Reading Time: < 1 minute

నల్లని ఆ త్రాచు తోకపై లేచింది

పడగవిప్పి నన్నే చూస్తోంది

నేను కదలినా పరుగెత్తినా అది నన్ను కాటేస్తుంది

నేను అలాగే నిశ్చలంగా ఉన్నాను

అదో కారడవి, శిరసుపైన

మధ్యాహ్నపు కాగడాతో

ధగధగలాడే సూర్యుడు

ప్రాణావసాన వేళాజనితం

అంత భయం లోనూ

ఎన్ని తూనీగలు ముసురుతున్నాయో

తలలో, తల చుట్టూ

నేను ఉరిమే నీలిమేఘాన్నని తెలిసినా

ఎందుకు ఆ విధంగా

విచ్చుకున్న నెమలి పించమై

నా గుండె తాళానికి అనుగుణంగా నర్తిస్తావు

నా బతుకు పొట్లంలో

ఒక మిఠాయివై కూర్చుంటావు

నా జీవ నారణ్యంలో అర్ధరాత్రి

విచ్చుకున్న వేకువ పువ్వవుతావ్

నాకు తెలుసు

ఆ సర్పం నన్ను కాటేస్తుందని?

నాకు పూర్తిగా తెలుసు

నేనొకనిర్నిద్ర సముద్రం లోపలికి

జారిపోతానని?

అయినా విశ్వాసం సన్నగిల్లడం లేదు

మృత్యు సర్పం వైపు నిశ్చలంగా చూస్తూ

నేను నిర్ణయం తీసుకుంటున్నాను

బహుశా ఆ నెమలిపించమే

నన్ను మెరుపులతో పాటు

వర్షమై కురిసే మెత్తని మబ్బుగా చేసింది

కంటి కెమెరాలలో, తూనీగలను

అక్షరమానం చేసింది

ఒక విస్పోటనం నుండి

కొత్త ప్రపంచాన్ని దగ్గరగా చేసింది

ఇక అడుగు ముందుకేశాను

ఏం జరిగినా నేనే విజేతను

– డాక్టర్ కాంచనపల్లి గోవర్ధన్ రాజు