
రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు
నిరాకరించడంతో భూతులు తిట్టారు
పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు
ఫొటొః మంగ్లీ పేరుతో ఉంది…
మనతెలంగాణ, సిటిబ్యూరో: డబ్బులు ఇవ్వలేదని అడ్వకేట్ తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నాడని సింగర్, యాక్టర్ ముదావత్ సత్యవతి అలియాస్ మంగ్లీ పంజాగుట్ట పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. తాను ఎలాంటి డబ్బులు వసూలు చేయలేదని, తనవి అని చెబుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని తెలిపారు. గత నెల 22వ తేదీన అడ్వకేట్ సింగపోగు సుబ్బు ఆఫీస్‌కు వెళ్లానని, అక్కడ సుబ్బతోపాటు ముగ్గురు ఉన్నారని పేర్కొన్నారు. అడ్వకేట్ సుబ్బు తనతో అసభ్యంగా మాట్లాడారని, దీంతో తాను అడ్వకేట్‌ను నిలదీశానని తెలిపింది. తనపై యూట్యూబ్, ఇన్‌స్టాగ్రాం, ఇతర సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు తొలగించాలని అడ్వకేట్‌ను అడిగితే, రూ.10లక్షలు ఇస్తేను వాటిని తొలగిస్తానని చెప్పాడని తెలిపారు. తాను డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో అడ్వకేట్ సుబ్బ, అక్కడ ఉన్నవారు అసభ్యంగా తనను తిట్టారని, డబ్బులు ఇవ్వకుంటే వేధిస్తామని, రెప్యుటేషన్ డ్యామెజ్ చేస్తామని హెచ్చరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మైక్రో ఫైనాన్స్‌తో సంబంధం లేదు: సింగర్ మంగ్లీ
మైక్రో ఫైనాన్స్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని సింగర్ మంగ్లీ తెలిపారు. తన పేరుతో ఎవరూ డబ్బులు వసూలు చేశారో తెలియదని తెలిపారు. అడ్వకేట్ సుబ్బుపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత మంగ్లీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సుబ్బు భరత నాట్యం డ్యాన్సరని, బిగ్‌బాస్‌లోకి వెళ్లేందుకు తన పేరు వాడుకుంటున్నాడని తెలిపారు. తనను డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేశారని ఆరోపించారు. ఆరోపణలు అన్నీ నిరాధారమని తెలిపారు. నా పేరు చెప్పి ఎవరూ వసూలు చేశారో నాకు తెలియదని, వారికి తనకు సంబంధం లేదని తెలిపారు. మధుకు తన సోదరుడికి సంబంధంలేదని తెలిపారు.