
టాలీవుడ్ లో మాస్ సినిమాల డైరెక్టర్ గా హరిస్ శంకర్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఆయన చేసిన ‘గబ్బర్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కానీ, సినిమా విడుదలయ్యాక ఫలితం మాత్రం మరోలా ఉంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయింది. కనీసం రూ 100 కోట్లు రాబట్టడానికే నానా కష్టాలు పడుతోంది.
విమర్శల మధ్య హరీష్ దూకుడు..
సాధారణంగా ఒక సినిమా ఫ్లాప్ అయితే దర్శకులు కొన్నాళ్ల పాటు సైలెంట్‌గా ఉంటారు. కానీ హరీష్ శంకర్ శైలి వేరు. సినిమా ఫలితంపై సోషల్ మీడియాలో నెగిటివ్ టాక్ వస్తున్నా.. ఆయన మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా సినిమాను వెనకేసుకొచ్చారు. “సినిమా బాగుంది, వసూళ్లు బాగున్నాయి” అంటూ ఆయన చేసిన అగ్రెసివ్ ప్రమోషన్లు నెటిజన్లకు ఆగ్రహం తెప్పించాయి. హరీష్ ఇంకా భ్రమల్లోనే ఉన్నారని, వాస్తవాన్ని అంగీకరించడం లేదంటూ అభిమానులు సైతం విమర్శలు గుప్పించారు.
అసలు విషయం ఒప్పుకున్న డైరెక్టర్..!
లేటెస్ట్ గా తిరువీర్ నటించిన ‘పాపం ప్రతాప్’ వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు హరీష్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేదికపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. తన సినిమా వైఫల్యాన్ని ఆయన చాలా సరదాగా, ఒక సెల్ఫ్ సెటైర్‌తో అంగీకరించారు. “స్టేజ్ మీదకు వస్తుంటే యాంకర్ నన్ను ‘పాపం హరీష్ శంకర్’ అని పిలిచింది. అది వినగానే నాకు ఒక్క క్షణం మైండ్ బ్లాక్ అయ్యింది. ఉస్తాద్ భగత్ సింగ్ ఆశించిన స్థాయిలో ఆడలేదు కదా.. అందుకే జాలి పడి నన్ను అలా పిలిచారేమో అని కంగారు పడ్డాను. కానీ ఆ తర్వాత ఆమె అందరినీ అలాగే పిలవడంతో, అది సిరీస్ టైటిల్‌లో భాగమని అర్థమై ఊపిరి పీల్చుకున్నాను అని హరీష్ వ్యాఖ్యానించారు.
పాఠం నేర్చుకుంటేనే..
హరీష్ శంకర్ వ్యాఖ్యలు విన్న సినీ ప్రియులు, నెటిజన్లు.. అమ్మయ్య.. ఇప్పటికైనా ఉస్తాద్ పోయిందనే నిజాన్ని హరీష్ ఒప్పుకున్నారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఒక క్రియేటర్ తన తప్పులను లేదా వైఫల్యాలను అంగీకరించినప్పుడే, తదుపరి ప్రాజెక్టులో ఆ లోపాలను సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. ‘ఉస్తాద్’ ఇచ్చిన చేదు అనుభవం నుండి పాఠాలు నేర్చుకుని, తన తదుపరి చిత్రాలతో హరీష్ మళ్లీ ‘గబ్బర్ సింగ్’ నాటి మ్యాజిక్‌ను రిపీట్ చేయాలంటున్నారు.. పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు హరీష్ నుండి ఒక సాలిడ్ కంబ్యాక్ కోరుకుంటున్నారు.