
ఇస్లామాబాద్: పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో అమెరికాతో జరిగిన శాంతి చర్చలు విఫలమైనట్లు ఇరాన్ ప్రకటించింది. అమెరికా అసమంజసమైన డిమాండ్లు, గొంతెమ్మ కోరికలే ఇందుకు ప్రధాన కారణమని వెల్లడించింది. హార్మూజ్ జలసంధి, అణ్వాస్త్రాల విషయంలో ఇరువర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని పేర్కొంది.
‘‘ఇరాన్ ప్రజల జాతీయ ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఇరాన్ ప్రతినిధి బృందం 21 గంటల పాటు తీవ్రంగా చర్చలు జరిపింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరాన్ ప్రతినిధి బృందం చొరవ తీసుకున్నప్పటికీ అమెరికా అసమంజసమైన డిమాండ్లు చర్చల పురోగతిని అడ్డుకున్నాయి. దీంతో ఎలాంటి ఒప్పందం కుదరకుండానే చర్చలు ముగిశాయి’’ అని ఇరాన్ పేర్కొంది.
మా డిమాండ్లను ఇరాన్ అంగీకరించట్లే: జేడీ వాన్స్
పశ్చిమాసియాలో యుద్ధానికి ముగింపు పలికే దిశగా పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరిగిన అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలమయ్యాయి. దాదాపు 21 గంటల పాటు జరిగిన చర్చలు కొలిక్కిరాలేదు. యుద్ధ విరమణ, కీలక అంశాల విషయంలో ఇరువర్గాల మధ్య సయోధ్య కుదరలేదు. దీంతో యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ నేతృత్వంలోని అమెరికా బృందం అర్ధాంతరంగా చర్చలు ముగించి వెళ్లిపోయింది.
చర్చల ముగింపు అనంతరం జేడీ వాన్స్ మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా డిమాండ్లను ఇరాన్ అంగీకరించడం లేదని చెప్పారు. దీంతో ఎలాంటి ఒప్పందం కుదరకుండానే చర్చలు ముగిశాయని తెలిపారు. ఒప్పందం కుదరకపోవడం చాలా చెడ్డ వార్త అని.. కానీ ఇది అమెరికా కంటే ఇరాన్‌కే ఎక్కువ బ్యాడ్ న్యూస్ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చర్చలు సానుకూలంగా ఉన్నప్పటికీ.. అమెరికా, ఇరాన్‌ల మధ్య అనేక కీలక సమస్యలు పరిష్కారం కాకుండా మిగిలి ఉన్నాయని పేర్కొన్నారు. అణ్వాయుధాలను సమకూర్చుకోబోమని ఇరాన్ స్పష్టమైన వాగ్దానం చేయాలని అమెరికా కోరుకుంటుందని తెలిపారు. అణ్వాయుధాలను తయారు చేయాలనే ఆలోచనను ఇరాన్ విరమించుకోవాలని, భవిష్యత్తులో కూడా ఆ ఆలోచన చేయొద్దని అమెరికా ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లక్ష్యం కూడా ఇదేనని స్పష్టం చేశారు. ఇరాన్‌కు బెస్ట్ డీల్ ప్రపోజ్ చేశామని.. ఇందుకు ఆ దేశం అంగీకరిస్తుందో లేదో చూడాలన్నారు. ప్రస్తుతానికైతే ఎలాంటి ఒప్పందం కుదరకపోవడంతో తాము పాకిస్థాన్ వీడి తిరిగి అమెరికా వెళ్తున్నామని వాన్స్ పేర్కొన్నారు. ఇరాన్, అమెరికా చర్చలు విఫలం కావడంతో ట్రంప్ ఏం చేయబోతున్నారనే దానిపై ప్రపంచ దేశాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.