Reading Time: 2 minutes

పునరుద్ధరణ పనుల వేగవంతానికి స్టీరింగ్ కమిటీ

కమిటీకి కన్వీనర్‌గా ఇరిగేషన్ నిపుణుడు కల్నల్ పరిక్షిత్ మెహ్రా

2028 నాటికి మరమ్మతుల ప్రక్రియ పూర్తి

ఎల్‌అండ్‌టీ సహా సంస్థలన్నీ తమ పనులను తక్షణమే పునరుద్ధరించాలి

కాళేశ్వరంపై ప్రత్యేక సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం

మన తెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పధకం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పునరుద్ధరణ పనులు వేగవంతం చేసేందుకు గాను నీటిపారుదల రంగ నిపుణులు కల్నల్ పరిక్షిత్ మెహ్రా కన్వీనర్‌గా ఉన్నత స్థాయి స్టీరింగ్ కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ కమిటీ వారానికి రెండు సార్లు సమావేశమై ఎప్పటికప్పుడు పనుల పురోగతిని సమీక్షిస్తుందని అన్నారు. అవసరమైతే స్వయంగా తానే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సమావేశాల్లో పాల్గొని పురోగతిని సమీక్షించ

నున్నట్లు వెల్లడించారు.

ఈ పునరుద్ధరణ పనులు వేగవంతం చేసేందుకు గాను సంబంధిత అధికారులతో ఆదివారం డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ సచివాలయంలో మంత్రి ఉత్తమ్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి ఇ.శ్రీధర్, నీటిపారుదల శాఖ సలహాదారుడు ఆదిత్య దాస్‌నాధ్, జాయింట్ సెక్రటరీ కే.శ్రీనివాస్, టన్నెల్ నిపుణులు పరిక్షిత్ మెహ్రా, ఇ.ఎన్.సిలు రమేష్ బాబు, శ్రీనివాస్‌లతో పాటు సి.డబ్ల్యూ.పి.ఆర్.ఎస్ ఆదనపు డైరెక్టర్ సెల్వా బాలన్ తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డిఎస్‌ఏ), విజిలెన్స్ కమిషన్ వంటి చట్టబద్ధ సంస్థలు ఇప్పటికే మూడు బ్యారేజీల ఫౌండేషన్, డిజైన్, ప్రణాళిక, అమలు అంశాల్లో తీవ్రమైన లోపాలను గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఈ మూడు నిర్మాణాల్లో సమస్యలు ఒకే విధంగా ఉన్నాయని అన్నారు.

2028 నాటికి మరమ్మతుల ప్రక్రియ పూర్తి

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం మరమ్మతుల పూర్తి ప్రక్రియలో భాగంగా 2027, 2028 సంవత్సరాలను కీలకంగా పరిగణించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. నిర్దేశిత గడువులోనే అన్నారం, సుందిళ్ల పనులు పూర్తవుతాయని, అదే సమయంలో మేడిగడ్డలో కొంత భాగన్నీ పూర్తి చేయగలమనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఎఫ్‌ఆర్‌వై ఇండియా, ఐఐటి ముంబయిలకు కొత్త డిజైన్ల బాధ్యతను అప్పగిస్తూ ప్రభుత్వం ఇప్పటికే డిజైన్ కన్సల్టెంట్‌గా ఎఫ్‌ఆర్‌వై ఇండియాను ఎంపిక చేసి, ఐఐటి ముంబయితో సంయుక్తంగా పని చేయాలని నిర్ణయించిందని మంత్రి పేర్కొన్నారు. డిజైన్ బృందం రాత్రింబవళ్లు పనిచేసి వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. డిజైన్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, డిజైన్ సిద్ధమైన వెంటనే సెంట్రల్ వాటర్ కమిషన్ ఆమోదానికి పంపాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. సెక్రటరీ పరిక్షిత్ మెహ్రాతో నిరంతరం సంప్రదింపులో ఉండాలని, ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని కన్సల్టెంట్లకు ఆయన సూచించారు.

డిజైన్ ప్రక్రియకు సంబంధించిన భూభౌతిక, భూసాంకేతిక, మట్టి, హైడ్రాలిక్ మోడలింగ్ వంటి అన్ని అధ్యయనాలు సమగ్రంగా నిర్వహించబడతాయని తెలిపారు. అవసరమైన అన్ని పరీక్షలు, డేటా అత్యవసర ప్రాధాన్యంతో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. పుణెలోని కేంద్ర జల, విద్యుత్ పరిశోధనా సంస్థ ఈ పరీక్షలు, అధ్యయనాల బాధ్యత వహిస్తోందని తెలిపారు. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ పనులను కేంద్ర సంస్థ అత్యున్నత ప్రాధాన్యంగా పరిగణించాలన్నారు. ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, కేంద్ర జల కమిషన్‌తో సమన్వయం చేసి అవసరమైన అనుమతులు పొందాలని ఆయన సూచించారు. కేంద్ర జల, విద్యుత్ పరిశోధనా సంస్థ సిబ్బంది 45 రోజుల అధ్యయన కాలంలో నిరంతరం ప్రాజెక్ట్ స్థలాల్లో ఉండాలని ఆదేశించారు.

ఏజెన్సీలకు శిబిరాల పునఃప్రారంభ ఆదేశం

ఎల్ అండ్ టీ సహా ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యమైన సంస్థలన్నీ తమ క్యాంపులు, మెస్ సదుపాయాలు, లాజిస్టిక్స్‌ను తక్షణమే పునరుద్ధరించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇంజినీర్లు, టెక్నీషియన్లు, రిగ్ ఆపరేటర్లకు వసతి, ఆహార సమస్యలు రాకుండా చూడాలని ఆయన సూచించారు. ఇసుక తొలగింపు, జిపిఆర్ (భూభౌతిక) పరీక్షలు, సైట్ సిద్ధం పనులు అన్ని ఏజెన్సీల పూర్తి సహకారంతో నిర్వహించబడతాయని పేర్కొన్నారు. డిజైనర్లు, కేంద్ర జల, విద్యుత్ పరిశోధనా సంస్థ, ఆయా శాఖల ఇంజినీర్లు, ఏజెన్సీ ప్రతినిధులు కలిసి అన్ని పరీక్షలను ప్రత్యక్షంగా వీక్షించాలని, ప్రతి అంశాన్ని సక్రమంగా నమోదు చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.