Reading Time: < 1 minute

భవానీపూర్ నుంచి తన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయించడానికి బీజేపీ ప్రయత్నించిందని బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఆరోపించారు. తనపై తప్పుడు కేసులు పెట్టడానికి ఆ పార్టీ నేతలు ఈసీతో కలిసి కుట్ర పన్నారని అన్నారు. ఈ ప్రయత్నాలను తమ పార్టీ నేతలు భగ్నం చేశారన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడి ఎన్నికల్లో గెలిచే ధైర్యం లేక, మోసపూరిత మార్గాల్లో ఓట్లు రాబట్టుకోవడానికి కుట్ర పన్నుతున్నారన్నారు. అందుకే సర్ పేరుతో వేల సంఖ్యలో ఓటర్ల పేర్లను తొలగించారని, మమత ఆగ్రహం వ్యక్తం చేశారు.

90 లక్షల మంది ఓటర్ల పేర్లను ఈసీ ఓటరు జాబితా నుంచి తొలగించిందని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ఈవీఎంలలో అవకతవకలకు పాల్పడడానికి కూడా ఈసీతో కలిసి బీజేపీ ప్రణాళికలు రచిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల ప్రజాస్వామ్య హక్కులను హరించడానికే బెంగాల్‌లో యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ)ను అమలు చేయాలని బీజేపీ చూస్తోందని మమత ఆరోపించారు. ఇది వెనుకబడిన వర్గాలకు వ్యతిరేకంగా ఉంటుందన్నారు. బెంగాల్‌లో యూసీసీని ఎన్నటికీ అమలు కానివ్వమన్నారు.