Reading Time: 2 minutes

IPL 2026 : చెలరేగిన గిల్, బట్లర్.. లక్నోపై గుజరాత్ ఘన విజయం

Caption of Image.

IPL 2026 : ఐపీఎల్ 2026లో భాగంగా ఏకనా స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన కీలక పోరులో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. లక్నో నిర్దేశించిన 165 పరుగుల టార్గెట్ కోసం బరిలోకి దిగిన గుజరాత్ బ్యాటర్లు శుభ్‌మన్ గిల్, జోష్ బటర్లు హాఫ్ సెంచరీలతో చెలరేగిపోవడంతో సునాయసంగా గెలిచింది. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లక్నో బ్యాటర్లు గుజరాత్ టైటాన్స్ బౌలర్ల ధాటికి చేతులెత్తేశారు. 

నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు మాత్రమే చేసింది. లక్నో జట్టులో ఐడెన్ మార్క్రమ్ (30) టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగతా బ్యాటర్లు నికోలస్ పూరన్ (19), రిషబ్ పంత్ (18), అబ్దుల్ సమద్ (18), ముకుల్ చౌదరీ(18), జార్జ్ లిండే (16), మహమ్మద్ షమీ(12), మిచెల్ మార్ష్ (11) 20 పరుగుల కంటే తక్కువగా చేయగా, ఆయూష్ బదోనీ మరోసారి ఘోరంగా విఫలమయ్యాడు. కేవలం 9 పరుగులు మాత్రమే చేసిన పెవిలియన్ కి చేరుకున్నాడు. 

అనంతరం 165 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టుకి మంచి శుభారంభం లభించింది. ఓపెనర్స్ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ మధ్య నెలకొన్న 45 పరుగుల భాగస్వామ్యాన్ని దిగ్వేశ్ సింగ్ రాఠీ విడదీశాడు. సాయి సుదర్శన్ (15)ని తక్కువ పరుగులకే పెవిలియన్ కి పంపించాడు.  అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన జోష్ బట్లర్ తో కలిసి ఇన్సింగ్స్ ని ముందుకు నడిపించిన శుభ్‌మన్ గిల్ (40 బంతుల్లో 6 ఫోర్లు ఒక సిక్సుతో 56 పరుగులు ) హాఫ్ సెంచరీ చేసిన తర్వాత 129 పరుగుల వద్ద ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ లో వికెట్ కీపర్ రిషభ్ పంత్ కి క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. 

మరో బ్యాటర్ జోష్ బట్లర్ ( 37 బంతుల్లో 11 ఫోర్లతో 60 పరుగులు) కూడా అర్థ శతకం కొట్టిన తర్వాత మహమ్మద్ షమీ బౌలింగ్ లో భారీ షాట్ ఆడే క్రమంలో బౌండరీ లైన్ వద్ద ఐడెన్ మార్క్రమ్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కి చేరుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రాహుల్ తెవాటియా (9), వాషింగ్టన్ సుందర్ (11 బంతుల్లో 2 ఫోర్లు ఒక సిక్సుతో 20 పరుగులు ) మ్యాచ్ ని ఫినిష్ చేశారు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో దిగ్వేశ్ రాఠీ, మహమ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. 

©️ VIL Media Pvt Ltd.