
సినిమా ప్రపంచంలో రంగులు, కలలు, గ్లామర్.. ప్రతిరోజూ వేలాదిమంది యూత్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం పరుగులు తీస్తుంటారు. కళ్లలో ఆశలు, హృదయంలో తపన, ఉత్సాహం. కానీ ఆ కలలను నిజం చేసుకునే ధైర్యం, పట్టుదల కొద్దిమందికి మాత్రమే ఉంటుంది. అలాంటి వాళ్లలో ఒకరు మిహిర్ అహుజా. సినీ బ్యాక్‌డ్రాప్ లేకుండా, కేవలం హార్డ్ వర్క్‌తో తనకంటూ ఒక ఇమేజ్ సెట్ చేసుకుంటూ వస్తున్నాడు. తన జర్నీలోని ఇంట్రెస్టింగ్ విశేషాలతో…
జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో1998లో జన్మించాడు మిహిర్. చిన్నప్పటి నుంచే నటనపై ఎంతో మక్కువ చూపేవాడు. స్కూల్ డేస్‌లో సాంస్కృతిక కార్యక్రమాల్లో స్టేజ్ పర్ఫార్మెన్స్లతో ఆడియెన్స్‌ని అలరించేవాడు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినా నటుడిగా మారాలనే తన కలను ఎప్పుడూ వదలలేదు. చదువును కూడా ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు. ముంబైలో హెచ్.ఆర్. కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. పగలు క్లాసులు, రాత్రి ఆడిషన్లు.. ఈ రెండింటి మధ్యనే తన కలలను నిజం చేసుకునే ప్రయాణం మొదలైంది.
కమర్షియల్ యాడ్స్‌తో..
మిహిర్ ప్రయాణం చాలామంది నటుల్లాగే టీవీ కమర్షియల్ యాడ్స్‌తోనే స్టార్ట్ అయింది. దాదాపు 30కి పైగా బ్రాండ్లతో పని చేశాడు. లిమ్కా, ఫైవ్ స్టార్ వంటి పాపులర్ యాడ్స్ అతనికి భారీగా గుర్తింపు తెచ్చాయి. అమితాబ్ బచ్చన్, విరాట్ కోహ్లీ వంటి లెజెండ్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.
బాలీవుడ్ అరంగేట్రం..
2019లో హృతిక్ రోషన్‌తో ‘సూపర్ 30’ సినిమాలో విద్యార్థి పాత్రతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. అందులో చిన్న పాత్రే అయినా తన క్యారెక్టర్ మీద ఫోకస్ పడేలా యాక్టింగ్ చేశాడు. ఆ తర్వాత చేసిన సినిమాల్లో మంచి రోల్స్ చేశాడు.
తెలుగులోనూ..
2021లో వచ్చిన ‘మోసగాళ్లు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యాడు. మంచు విష్ణు, కాజల్ అగర్వాల్‌తో కలిసి నటించిన ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలో తన నేచురల్ యాక్టింగ్‌తో మెప్పించాడు. భాష తెలియకపోయినా భావాల ద్వారా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవచ్చని నిరూపించాడు.
ఒక కొత్త పాఠం..
మిహిర్ విజయం వెనుక రహస్యం ఒక్కటే. ఆడిషన్లలో వందల సార్లు తిరస్కరించినా ఒక్కసారి కూడా వెనక్కి తగ్గలేదు. “ప్రతి తిరస్కరణ నాకు ఒక కొత్త పాఠం నేర్పింది” అని అతను తరచూ చెప్పేవాడు. షూటింగ్ లేని రోజుల్లో కూడా వర్క్‌షాపులు, సెల్ఫ్- ట్రైనింగ్‌తో తనను తాను మెరుగుపరుచుకుంటూ ఉంటాడు. సినీ బ్యాక్‌గ్రౌండ్ లేని వారికి ప్రతిభే అతి పెద్ద ఆయుధం అని నమ్ముతాడు. ప్రస్తుతం మిహిర్ చేతుల్లో ఆకట్టుకునే ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. ‘విజయ్ 69’లో అనుపమ్ ఖేర్‌తో కలిసి నటించి కాస్త పాపులారిటీ సంపాదించుకున్నాడు. చాక్లెట్ బాయ్ ఇమేజ్‌కు మాత్రమే పరిమితం కాకుండా నెగెటివ్, యాక్షన్ రోల్స్, ఎమోషనల్ డ్రామాలు కూడా చేయాలని అతని టార్గెట్. జంషెడ్ పూర్ చిన్న వీధుల నుంచి మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు బాలీవుడ్ గ్లామర్లోకి ప్రవేశించింది. సినిమా రంగంలోకి రావాలని కలలు కంటున్న నేటి యూత్‌కు మిహిర్ అహుజా ఒక నిజమైన రోల్ మోడల్.
ఓటీటీలో సెన్సేషన్
జోయా అక్తర్ దర్శకత్వంలో వచ్చిన నెట్‌ఫ్లిక్స్ భారీ ప్రాజెక్ట్ ‘ది ఆర్చీస్’. మిహిర్ కెరీర్‌లో నిజమైన టర్నింగ్ పాయింట్ ఇదే. ఇందులో ‘జుగ్‌హెడ్ జోన్స్’ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు. సుహానా ఖాన్, ఖుషీ కపూర్, అగస్త్య నంద వంటి స్టార్ కిడ్స్‌తో కలిసి నటించినా తన సహజత్వం, భావోద్వేగాలతో విమర్శకులను, ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అదే సంవత్సరం అమెజాన్ ప్రైమ్‌లో ‘మేడ్ ఇన్ హెవెన్’ సీజన్ 2లో కూడా కీలక పాత్రతో మెరిశాడు. ఓటీటీ ప్రపంచంలో అతను ఎంచుకుంటున్న పాత్రలు ప్రతిసారీ వైవిధ్యంగా, బలంగా ఉంటున్నాయి.
- నిజ జీవితంలో నాకు లెక్కలంటే చాలా భయం. కానీ మా క సమ్ సిరీస్‌లో మ్యాథ్స్ జీనియస్ అగస్త్యగా నటించడం నాకు పెద్ద సవాల్‌గా అనిపించింది. సెట్‌లో ఆ ఫార్ములాలు బట్టీ పట్టడానికి చాలా కష్టపడ్డా.
- మా నాన్నకి మ్యాథమెటిక్స్ అంటే ప్రాణం. నేను నటుడిగా ఈ పాత్ర చేస్తున్నానని తెలిసినప్పుడు ఆయన కళ్లలో కనిపించిన ఆనందం నా కెరీర్‌లోనే ప్రత్యేకం. ఆయనకు బాగా నచ్చిన పాత్ర ఇదే.
- మోనా సింగ్‌తో పనిచేయడం నా అదృష్టం. ఆమె ఒక పవర్ హౌస్. సెట్‌లో మా మధ్య ఉన్న ‘తల్లీ-కొడుకుల’ బాండింగ్ స్క్రీన్ మీద చాలా సహజంగా వచ్చింది.
- కేవలం లాజిక్ మాత్రమే నమ్మే ఒక అబ్బాయి. తన ఒంటరి తల్లి కోసం తోడుని వెతికే క్రమంలో ఎమోషనల్‌గా ఎలా మారాడు అనేదే ఈ కథలోని అసలైన మ్యాజిక్.
- ‘ది ఆర్చీస్’లో జుగ్‌హెడ్‌గా కనిపించిన నేను ఇప్పుడు అగస్త్యగా మారడం నాలోని వైవిధ్యాన్ని నిరూపించుకోవడానికి దొరికిన మంచి అవకాశం.