
ఎలక్ట్రానిక్స్ తయారీలో ప్రపంచ స్థాయి కేంద్రం(గ్లోబల్ హబ్)గా తెలంగాణను తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పునరుద్ఘాటించారు. కేవలం ఉత్పత్తుల అసెంబ్లింగ్ మాత్రమే పరిమితం కాకుండా, విడిభాగాల తయారీ నుంచి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వరకు అవసరమైన పూర్తిస్థాయి ‘ఎకో సిస్టం’ను అభివృద్ధి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. డా.బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో శనివారం కోటి(10 మిలియన్లు) టెలివిజన్ యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని చేరుకున్న హైదరాబాద్‌కు చెందిన రేడియంట్ అప్లయన్సెస్ అండ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… రేడియంట్ సంస్థ సాధించిన ఈ ఘనత తెలంగాణ పారిశ్రామిక ప్రగతికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిని 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలిపారు.
ఈ లక్ష్య సాధనలో ‘తెలంగాణ’ కీలక పాత్ర పోషించాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆ దిశగానే గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారుతున్న ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. ఓవైపు ఎలక్ట్రానిక్స్ తయారీలో టాప్ గ్లోబల్ ప్లేయర్స్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తూనే..మరోవైపు వారికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, రెడీ టూ వర్క్ ఫోర్స్ తయారీపై దృష్టి సారించామన్నారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను తీసుకొచ్చి… ఇక్కడి యువతకు ఉపాధి కల్పించాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు, విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. సరళతర వాణిజ్య విధానాలతో పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం అందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రెజల్యూట్ గ్రూప్ ఛైర్మన్ రమీందర్ సింగ్ సోయిన్, డైరెక్టర్ మణికందన్, లీగల్ అండ్ ఐపీఆర్ హెడ్ శుభజిత్ సాహా, అడ్మినిస్ట్రేషన్ హెడ్ నోయెల్ రాబిన్ సన్ తదితరులు పాల్గొన్నారు.