
పార్టీ ఫిరాయింపులను దేవుడు ప్రోత్సహించడం ఎంత మాత్రం బాగాలేదు. అదేంటి, పార్టీ ఫిరాయింపుల్ని దేవుడు ఎందుకు ప్రోత్సహిస్తాడు అనుకుంటున్నారా? సీనియర్ రాజకీయ నాయకుడు తాటిపర్తి జీవన్‌రెడ్డి శుక్రవారంనాడు ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును చూడగానే భావోద్వేగంతో అన్నా, నీతో కలిసి పని చేయమని దేవుడే నన్ను పంపించాడు అన్నారు. జీవన్‌రెడ్డి ఈ మాటలు అన్నట్టు మీడియాలో వచ్చిన వార్తలే ఆధారం. పార్టీ ఫిరాయింపులు అనైతికమని 2023లో ఓడిపోయిన దగ్గర నుండి భారత రాష్ట్ర సమితి అనని రోజు లేదు. తమ పార్టీనుంచి పదిమంది శాసనసభ్యులు కాంగ్రెస్‌కు వలసపోవడం అనైతికమని ఇంటాబయటా.. అంటే శాసనసభలోనూ, న్యాయస్థానాల్లోనూ వాదించిన పార్టీ భారత రాష్ట్ర సమితి. ఆ పదిమంది శాసనసభ్యులు తాము ఇంకా భారత రాష్ట్ర సమితిలోనే ఉన్నామని అభివృద్ధి,
సంక్షేమాలు ప్రజలకు అందించడంకోసమే కాంగ్రెస్ ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తున్నామని చెప్పుకుంటున్నారు, అది వేరే విషయం. వచ్చే రెండున్నర సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా సభలో విప్ జారీ చేసే అవసరం వచ్చినప్పుడు తెలుస్తుంది పదిమంది శాసనసభ్యులు ఏమవుతారు అన్నది. అయితే సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జీవన్‌రెడ్డిని కెసిఆర్‌తో కలిసి పనిచేయమని దేవుడే పంపించి ఉంటే ఆ పదిమంది శాసనసభ్యులను కూడా దేవుడే ‘మీరు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలసి ప్రజలకు మంచి చేయండి’ అన్నాడేమో.అయితే ఈ పదిమందికి, సీనియర్ రాజకీయవేత్త జీవన్‌రెడ్డికి పార్టీ ఫిరాయింపు విషయంలో తేడా ఉంది. ఆ పదిమంది భారత రాష్ట్ర సమితి టికెట్ మీద శాసనసభ ఎన్నికయినవారు. జీవన్‌రెడ్డి ప్రస్తుతం ఏ చట్టసభలోనూ లేరు. కాబట్టి ఎవరి రాజకీయాలు సరైనవి, ఎవరితో కలిసి పనిచేయాలి అన్నది ఆయన ఇష్టం. నలభైఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆయనకు కాంగ్రెస్ విధానాలో, వ్యవహార శైలో నచ్చలేదు, పార్టీ మారారు. ఎవరూ అభ్యంతర పెట్టాల్సిన అవసరం లేదు.
అయినా పార్టీ ఫిరాయింపుల గురించి సీరియస్‌గా ఆలోచించే రోజులు పోయాయి. 1970వ దశకంలో హైదరాబాద్ నగరంలోని చిక్కడపల్లి ప్రాంతానికి సంబంధించిన ఒక భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) నాయకుడు కాంగ్రెస్ పార్టీలో చేరితే కొన్ని నెలలపాటు చర్చ జరిగింది. కమ్యూనిస్టు సిద్ధాంతాలకు, కాంగ్రెస్ విధివిధానాలకు పోలికే లేదు కదా ఎందుకు పార్టీ ఫిరాయించి ఉంటాడు అని. అంత ఛోటా నాయకుడు పార్టీ మారితే కూడా అంత పెద్దయెత్తున చర్చ జరిగింది. అదే పార్టీలో కొన్ని దశాబ్దాలు గడిచిన తర్వాత చాలా పెద్ద నాయకుడు, పార్టీలకతీతంగా అత్యంత గౌరవం పొందిన నాయకుడు చెన్నమనేని రాజేశ్వరరావు తన కుమారుని రాజకీయ భవిష్యత్తుకోసం అప్పటి అధికారపక్షం అయిన తెలుగుదేశం పార్టీలో చేరితే దానిమీద పెద్దగా చర్చ జరగలేదు. అంటే, అప్పటికి పార్టీలు మారడం చాలా సాధారణం అయిపోయింది.
మిగతా పార్టీలలో ఫిరాయింపుల పరిస్థితి ఎలా ఉన్నా, వామపక్ష పార్టీల్లో చేరేవారు సాధారణంగా కమ్యూనిస్టు సిద్ధాంతానికి నిబద్ధులై ఉంటారని భావిస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు జరుగుతున్న పార్టీ ఫిరాయింపులకు, ఆ సంఘటనలకు అసలు పోలిక లేదు. ఇప్పుడు జరిగే ఫిరాయింపులు అధికారం కోసం లేదా అధికారంలో ఉన్నవారి నుంచి పొందాలనుకున్న ప్రయోజనాల కోసం. అవి ప్రజాప్రయోజనాలు కావచ్చు, వ్యక్తిగత ప్రయోజనాలు కావచ్చు. సీనియర్ నాయకుడు జీవన్‌రెడ్డిని కొంచెం భిన్నంగా చూడాలి. తెలంగాణ ప్రాంతంలో ఆయన ముక్కుసూటి మనిషి, నిజాయితీపరుడని పేరు తెచ్చుకున్న నాయకుడు, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినవాడు. ఒక్క పర్యాయం మినహాయిస్తే ప్రజాజీవితం అంతా కాంగ్రెస్ పార్టీలోనే గడిచింది. 1983లో అప్పుడప్పుడే ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడుగా ఎన్నికై మంత్రి పదవి కూడా చేపట్టిన జీవన్‌రెడ్డి 1984లో నాదెండ్ల భాస్కర్ రావుతో కలిసి ఎన్టీఆర్ మీద తిరుగుబాటు చేసి తర్వాత కొద్దిరోజుల్లోనే కాంగ్రెస్ పార్టీలో చేరి దాదాపు ఆరుసార్లు
జగిత్యాల నియోజకవర్గంనుండి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఒకసారి ఉత్తర తెలంగాణ జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గంనుంచి శాసనమండలికి ఎన్నికయ్యారు. మూడుసార్లు లోకసభకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. రెండుసార్లు ఆయన కరీంనగర్ లోక్‌సభకు కెసిఆర్ మీదనే పోటీచేసి ఓడిపోయారు. మొదటిసారి దాదాపు రెండు లక్షల ఓట్ల తేడాతో ఓడిపోతే, రెండవమారు అతి స్వల్పంగా కేవలం పదిహేనువేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. జీవన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడనున్నారని కొద్దిమాసాలుగా వినిపిస్తూనే ఉన్నది. ఏం కోరి ఆయన కాంగ్రెస్‌ను వీడి భారత రాష్ట్ర సమితిలో చేరుతున్నారు? ఏం ఆశించి భారత రాష్ట్ర సమితి ఆయనను తన అక్కున చేర్చుకుంటున్నది? సాధారణంగా పార్టీ ఫిరాయింపులు ప్రతిపక్షంనుండి అధికారపక్షంలోకి జరుగుతుంటాయి. జాతీయ రాజకీయ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసి ఆ పార్టీ అధికారంలో ఉండగా, భవిష్యత్తు ఇంకా స్పష్టంగా లేని ప్రాంతీయపార్టీలో చేరాలని ఆయన ఎందుకు నిర్ణయించుకున్నారు? ఈ విషయం రాజకీయాలను దగ్గరగా పరిశీలిస్తున్నవారికంటే కాంగ్రెస్ పార్టీయే ఎక్కువ ఆలోచించాలేమో. అధికారపక్షానికి కనిపించని బిఆర్‌ఎస్ అనుకూల వాతావరణం ఏదైనా చాపకింద నీరులా వ్యాప్తి చెందుతూ జీవన్‌రెడ్డికి కనిపిస్తున్నదా?
జీవన్‌రెడ్డి ప్రస్తుతం పార్టీ వీడి బిఆర్‌ఎస్‌లో చేరడానికి చెబుతున్న కారణాలు ఏవైనా, జగిత్యాలనుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భారత రాష్ట్ర సమితి శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ కాంగ్రెస్‌కు వలసపోవడమే ప్రధాన కారణమని అందరికీ తెలుసు. తనమీదనే గెలిచిన సంజయ్‌తో కలిసి పనిచేయడం జీవన్‌రెడ్డి వల్ల కాని పని. కాంగ్రెస్ పెద్దలు, ముఖ్య నాయకులు, పిసిసి అధ్యక్షునితో సహా సీనియర్ మంత్రులు కూడా వెళ్లి ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఇంత రాజకీయ జీవితం చూసిన తర్వాత జీవన్‌రెడ్డి ఇంకా ఏం ఆశిస్తున్నట్టు? చాలామందికి రాజకీయాల్లో దక్కనన్ని అవకాశాలు ఆయనకు వచ్చాయి. ఇన్ని దశాబ్దాలుగా తాను పార్టీకి పనిచేస్తూ ఉంటే మధ్యలో వచ్చిన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఏమిటన్న దుగ్ధ కూడా ఆయనను బాధిస్తూ ఉండవచ్చు.
అది మరికొందరు కాంగ్రెస్ సీనియర్ నాయకులలో కూడా ఉండవచ్చు. అయితే అటువంటి ఆలోచన చేస్తున్నవారు ఎవరైనా సరే, జీవన్‌రెడ్డితోసహా, కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఆ ఖాళీ ఎందుకు ఏర్పడింది? రేవంత్‌రెడ్డి వచ్చి ఆ ఖాళీని పూరించి ముఖ్యమంత్రి కావడానికి అవసరమైన వాతావరణం ఎందుకు ఏర్పడింది? అని కదా ఆలోచించాలి. మొదటినుంచీ కాంగ్రెస్‌తో ఉన్న నాయకులు ఎందుకు రేవంత్‌రెడ్డిలు కాలేకపోయారు? సరే, రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం దగ్గర నుండి బిఆర్‌ఎస్‌కు చెందిన సంజయ్ కాంగ్రెస్‌లో చేరడంవరకు ఉన్న పలు కారణాలు జీవన్‌రెడ్డిని భారత రాష్ట్ర సమితిలోకి పంపించి ఉండవచ్చు. ఒక దశలో ఆయన భారతీయ జనతా పార్టీలో కూడా చేరతారని ప్రచారం జరిగింది. అయితే మైనారిటీలను దూరం చేసుకోవాల్సి వస్తుందని ఆయన ఆ ఆలోచన విరమించుకున్నట్లు తెలిసింది.
ఇక భారత రాష్ట్ర సమితి విషయానికొస్తే అధికారంలో లేదు కాబట్టి ఎవరినైనా పార్టీలోకి ఆహ్వానించడం, అందునా జీవన్‌రెడ్డివంటి బలమైన నాయకుడు రావడం అనుకూల అంశంగానే భావిస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించిననాటి నుండి కూడా చంద్రశేఖరరావు ఉత్తర తెలంగాణ, ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కేంద్రంగానే ఉద్యమంగానీ, రాజకీయంగానీ నడిపించారు. మూడుసార్లు ఆయన కరీంనగర్ లోకసభ స్థానంనుండి పోటీచేసి గెలిచారు (2004, 2006, 2008). తన సొంత జిల్లా మెదక్‌ను కాకుండా కెసిఆర్ కరీంనగర్‌ని ఎంచుకోవడం, ఆయన కుమారుడు కెటి రామారావు కూడా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని సిరిసిల్లనుండే రాజకీయ అరంగేట్రం చేయడం ఇవన్నీ కెసిఆర్, ఆయన పార్టీ కరీంనగర్‌కి ఇచ్చిన ప్రాధాన్యతను తెలుపుతున్నాయి. పార్టీలో ఉండిన మరో బలమైన నాయకుడు ఈటల రాజేందర్‌ని
బయటికి పంపించిన తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరో బలమైన నాయకుడి అవసరం ఉందని భావించి కెసిఆర్ జీవన్‌రెడ్డికి ఆహ్వానం పలికారా? జీవన్ రాకతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారత రాష్ట్ర సమితి బలం వచ్చే ఎన్నికల నాటికి మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయా? ఇదే చర్చ జరుగుతుంది ఇప్పుడు. ఈనెల 20వ తేదీన భారీ జనసమీకరణ జరిపి జగిత్యాలలో నిర్వహించే బహిరంగసభలో జీవన్‌రెడ్డి బిఆర్‌ఎస్‌లో చేరబోతున్నారు. ఈ బహిరంగసభలో కెసిఆర్ కూడా ప్రసంగిస్తారని వార్తలు వెలువడ్డాయి. పార్టీ రజతోత్సవ సభలో ప్రసంగించిన తర్వాత బహిరంగవేదికల మీదికి కెసిఆర్ రావడం ఇదే మొదలు అవుతుంది.
సుదీర్ఘ రాజకీయ జీవితం ఇచ్చిన కాంగ్రెస్‌లో లభించని ప్రాధాన్యత భారత రాష్ట్ర సమితిలో లభిస్తుందని జీవన్‌రెడ్డి భావిస్తున్నారా? అన్నది ఒక ప్రశ్న అయితే మహామహా కాంగ్రెస్ దిగ్గజాల్ని తన పార్టీలో చేర్చుకొని తరువాత మూలన కూర్చోపెట్టగలిగిన కెసిఆర్ జీవన్‌రెడ్డిని ఏం చేస్తారో చూడాలి. జీవన్‌రెడ్డిని పార్టీ వీడకుండా చూసే విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానవర్గం నిస్సహాయంగా ఉండిపోయిందనీ, అంతా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇష్టప్రకారం జరుగుతున్నదనీ ఒక చర్చ జరుగుతున్నది. ఇలా విమర్శించిన నోళ్లే కాంగ్రెస్ పార్టీ అధిష్టానవర్గం రాష్ట్రాల నాయకులను సామంతరాజుల వలే చూస్తుందనీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు గాలి పీల్చి వదలాలన్నా ఢిల్లీ అనుమతికోసం ఎదురుచూస్తూ ఉంటారని విమర్శించడం ఎన్నోసార్లు విన్నాం. 2004 నుంచి 2009 వరకు ముఖ్యమంత్రిగా
ఉండిన డాక్టర్ వైయస్ రాజశేఖర్‌రెడ్డి అధిష్టాన వర్గాన్ని గౌరవిస్తూనే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలిగారు. అదే పని రేవంత్‌రెడ్డి చేస్తుంటే అభినందించవలసిందిపోయి కాంగ్రెస్ హై కమాండ్ అదుపులో ఏం లేదు అని కాంగ్రెస్ వ్యతిరేకులు బాధపడటం ఎందుకో? ప్రస్తుతం ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న శాసనసభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి వస్తున్న సమాచారం నిజమయితే కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ మంచి మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయం. అదే జరిగితే అధిష్టానం దగ్గర రేవంత్‌రెడ్డి పలుకుబడి, పట్టు మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే కేరళ ఎన్నిక మొత్తం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ చేతుల మీదుగానే సాగింది. కేరళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కూడా రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ఆవిష్కరణ జరిగిన విషయం తెలిసిందే.
ఏదిఏమైనా జీవన్‌రెడ్డి సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో ఉండి ఇప్పుడు ఇంకో మార్గం ఎంచుకోవడం వల్ల ఆయనకు, భారత రాష్ట్ర సమితికి రాజకీయంగా లబ్ధి చేకూరుతుందా లేక గతంలో కాంగ్రెస్‌ను వీడిన దిగ్గజాల పరిస్థితి జీవన్‌రెడ్డికీ ఎదురవుతుందా? ఏదిఏమైనా ముక్కుసూటి రాజకీయాలు చేసే జీవన్‌రెడ్డికి ఆల్ ది బెస్ట్.
