
హైదరాబాద్: పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుంటే చరిత్ర హీనులవుతారు అని బిజెపి కేంద్రమంత్రి బండిసంజయ్ తెలిపారు. పార్లమెంట్ లో మహిళా ప్రాతినిధ్యం పెరగాల్సిందేనని అన్నారు. ఈ సందర్భంగా బండి మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణ అసెంబ్లీలో 60 మంది మహిళలకు అవకాశాలు లభిస్తాయని, మహిళలు ఆశలు, ఆకాంక్షలకు మహిళా రిజర్వేషన్ బిల్లని బండి తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోడీ మహిళా రిజర్వేషన్ బిల్లుతో రాజకీయాల్లో..33 శాతం రిజర్వేషన్లు కల్పించడం చారిత్రాత్మకమని కొనియాడారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే పార్టీలన్నీ పార్లమెంట్ లో బిల్లుకు మద్దతివ్వాలని, మహిళలకు చట్టసభలో రాజకీయ రిజర్వేషన్లు దశాబ్దాల నాటి కల అని బండి సంజయ్ పేర్కొన్నారు.