Reading Time: < 1 minute

ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు తిప్పలు పడుతున్రు : మాజీ మంత్రి హరీశ్ రావు

Caption of Image.

సిద్దిపేట, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందని మాజీ మంత్రి హరీశ్​రావు మండిపడ్డారు. శనివారం సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను సందర్శించి రైతులతో మాట్లాడారు. నాలుగు రోజుల నుంచి పొద్దు తిరుగుడు, మక్కలు కొనుగోలు చేయడం లేదని రైతులు తెలపడంతో, అధికారులతో మాట్లాడి ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణ ఖేడ్, ఆదిలాబాద్, నిజామాబాద్​లో కొనుగోలు సెంటర్లు ప్రారంభించలేదన్నారు.

వెంటనే కొనుగోలు సెంటర్లు ప్రారంభించి మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్  చేశారు. కొనుగోలు సెంటర్లు ప్రారంభించకపోవడంతో తక్కువ ధరకు అమ్ముకుని నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పంట మార్పిడి చేయమని చెబుతున్నారే.. కానీ, రైతులు పంట మార్పిడి చేస్తే వాటిని కొనే దిక్కు లేదన్నారు.

వడగళ్ల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, వెంటనే రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్  చేశారు. అంతకుముందు పాత బస్టాండ్  వద్ద జ్యోతిబాఫూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సిద్దిపేటలోని  రామరాజు రావి చెట్టు హనుమాన్  ఆలయం, అర్బన్  మండలం వెల్కటూర్  గ్రామంలో పెద్దమ్మ ఆలయ ఉత్సవాల్లో పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.