Reading Time: 3 minutes

ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తాం

పొత్తులు మాకు కలిసిరావు

బిఆర్‌ఎస్, బిజెపి పొత్తు ప్రచారం అబద్ధం.

రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదు

బిఆర్‌ఎస్ బలోపేతానికి కార్యాచరణ

మేము అధికారంలో ఉన్నప్పుడు

ప్రజలకు, నాయకులకు మధ్య దూరం పెరిగింది

ఆ లోపాలను సరిదిద్దుకుంటాము

బిఆర్‌ఎస్‌ను మళ్లీ టిఆర్‌ఎస్‌గా

మార్పు గురించి పరిశీలిస్తాం

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలోని

మీడియా ప్రతినిధులతో కెటిఆర్ చిట్‌చాట్

తండ్రిని సంతోషపెట్టకపోయినా ఫర్వాలేదు..

కానీ ఏడిపించొద్దు..కవిత తీరుపై కెటిఆర్ వ్యాఖ్యలు

మనతెలంగాణ/హైదరాబాద్ : 2027లో రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సమస్యలపై పాదయాత్ర చేపట్టనున్నట్లు బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రకటించారు. ప్రజల్లోకి వెళ్లేందుకు 2027 నుంచి పాదయాత్ర ప్రారంభించాలనే ప్రణాళికలో ఉన్నామని చెప్పారు. నియోజకవర్గాల డిలిమిటేషన్ వల్ల రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయని, దీనివల్ల బిఆర్‌ఎస్‌కు భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. డీలిమిటేషన్ పైన ఇప్పుడు ఉన్న సమాన నిష్పత్తిలో విభజన జరిగితే ఎలాంటి అభ్యంతరాలు అవసరం లేదని అన్నారు. పార్లమెంట్‌లో ప్రస్తుతం 24 శాతం ఎంపీల స్థానాల్లో వాటా ఉన్నదని, అదే శాతం తగ్గకుండా డీలిమిటేషన్ జరిగితే ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు. అన్ని రాష్ట్రాలకు 50 శాతం సీట్ల పెరిగితే నష్టం లేదని పేర్కొన్నారు. ఈ అంశంలో అభ్యంతరం ఎందుకు అర్థం కావడం లేదని అన్నారు.

మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలోని ఆదివారం మాజీ ఎంఎల్‌ఎ బాల్క సుమన్ నివాసంలో మీడియా ప్రతినిధులతో కెటిఆర్ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా పలు రాజకీయ, సంస్థాగత అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని,పొత్తులు తమకు కలిసిరావని స్పష్టం చేశారు. బిఆర్‌ఎస్ ఎప్పటిలాగే ఒంటరిగానే పోటీ చేసి విజయం సాధిస్తుందని ధీమా ఆశాభావం వ్యక్తం చేశారు. 2014, 2018లో ఒంటరిగానే పోటీ చేసి గెలిచి అధికారంలోకి వచ్చామని గుర్తుచేశారు. 2023లో కూడా ఒంటరిగానే గట్టి పోటీ ఇచ్చి ఓడిపోయామని వ్యాఖ్యానించారు. బిజెపితో ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసి పోటీ చేయబోమని తేల్చిచెప్పారు. ఈసారి ఎన్నికల్లో గెలుపు గుర్రాలే తమకు ముఖ్యం అని, ఈ అంశంలో పార్టీకి ఎలాంటి మొహమాటం లేదని అన్నారు. ఎవరు ఎక్కడ గెలుస్తారో అక్కడికి పంపిస్తామని తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఎంఎల్‌ఎలను మార్చగలిగితే తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

పదేళ్లలో పార్టీకి, ప్రజలకు మధ్య దూరం పెరిగింది

గతంలో అధికారంలో ఉన్న సమయంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన కొన్ని లోపాలను ఈ సందర్భంగా కెటిఆర్ బహిరంగంగానే అంగీకరించారు. ఆ లోపాలను సరిదిద్దుకుంటామని వెల్లడించారు. పదేళ్ల పాలనలో పార్టీకి, ప్రజలకు మధ్య దూరం పెరిగిందని, ఆ గ్యాప్‌ను తగ్గించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. తెలంగాణ ఉద్యమ పార్టీగా, పదేళ్లు అధికార పార్టీగా, గత రెండున్నరేళ్లుగా ప్రతిపక్ష పార్టీగా మూడు పాత్రలను విజయవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు, సర్పంచులు, ఎంపిటిసిలు, మండల స్థాయి నాయకత్వాన్ని సమన్వయం చేసుకోవడంలో తాము విఫలమయ్యామని పేర్కొన్నారు. అలాగే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుండి లక్షలాది మంది కార్మికులు గల్ఫ్ దేశాల్లో ఉన్నప్పటికీ, వారి ప్రయోజనాల కోసం సరైన ‘గల్ఫ్ పాలసీ’ని తీసుకురాలేకపోయామని వెల్లడించారు. అభివృద్ధి సంక్షేమం ముఖ్యంగా కొన్ని రంగాల్లో అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం వలన ఇలాంటి లోపాలు తలెత్తయన్నారు. బిఆర్‌ఎస్‌ను మళ్లీ టిఆర్‌ఎస్‌గా మార్పు గురించి పరిశీలిస్తామని కెటిఆర్ తెలిపారు. ప్రాణహిత ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర నుండి అభ్యంతరాలు ఉన్నప్పటికీ బడ్జెట్‌లో నిధులు కేటాయించడం విచిత్రమని అన్నారు.

చెన్నూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతు బంధు, రైతు రుణమాఫీ సక్రమంగా అమలు కాక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక విద్యార్థులు కష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రిపై ప్రజల్లో విశ్వాసం క్రమంగా తగ్గుతోందని వ్యాఖ్యానించారు. జైలుకు వెళితేనే సిఎం అవుతారనేది ఒక భ్రమ మాత్రమేనని అని పేర్కొన్నారు. నలభై ఏళ్ల క్రితం అలాంటి రాజకీయ సంస్కృతి లేదని, తాము హత్యలు చేసి అక్రమాలు చేసి జైళ్లకు వెళ్లేంత దుర్మార్గుకాము కాదు అని స్పష్టం చేశారు. ఓపెన్ కాస్ట్ గనుల విస్తరణ వల్ల కార్మికుల సంఖ్య తగ్గుతోందని, ప్రస్తుత ప్రభుత్వంపై కార్మికుల్లో తీవ్ర అసంతృప్తి ఉందని కెటిఆర్ పేర్కొన్నారు. సమస్యలపై చర్చించేందుకు ఎఐటియుసి నేతలను హైదరాబాద్‌కు ఆహ్వానించినట్లు తెలిపారు. టిబిజికెఎస్ కార్మిక సంఘాన్ని త్వరలోనే పునర్నిర్మించి, కొత్త నాయకత్వానికి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. కరీంనగర్ కార్పొరేషన్ గెలిచిన తర్వాత నిధులు తెస్తామని చెప్పిన నాయకులు మాట నిలబెట్టుకోలేదని గుర్తు చేశారు. దేశంలో అభివృద్ధి అంతా ఒకే నాయకుడి వల్ల జరిగిందనే భావనను ప్రజలపై రుద్దుతున్నారని విమర్శించారు.

పార్టీలో కెసిఆర్ నిర్ణయమే ఫైనల్

భారత రాష్ట్ర సమితిని బలోపేతం చేసే దిశగా పార్టీ చేపట్టనున్న కార్యాచరణన ఆయన వివరించారు. పార్టీని తిరిగి బలోపేతం చేసే దిశగా మే, జూన్ నెలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని, అలాగే కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి బిఆర్‌ఎస్‌లో చేరడం వల్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీ బలం మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యకర్తలతో నేరుగా కనెక్ట్ కావాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో తెలుగుదేశం లాంటి ఇతర పార్టీలలో ఉన్న సంప్రదాయాన్ని గుర్తిస్తూ, అక్కడి మంచి లక్షణాలను నేర్చుకుంటామని చెప్పారు. పార్టీలో ఎలాంటి ఆధిపత్య పోరులేదు అని, అందరం కెసిఆర్ నాయకత్వంలోనే పనిచేస్తున్నాయని తెలిపారు. ఇలాంటి దుష్ప్రచారం కేవలం విపక్షాల ప్రచారం మాత్రమే అని పేర్కొన్నారు. తాను ఆల్ రౌండర్‌ను అని, తన వయసుకు మించిన పదవులను పొందను అని చెప్పారు. కెసిఆర్ ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యతను పార్టీ సైనికుడిగా నిర్వహిస్తానని అన్నారు.

తాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాత్రమే అని, కెసిఆర్ ఏ పని అప్పచెప్తే ఆ పని చేయడమే తన కర్తవ్యం అని చెప్పారు. పార్టీలో జనరల్ సెక్రెటరీ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కి ఎంత ప్రాధాన్యత ఉందో తనకూ అంతే ప్రాధాన్యత ఉందని అన్నారు. పార్టీలో కెసిఆర్ నిర్ణయమే తుది నిర్ణయం అని తెలిపారు. పార్టీ నాయకుడు నేరుగా కార్యకర్తలతో మాట్లాడే వ్యవస్థ తమ పార్టీలో లోపించిందని, అదే ఓటమికి కారణమైందని అంగీకరించారు. తెలంగాణను కాపాడగల ఏకైక నాయకత్వం కెసిఆర్‌దేనని పేర్కొన్నారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించింది కెసిఆర్ నాయకత్వమే అని పేర్కొన్నారు. పదేళ్ల కాలంలో ఎంతో అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రెండు సంవత్సరాలలోనే దెబ్బతీసిందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో సింగరేణి సహా అన్ని స్థాయిలలో బిఆర్‌ఎస్ ఘనవిజయం సాధిస్తుందని, ప్రజలు కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిరస్కరిస్తారని కెటిఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు.

కవిత విషయంలో చెప్పేదేమీ లేదు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విషయంలో చెప్పేదేమీ లేదని కెటిఆర్ వ్యాఖ్యానించారు. పిల్లలు తండ్రిని సంతోష పెట్టకపోయినా ఫర్వాలేదు.. కానీ, ఏడిపించవద్దని తెలిపారు. ఈ రాజకీయం ఉంటుంది, పోతుంది.. కానీ ఇతరులను బాధ పెట్టే తీరు మంచిది కాదని చెప్పారు. రాజకీయ పార్టీలు ఎవరైనా పెట్టుకోవచ్చని, ప్రజల ఆదరణ లేకుంటే వృథానే కదా అని పేర్కొన్నారు. ప్రజల కోణంలో పార్టీ పెడితే తప్పు లేదని, వ్యక్తిగత సమస్యలతో పార్టీ పెడితే ఎవరూ పట్టించుకోరని అన్నారు.