
తులసి మొక్క హిందువులందరికీ పవిత్రమైనది.. శుభప్రదమైనది. ఇది ప్రపంచవ్యాప్తంగా హిందువుల ఇళ్లలో మొదటి స్థానంలో ఉంటుంది. ఈ పవిత్రమైన మొక్కను మనకు నచ్చిన ఆకారంలో పెంచుకోవచ్చు.. చెట్టులాగా లేదా బోన్సాయ్ లాగా మంచిగా పెంచుకోవచ్చు.. ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధ గుణాలున్న మొక్కగా తులసిని పరిగణిస్తారు. అయితే.. తులసి మొక్క ఎండిపోవడం అపవిత్రంగా భావిస్తారు.. తులసి ఎండిపోవడానికి కొన్ని కారణాలుంటాయి. సరైన గాలి, వెలుతురు లేని చోట ఉంచినా.. కొన్ని పొరపాట్ల వల్ల ఇలా జరిగే అవకాశముంటుంది. అంతేకాకుండా వేసవిలో సరిగా నీటిపారుదల లేకపోతే.. ఎండిపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో, తులసి మొక్కను మర్రి చెట్టులాగా దృఢంగా, దట్టంగా ఎలా పెంచాలి.. దానికి ఎలాంటి ఎరువులు వాడాలి, తెగుళ్ళను ఎలా నియంత్రించాలి అనేది ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
తులసి.. గుబురుగా పెంచే చిట్కాలు:
తులసి మొక్కను కొన్ని చిట్కాలతో పెంచడం ద్వారా దట్టంగా పెంచవచ్చు.
బహుళ మొక్కలు నాటడం: ఒకే చోట మూడు లేదా నాలుగు చిన్న తులసి మొక్కలను (కృష్ణ తులసి, లక్ష్మి తులసి కలిపి) నాటడం ద్వారా మొక్క గుబురుగా పెరుగుతుంది.
కాండాలను కలపడం: చిన్న మొక్కలు నాటేటప్పుడు, వాటి కింది కాండాలను పల్చటి దారంతో కట్టి మట్టిలో నాటితే, అవి ఒకే మొక్కలాగా దట్టంగా పెరుగుతాయి.
రెగ్యులర్ ప్రూనింగ్ (కొమ్మల కత్తిరింపు): మొక్క పెరుగుతున్నప్పుడు రెండు లేదా మూడు ఆకులను కింది వైపు నుండి కత్తిరించడం వల్ల, కత్తిరించిన చోట నుండి రెండు లేదా మూడు కొత్త బ్రాంచ్‌లు వస్తాయి. విత్తనాలు రాకముందే, మొక్క పెరుగుదల దశలో ఈ విధంగా ప్రూనింగ్ చేయడం వల్ల మొక్క దట్టంగా, ఆరోగ్యంగా పెరుగుతుంది.
తులసి సంరక్షణ – తెగుళ్ళ నివారణ:
ఎండాకాలంలో తులసి మొక్క ఎండిపోకుండా, పచ్చగా ఉండాలంటే ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం నీరు అందించాలి. మొక్కపై మజ్జిగ నీరు జల్లడం, మధ్యాహ్నం ఎండ నుంచి నీడ కల్పించడం, తేమ కోసం మల్చింగ్ ఏర్పాటు చేయడం ద్వారా.. ఎండిపోకుండా తులసిని కాపాడుకోవచ్చు.
తెగుళ్ళ నివారణకు వేప నూనె లేదా బేకింగ్ సోడా ఉపయోగించవచ్చు. నీళ్లల్లో కలిపి తులసి చెట్టుపై పిచికారి చేయాలి.. ఇవి సహజంగా పనిచేస్తాయి.. కొత్త ఆకులు చక్కగా పచ్చగా వస్తాయి.
ఆకుల తొలగింపు: నేలపై రాలిపోయిన, కుళ్ళిపోయిన ఆకులను ఎప్పటికప్పుడు తొలగించాలి, ఎందుకంటే అవి తెగుళ్ళకు ఆవాసంగా మారవచ్చు.
తులసి మొక్కల ఆరోగ్యకరమైన పెరుగుదలకు ఈ క్రింది ఎరువులను వాడవచ్చు. ఈ సీజన్‌లో ప్రతి 15 రోజులకు ఒకసారి వీటిని ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
సేంద్రీయ ఎరువులు: వేప పిండి, టీ లీఫ్ కంపోస్ట్, రటిపండు తొక్కల పొడి, ఎప్సమ్ సాల్ట్.. సహజమైన ఎరువు, తెగుళ్ళ నివారణకు సహాయపడతాయి. వీటిలో నైట్రోజన్, పొటాషియం అధికంగా ఉంటాయి.
పచ్చి పాలతో..
పాలు తులసి మొక్కలకు అద్భుతమైన లిక్విడ్ ఫర్టిలైజర్‌గా పనిచేస్తాయి. ఒక లీటరు నీటికి ఒక చిన్న కప్పు పచ్చి పాలు లేదా కాచిన పాలను కలిపి పలుచగా చేసుకున్న తర్వాత మొక్కలకు ఇవ్వవచ్చు. ఇది మొక్కలలో మంచి ఫలితాలను చూపుతుంది. ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీ తులసి మొక్క గుబురుగా, పచ్చగా, ఆరోగ్యంగా పెరుగుతుంది.