆమె చెప్పారు. దేశవ్యాప్తంగా సుమారు 273 మంది మహిళలకు అవకాశం లభిస్తుందని ఆమె వివరిచారు. అసెంబ్లీ స్థాయిలో కూడా మహిళలకు పెద్ద ఎత్తున ప్రాతినిధ్యం పెరుగుతుంది. తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు పెరిగితే, దాదాపు 60 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా ఉండే అవకాశం ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ మహిళలకు కూడా గణనీయ ప్రాతినిధ్యం లభిస్తుందని ఎంపీ అరుణ తెలిపారు.