Reading Time: 2 minutes

ఇటుకల తయారీలో అతివలు.. రాష్ట్రవ్యాప్తంగా 736 ఇటుక తయారీ యూనిట్లు.. ఇందిరమ్మ ఇండ్లకు ఈ ఇటుకలే !

Caption of Image.
  • ఒక్కో యూనిట్‌‌కు రూ.18 లక్షల పెట్టుబడి, ఇందులో 35 శాతం సబ్సిడీ
  • మహిళా సంఘాల నుంచే ఇటుకల కొనుగోలు.. హౌసింగ్ శాఖకు సర్కార్ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలు నిర్వహిస్తున్న ఇటుక తయారీ యూనిట్ల బలోపేతంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్న ఇటుక యూనిట్లపై సెర్ప్  ఆధ్వర్యంలో సమగ్ర సర్వే నిర్వహించింది.  రాష్ట్రవ్యాప్తంగా 736 యూనిట్లు ఉన్నట్లు గుర్తించింది. ఇందులో అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 89 యూనిట్లు ఉండగా.. కరీంనగర్  48, నల్గొండ 43 తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 

ప్రస్తుతం ఈ యూనిట్లు తక్కువ సామర్థ్యంతో నడుస్తున్నాయని, వీటిని అప్‌‌గ్రేడ్  చేస్తే రోజుకు 2,500 ఇటుకల వరకు తయారు చేయవచ్చని అధికారులు అంచనా వేశారు. ఈ యూనిట్లను బలోపేతం చేసేందుకు పీఎంఈజీపీ స్కీమ్​ ద్వారా 35 శాతం సబ్సిడీతో రుణాలు అందిస్తున్నారు. ఒక్కో యూనిట్‌‌కు సుమారు రూ.18 లక్షల పెట్టుబడి అవసరమని గుర్తించి బ్యాంకులతో సమన్వయం చేస్తున్నారు. కేవలం డబ్బే కాకుండా, మహిళలకు 15 రోజుల పాటు ప్రత్యేక నైపుణ్య శిక్షణ కూడా ఇప్పిస్తున్నారు.

ఇందిరమ్మ ఇండ్లకు ఈ ఇటుకలే !
మహిళా సంఘాలు తయారు చేసిన ఇటుకలకు మార్కెటింగ్  కష్టాలు లేకుండా ప్రభుత్వం మాస్టర్  ప్లాన్  రూపొందించింది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి మహిళా సంఘాలు తయారు చేసిన ఇటుకలనే వాడాలని హౌసింగ్  శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దీని వల్ల మహిళలకు నిరంతరం పని దొరకడమే కాకుండా, రవాణా ఖర్చులు తగ్గి ఇటుకలు తక్కువ ధరకే లభిస్తాయి. అంతేకాదు, గ్రామీణ మహిళలకు స్థిరమైన ఆదాయం అందడంతో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన మెటీరియల్  స్థానికంగానే లభించనుంది. 

ఆరుగురికి ఉపాధి కల్పిస్తున్నా.. 
నేను 2011లో సంఘంలో చేరాను. పీఎంఈజీపీ పథకం ద్వారా రూ.10 లక్షలతో ఇటుక యూనిట్  స్థాపించాను. ఇందులో రూ.9.5 లక్షలు బ్యాంకు లోన్ కాగా, రూ.3.5 లక్షలు సబ్సిడీ వర్తించింది. ఇటుకల తయారీ యూనిట్  ద్వారా నెలకు రూ.3.02 లక్షల వ్యాపారం జరుగుతోంది. అన్ని ఖర్చులు పోను నెలకు రూ. 57 వేల నికర లాభం వస్తుంది. మరో ఆరుగురికి ఉపాధి కల్పిస్తున్నాను. ఈ ఆదాయంతో  పిల్లలను చదివించుకుంటూ సొంత ఇల్లు నిర్మించుకున్నాను.

కుంటమల్ల వాణి, మీర్జాపూర్, సిద్దిపేట జిల్లా

మహిళలకు శాశ్వత ఉపాధి
మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదిగినప్పుడే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. ఇటుక యూనిట్ల ద్వారా మహిళలకు శాశ్వత ఉపాధి దొరుకుతుంది. ప్రభుత్వం వీరికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తుంది.

సీతక్క, మంత్రి

©️ VIL Media Pvt Ltd.