
- ఇటీవల ఉత్తర, దక్షిణ డిస్కమ్ ల నుంచి 51 మంది ఉద్యోగుల నియామకం
- విధుల్లో చేరకపోవడంతో పనులకు ఆటంకం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు డిస్కమ్‌ను ఉద్యోగుల కొరత వేధిస్తున్నది. ప్రభుత్వ జీఓ ప్రకారం ఏప్రిల్ ఒకటి నుంచి డిస్కమ్ వ్యవహారాలు అధికారికంగా మొదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు సేవలందించే బాధ్యత ఇక ఈ డిస్కమ్ పరిధిలోకే వచ్చింది. అయినా రైతు డిస్కమ్‌లో చేరడానికి ఇంజినీర్లు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఇటీవల ఉత్తర, దక్షిణ డిస్కమ్ ల నుంచి 51 మంది ఉద్యోగులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటికీ కేవలం 32 మంది మాత్రమే విధుల్లో చేరినట్లుగా ప్రభుత్వ రికార్డులు సూచిస్తున్నాయి. అయితే దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) నుంచి 39 మంది ఉద్యోగులను బదిలీ చేయగా సగం మంది మాత్రమే విధుల్లో చేరినట్లుగా తెలిసింది. ఉద్యోగులు లేక రైతు డిస్కమ్ పనులకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నట్లుగా నిపుణులు చెబుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా డిస్కమ్ పరిధి
ఉత్తర, దక్షిణ డిస్కమ్‌లతో పోల్చితే రైతు డిస్కమ్ పరిధి చాలా పెద్దది. ఉత్తర తెలంగాణ జిల్లాలలో నార్త్, దక్షిణ తెలంగాణ జిల్లాలలో సౌత్ డిస్కమ్ విద్యుత్ పంపిణీ సేవలందిస్తున్నాయి. మారిన చట్టం ప్రకారం రైతు డిస్కమ్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సేవలందించాల్సి ఉన్నది. రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, మిషన్ భగీరథ వాటర్ సప్లయ్ కోసం కేటాయించిన మీటర్లు, నీటి పారుదల శాఖ పరిధిలో నిర్వహించే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లకు కేటాయించిన మీటర్లు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు, ప్రత్యేక డీటీఆర్లు కలిగిఉన్న అన్నీ మునిసిపాలిటీలలో ఉన్న మీటర్లు అన్నీ కూడా ఈ డిస్కం పరిధిలోకి వస్తాయి. ఇందులో 29.05 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా అన్నీ కలిపి మొత్తం 29,08,138 విద్యుత్ కనెక్షన్లు ఈ డిస్కం పరిధిలోకి వచ్చాయి.
విధుల్లో చేరని ఇంజినీర్లు.. రైతు డిస్కమ్‌కు ఉద్యోగుల కొరత
రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రైతు డిస్కమ్ నిర్వహణకు ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ), బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లతో పాటు 660 మంది ఇంజినీర్లు, 1,000 మంది సిబ్బంది, 340 మంది అడ్మినిస్ట్రేటివ్ ఇబ్బంది అవసరం ఉన్నది. వీరందరిని కూడా టీజీ ట్రాన్స్‌కో, జెన్కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ పరిధిలో పనిచేస్తున్న వారిలో నుంచి రైతు డిస్కమ్‌కు బదిలీ చేసుకోవాలని ప్రభుత్వ ఆదేశాలు చాలా స్పష్టంగా చెప్పాయి.
సీఎండీతో పాటు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల నియామకం పూర్తయ్యింది. రైతు డిస్కమ్‌కు కేంద్రం అనుమతి కూడా ఇచ్చింది. లైసెన్స్ కోసం ఈఆర్సీకి అప్లయ్ కూడా చేసేశారు. అయితే గత నెలలో ఉత్తర, దక్షిణ పంపిణీ సంస్థల నుంచి 51 మంది ఇంజినీర్లు, సిబ్బందిని బదిలీ చేస్తే ఇప్పటి వరకు కేవలం 32 మంది మాత్రమే విధుల్లో చేరారు.
రైతు డిస్కమ్ పట్ల ఆసక్తి చూపని ఇంజినీర్లు.. సిబ్బంది
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన రైతు డిస్కమ్ పట్ల విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఇంజినీర్లు, సిబ్బంది పెద్దగా ఆసక్తి చూపించడం లేదనే ప్రచారం జరుగుతున్నది. ఈ డిస్కమ్ పరిధిలో అన్నీ కూడా ఫ్రీ కనెక్షన్లు కావడంతో డిప్యూటేషన్ పై రావడానికి ఎవరూ సిద్ధపడట్లేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఒకవేళ బలవంతంగా ఆర్డర్స్ ఇచ్చినా విధుల్లో చేరకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రైతు డిస్కమ్‌లో 2 వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేయాల్సి ఉండగా ఇప్పటివరకు సీఎండీ, డైరెక్టర్లతో పాటు కేవలం 40 లోపు మంది మాత్రమే ఉద్యోగులు విధుల్లో చేరి పనిచేస్తున్నారు.
ఇంకా మిగతా ఉద్యోగులను ఎప్పుడు ఈ శాఖకు బదిలీ చేస్తారు? వారంతా ఎప్పుడు విధుల్లో చేరుతారనే ప్రశ్న వేస్తే ఉన్నతాధికారుల నుంచి కూడా సరైన సమాధానం రావట్లేదు. ‘ఎందుకంటే వారంతా కూడా సాధారణ వినియోగదారులతో సంబంధం ఉన్న ఫీల్డ్ పనులను ఇష్టపడుతున్నారు. అలాగే ఆపరేషన్స్, హెచ్ఆర్, అకౌంట్స్, ఐటీ విభాగాల నుంచి అనుభవజ్ఞులైన ఆఫీసర్లను ప్రత్యేకంగా కోరినా అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది.
కొంతమంది సీనియర్ అధికారులు కూడా తమ కింద పనిచేస్తున్న ఉద్యోగులను డిప్యూటేషన్‌పై బదిలీ చేయడానికి సిద్ధంగా లేరు’ అని చెబుతున్నారు. ప్రస్తుతం చేరినవారంతా కూడా ఎక్కువగా జిల్లా స్థాయి పోస్టింగ్‌ల నుంచి వచ్చినవారు కావడంతో వీరికి కార్పొరేట్ స్థాయి అనుభవం తక్కువగా ఉన్నది అని అంటున్నారు.
రైతు డిస్కమ్‌కు ఆఫీస్ ఏదీ?
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రైతు డిస్కమ్‌కు సరైన ఆఫీస్ ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదనే ఆపవాదు విద్యుత్ శాఖ ఉద్యోగుల నుంచి విన్పిస్తున్నది. ఆఫీస్‌లో స్థలం కొరత కూడా పెద్ద సమస్యగా ఉన్నది. హైదరాబాద్ మింట్ కాంపౌండ్ లోని ఎస్పీడీసీఎల్ ఆఫీస్‌లోనే రైతు డిస్కమ్ ఆఫీస్‌ను ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ప్రస్తుత సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ బీ బ్లాక్‌లోని ఐదవ అంతస్తు నుంచి పనిచేస్తున్నారు. ఇక్కడున్న ఇరుకైన పరిస్థితులు ఇప్పటికే ఉద్యోగుల మధ్య గొడవలకు దారితీశాయి.
కొందరు ఆఫీసర్లు తమ పాత డెస్క్‌ల నుంచే పని చేయాల్సి రావడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. మూడవ అంతస్తులో ఒక చీఫ్ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్ మధ్య సీటింగ్ విషయంలో వివాదం కూడా జరిగింది. కేవలం 2 వేల చదరపు అడుగుల స్థలంలో వేలాది మంది ఉద్యోగులు ఎలా పనిచేస్తారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం విద్యుత్ కనెక్షన్లలో 42 శాతం రైతు డిస్కమ్‌కు బదిలీ అయినప్పటికీ.. ఆ డిస్కమ్‌లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది కోసం సరైన ఆఫీస్ లేకపోవడం వల్ల కూడా డిప్యూటేషన్‌పై ఉద్యోగులు రాకపోవడానికి ఓ కారణమని నిపుణులు చెబుతున్నారు.