Reading Time: 2 minutes

మొదటి కమిటీలో స్పెషలాఫీసర్ ప్రకటన

రెండో మీటింగ్‌లో ఊసేలేని నజరానా

రాష్ట్ర బడ్జెట్‌లోనూ కనిపించని ప్రస్తావన

మనతెలంగాణ, సిటీబ్యూరో ః కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పోరేషన్‌లకు ప్రత్యేక అధికారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ ప్రకటించిన రూ. 500 కోట్లు ఉత్తమాటేనా..? అనేది ఇప్పుడు కోర్ అర్బన్ రీజియన్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. కొత్తగా ఏర్పడిన కొద్దిరోజుల్లోనే కార్పోరేషన్‌ల అధికారులతో స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించిన స్పెషలాఫీసర్.. నూతనంగా ఆవిర్భవించిన రెండు కార్పోరేషన్‌లకు ఒక్కొక్క కార్పోరేషన్‌కు రూ. 500 కోట్లు మంజూరు చేయనున్నట్టు ప్రకటించారు. అనంతరం ఆ ప్రకటన కాస్త కార్యరూపంలోకి రాకుండా ప్రకటనగానే మిగిలిపోయినట్టుగా విమర్శలు వినిపిస్తున్నాయి. స్పెషలాఫీసర్‌గా నియమితులైన మొదటి సమావేశంలోనే ఆయన ఈ ప్రకటనను ఎందుకు చేసినట్టు..? ఎందుకు నిధులు మంజూరు చేయలేకపోతున్నట్టు..? అనేది ఇప్పుడు కోర్ అర్బన్ రీజియన్‌లో ఆసక్తికరమైన చర్చకు కేంద్రబిందువుగా మారింది. ప్రకటనచేసి నెల రోజులకుపైగా గడిచినా.. అనంతరం మరోమారు స్టాండింగ్ కమిటీ మీటింగ్ జరిగినా.. ప్రకటించిన రూ. 500 కోట్లకు సంబంధించి కార్పోరేషన్‌ల ప్రత్యేకాధికారి ప్రస్తావించకపోవడంపై పలురకాలుగా వ్యాఖ్యానాలకు కేరాఫ్‌గా మారింది.

బడ్జెట్‌లో ప్రస్తావనేది..?

సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పోరేషన్‌లకు ఊరటనిచ్చేందుకే రూ. 500 కోట్లను మంజూరు చేయనున్నట్టు ప్రత్యేకాధికారి జయేష్ రంజన్ ప్రకటించారా..? లేక ప్రభుత్వం నుండి వచ్చిన సంకేతాల మేరకు ప్రకటించారా..? ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళకుండానే ఆయన ఈ ప్రకటనను చేశారా..? అనేది ఇప్పుడు ఇటు అధికారులను, అటు పాలకులను తొలుస్తున్న ప్రశ్న. ఇదిలా ఉండగా గత మార్చిలో జరిగిన రాష్ట్ర బడ్జెట్ అంచనాల కేటాయింపుల్లోనూ కొత్తగా ఏర్పడిన కార్పోరేషన్‌లు సైబారాబద్, మల్కాజిగిరిలకు నిధుల కేటాయింపుపై ఊసే లేకపోవడం కూడా అధికారులను, మాజీ పాలకులను ఆశ్చర్యానికి లోనుచేస్తోంది. కేవలం హెచ్‌సిటీ ప్రాజెక్టులకు మాత్రమే రూ. 2654 కోట్లను కేటాయించిన ప్రభుత్వం.. మరి ఈ రూ. 500 కోట్ల ప్రస్తావన చేయలేదు. గతంలో జీహెచ్‌ఎంసి వరకు మాత్రమే హెచ్‌సిటీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా జీహెచ్‌ఎంసిలో శివారులోని 27 మున్సిపాలిటీలు విలీనమయ్యాయి. అదనంగా పెరిగిన ప్రాంతాల్లోనూ మౌలిక వసతులను కల్పించడం, అభివృద్ధి పథకాలను చేపట్టడం జరగాల్సి ఉంది. మరి వీటిని నిధుల సహాకారం చేయాల్సిన ప్రభుత్వం కాస్త వార్షిక బడ్జెట్ అంచనాలలో కొత్త మున్సిపల్ కార్పోరేషన్‌లకు నిధులను కేటాయించకపోవడంపై సర్వత్రా అసహనం వ్యక్తమవుతోంది.

ఆస్తి పన్ను, ప్లానింగ్‌పైనే..

ఎర్లీబర్డ్ స్కీంతో వచ్చే ఆస్తిపన్ను వసూలు, టౌన్‌ప్లానింగ్ విభాగం వసూలు చేసే భవన నిర్మాణాల ఫీజుల నుండి వస్తున్న ఆదాయంపైనే ఈ రెండు కొత్త కార్పోరేషన్‌లు ఆధారపడి ఉన్నాయి. వచ్చే ఆదాయం మేరకు కార్పోరేషన్ ఉద్యోగుల జీతభత్యాలను అందించనున్నది. ఈ రెండు విభాగాల నుండి ఆదాయం వస్తేనే ఉద్యోగులకు ప్రతినెల 1వ తేదీన జీతాలు తమతమ బ్యాంక్ ఖాతాల్లోకి చేరుతాయని, లేదంటే జాప్యం కావడం ఖాయమనేది అధికార వర్గాల్లోని అభిప్రాయం. గత ఏడాది ఆస్తిపన్ను వసూలు సిఎంసిలో రూ. 1000.36 కోట్లుగా ఉంటే మల్కాజిగిరి కార్పోరేషన్‌కు రూ. 962.62 కోట్లు వసూలైనట్టు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఒక్క మార్చినెలకు సైబారాబాద్‌లో ఆస్తిపన్ను రూ. 143.69 కోట్లుగా ఉంటే ఎంఎంసిలో రూ.107.09 కోట్లు వసూలైంది. 202526 టౌన్‌ప్లానింగ్ విభాగం ద్వారా సిఎంసికి రూ. 538.09 కోట్లు, ఎంఎంసికి రూ.198.24 కోట్లు ఆదాయంగా వచ్చాయి. ఇప్పుడు ఈనెల(ఏప్రిల్)లో ఎర్లీబర్డ్ స్కీం అమలులో ఉన్నందున ఆస్తిపన్ను కొంతమేర ఖజానాకు చేరే అవకాశాలున్నాయి. అనంతరం ఇక టౌన్‌ప్లానింగ్ నుండి వచ్చే ఆదాయంపైనే ఈరెండు కార్పోరేషన్‌లు ఆధారపడాల్సి ఉంటుందనేది అధికారులు వివరిస్తున్నారు.