Reading Time: 2 minutes

రిపేర్లు తొందరగా పూర్తి చెయ్యండి..వీలైనంత వేగంగా కాళేశ్వరం బ్యారేజీలను వాడుకలోకి తేవాలి: మంత్రి ఉత్తమ్

Caption of Image.
  •     2027, 2028 వర్క్ సీజన్లలో పనులు పూర్తి కావాలి
  •     అన్నారం, సుందిళ్లను పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలి
  •     మేడిగడ్డను పాక్షికంగానైనా వినియోగంలోకి తేవాలి
  •     డిజైన్ టీమ్​లు 24/7 పని చెయ్యాల్సిందే
  •     పనుల స్పీడప్​కు పరీక్షిత్ మెహ్రా కన్వీనర్​గా స్టీరింగ్ కమిటీ
  •     ఇరిగేషన్​ మంత్రి సమీక్ష 

హైదరాబాద్, వెలుగు:  కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను వీలైనంత త్వరగా వినియోగంలోకి తీసుకురావాలని ఇరిగేషన్​ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. రిపేర్ల పనులను వేగవంతం చేయాలని, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని తేల్చి చెప్పారు. ఆదివారం సెక్రటేరియట్​లో ఇరిగేషన్​ శాఖ అధికారులు, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్​ఎస్) ప్రతినిధులు, నిర్మాణ సంస్థలు, బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్లు ఇవ్వాల్సిన సంస్థ ఆఫ్రీ ప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించారు. 

మూడు బ్యారేజీల్లో ఫౌండేషన్స్, డిజైన్లు, ప్లానింగ్​లలో తీవ్రమైన లోపాలున్నాయని ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్​డీఎస్ఏ), విజిలెన్స్ కమిషన్​లు తేల్చాయని గుర్తు చేశారు. మూడింట్లోనూ ఫౌండేషన్ సమస్యలు ఒకేరకంగా ఉన్నాయన్నారు. 2027, 2028 వర్కింగ్ సీజన్లు చాలా కీలకమని, ఆ లోపు కాళేశ్వరం బ్యారేజీల రిపేర్లు పూర్తిచేయాలన్నారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పూర్తిగా వినియోగంలోకి తీసుకురావాలని చెప్పిన మంత్రి ఉత్తమ్.. మేడిగడ్డ బ్యారేజీని కనీసం పాక్షికంగానైనా వినియోగించుకునేలా రిపేర్లు చేయాలని అధికారులకు సూచించారు. 

24 గంటలూ పని చెయ్యాలె..

బ్యారేజీల రిపేర్లకు సంబంధించిన డిజైన్ల బాధ్యతను ఆఫ్రీ ఇండియా, ఐఐటీ ముంబై జాయింట్ వెంచర్​కు అప్పగించామని, డిజైన్ టీమ్​లు 24 గంటలూ పనిచేసి డిజైన్లు త్వరగా ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. డిజైన్లను సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ)కి పంపించి ఆమోదం తీసుకోవాల్సిన అవసరం ఉందని, కనుక వీలైనంత తొందరగా డిజైన్లు ఇవ్వాలని ఇటు ఆఫ్రీ, అధికారులను ఆదేశించారు. 

బ్యారేజీల రిపేర్లకు సంబంధించి నియమించిన కన్సల్టెంట్లు నిరంతరం సెక్రటరీ పరీక్షిత్ మెహ్రాతో సంప్రదింపులు జరపాలని, ఏవైనా సమస్యలొస్తే ఆయనకే నేరుగా తెలియజేయాలన్నారు. సమగ్రమైన జియోఫిజికల్, జియోటెక్నికల్, సాయిల్, హైడ్రాలిక్ మోడలింగ్ స్టడీస్ చేసి.. బ్యారేజీల డిజైన్లను రూపొందించాలన్నారు. 

అవసరమైన అన్ని టెస్టులు, డేటాను ప్రాధాన్య ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. టెస్టుల విషయంలో సీడబ్ల్యూపీఆర్ఎస్​కు బాధ్యతలు అప్పగించామని, వీలైనంత త్వరగా టెస్టులు చేయాలని ఆ సంస్థ ప్రతినిధులను మంత్రి ఉత్తమ్ కోరారు. టెస్టులు పూర్తయ్యేంత వరకు 45 రోజుల పాటు బ్యారేజీల సైట్ల వద్దే ఉండాలని సూచించారు. కేంద్రం ఆమోదం కోసం సీడబ్ల్యూసీతో కో ఆర్డినేట్​ చేసుకోవాలని ఇరిగేషన్​ శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్​ను ఆదేశించారు.

నిరంతర పర్యవేక్షణ ఉండాల్సిందే..

బ్యారేజీల రిపేర్ల పనులకు హైపవర్ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. కల్నల్​ పరీక్షిత్ మెహ్రా ఆ కమిటీకి కన్వీనర్​గా వ్యవహరిస్తారని తెలిపారు. మంత్రి సమక్షంలో ప్రతి వారం రెండు సార్లు కమిటీ సమావేశం నిర్వహించాలని, అవసరాన్నిబట్టి మిగతా రోజుల్లోనూ వర్చువల్​ రివ్యూలు చేయాలని సూచించారు. 

పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఓ అధికారిని నియమిస్తామన్నారు. బ్యారేజీల వద్ద క్యాంపులు, మెస్ సౌకర్యాలు, రవాణా సదుపాయాలను వెంటనే రీయాక్టివేట్ చేయాలని ఎల్ అండ్ టీ సహా ఏజెన్సీలను ఆదేశించారు. ఇంజినీర్లు, టెక్నీషియన్లు, రిగ్​ ఆపరేటర్లకు ఆహారం, వసతుల్లో ఎలాంటి ఇబ్బందులూ రావొద్దని చెప్పారు.  

ఇసుక తొలగింపు, జియోఫిజికల్​, జియోటెక్నికల్ టెస్టులకు ఏజెన్సీలు పూర్తి సహకారం అందించాలన్నారు. డిజైనర్ సంస్థ, సీడబ్ల్యూపీఆర్ఎస్, డిపార్ట్​మెంట్ అధికారులు, ఏజెన్సీ ప్రతినిధుల సమక్షంలో టెస్టులు నిర్వహించాలని స్పష్టం చేశారు. సమీక్షలో ఇరిగేషన్ సెక్రటరీ ఈ. శ్రీధర్, పరీక్షిత్ మెహ్రా, ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్​సీ జనరల్ రమేశ్ బాబు, జాయింట్ సెక్రటరీ కె. శ్రీనివాస్, ఈఎన్​సీ అడ్మిన్ టి. శ్రీనివాస్, సీడబ్ల్యూపీఆర్ఎస్ అడిషనల్ డైరెక్టర్ సెల్వ బాలన్ తదితరులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.