
భారతీయ సంగీత ప్రపంచంలో తనకంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే (92) ఆదివారం కన్నుమూశారు. సుమారు ఎనిమిది దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో ఇరవైకి పైగా భాషల్లో పన్నెండు వేలకు పైగా పాటలు పాడిన గొప్ప గాయని ఆశా భోంస్లే.
శాస్త్రీయ సంగీతం నుంచి పాప్, గజల్, ఫోక్, క్యాబరే వరకు అనేక రకాల పాటల్లో తన ప్రత్యేకతను చాటి భారతీయ సినీ సంగీతానికి కొత్త శైలిని అందించారు ఆశా భోంస్లే. ఆమె గాత్రంలో ఉన్న వైవిధ్యం, భావ వ్యక్తీకరణలో ఉన్న లోతు, ప్రతి పాటకు జీవం పోసే ప్రత్యేకత ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఆశా కేవలం ఒక గాయని మాత్రమే కాదు, సంగీతాన్ని కొత్త కోణంలో పరిచయం చేసిన ఓ సృజనాత్మక శక్తి. భారతీయ సంగీత చరిత్రలో ఆమె పేరు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది.
గానకోకిలగా పేరొందిన లతా మంగేష్కర్‌కు ఆశా భోంస్లే స్వయానా సోదరి.. లతా దీదీ మరణించిన నాలుగేళ్లకే ఆశా జీ కూడా కన్నుమూయడం సంగీత ప్రపంచానికి తీరని లోటు. ఆశా భోంస్లే 1933 సెప్టెంబర్8న మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా గోవర్‌లో జన్మించారు. తండ్రి పండిట్ దీనానాథ్ మంగేష్కర్, ప్రముఖ శాస్త్రీయ గాయకుడు, నటుడు. తల్లి శేవంతి మంగేష్కర్. లతా మంగేష్కర్, మీనా ఖాదికర్, ఉషా మంగేష్కర్, హృదయనాథ్ మంగేష్కర్ తోబుట్టువులు. బాల్యంలోనే తండ్రి మరణించడంతో కుటుంబ పోషణ భారం పెద్దవారైన లతా, ఆశా మంగేష్కర్‌లపై పడింది.
ఆశా తన 11వ ఏటనే మరాఠీ చిత్రం మజాబాల్‌లో ‘చలా చలా నౌ చలా’ అంటుూ పాడి చిన్న వయసులోనే అందరి మన్ననలు పొందారు. ఆ తర్వాత 1948లో ‘చునారియా’ చిత్రంలోని ‘సావన్ ఆయా’ పాటతో హిందీ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. రాజ్‌కపూర్ ‘బూట్ పాలిష్’ ఓ.పి. నయ్యర్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘సి.ఐ.డి’ చిత్రాలు ఆమె కెరీర్‌కు మైలురాయిగా నిలిచాయి. దిగ్గజ సంగీత దర్శకులు ఓ.పి. నయ్యర్, ఎస్.డి. బర్మన్, ఆర్.డి. బర్మన్, కయ్యామ్ వంటివారితో ఆమె ఎన్నో ఐకానిక్ పాటలను పాడారు. కేవలం హిందీలోనే కాకుండా తెలుగు, బెంగాలీ వంటి అనేక భారతీయ భాషల్లో ఆమె పాటలు పాడారు. తెలుగు సినిమాతో ఉన్న అనుబంధం చాలా తక్కువే అయినా, ఆమె పాడిన పాటలు తెలుగువారి హృదయాల్లో ఎవర్ గ్రీన్ క్లాసిక్స్‌గా నిలిచాయి.
1981లో వచ్చిన ‘పాలు నీళ్లు’ సినిమాలోని ‘ఇది మౌనగీతం’ పాటతో మొదలుపెట్టి, 2007లో ‘చందమామ’ సినిమాలోని ‘నాలో ఊహలకు’ వరకు ఆమె గాత్రం తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. 1988లో ‘చిన్ని కృష్ణుడు’ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ‘జీవితం సప్త సాగర గీతం’ అనే పాటను ఆమె పాడగా దీనికి ఆమె భర్త ఆర్డీ బర్మన్ సంగీతం సమకూర్చారు. 1992లో నందమూరి బాలకృష్ణ నటించిన ‘అశ్వమేథం’ సినిమాలో ఆశా భోంస్లే రెండు పాటలు పాడి తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఇళయరాజా స్వరకల్పనలో ఆమె ఆలపించిన ‘ఓ ప్రేమా’, ‘సీతాకాలం ప్రేమకు’ పాటలు ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ అనిపించుకున్నాయి.
1996లో వెంకటేష్, సౌందర్య జంటగా నటించిన ‘పవిత్ర బంధం’ సినిమాలోని ‘ఐసాలకిడీ’ పాటను ఆమె పాడారు. ఎంఎం కీరవాణి కంపోజ్ చేయగా, సినిమాలో ఆశా భోంస్లే స్టేజ్ మీద పాడినట్టుగా కనిపిస్తారు. ఆశా భోంస్లే ప్రతిభకు గుర్తింపుగా ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి. ‘ఉమ్రావ్ జాన్’, ‘ఇజాజత్’ చిత్రాలకు ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ అవార్డులు అందుకున్నారు. 2000వ సంవత్సరంలో భారత ప్రభుత్వం నుంచి అత్యున్నత సినిమా పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నారు.
2008లో దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించింది. 2011లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. 2002లో బిబిసి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు. ఇక కుటుంబ విషయానికొస్తే.. తనకు 16 ఏళ్ల వయసున్నప్పుడే 31 ఏళ్ల గణపత్ రావ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు ఆశా. 1960లో తన నుంచి విడాకులు తీసుకుని.. 1980లో ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్‌డీ బర్మన్‌ను వివాహమాడారు. ఆశా భోంస్లే మరణం పట్ల బాలీవుడ్‌తోపాటు టాలీవుడ్, ఇతర చిత్ర పరిశ్రమల్లో పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.