
హైదరాబాద్: తనపై ఆరోపణలు చేసిన న్యాయవాది సుభా సింగబోష్‌పై సింగర్ మంగ్లీ నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రూ.150 కోట్ల మేర మోసం చేశారంటూ తనపై అతడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మార్చి 21న సుభా సియపోగు పేరుతో పరిచయం చేసుకున్న వ్యక్తి తనను బెదిరించారని తెలిపారు.
‘‘అతడు అమర్యాదగా బెదిరించే ధోరణిలో మాట్లాడారు. తనను కలవాలని ఒత్తిడి చేశారు. నిరాకరిస్తే అప్రతిష్ట పాలుచేస్తానని బెదిరించారు. మరో వ్యక్తితో కలిసి అవమానకర వ్యాఖ్యాలు చేశారు. నాకు ఎలాంటి సంబంధం లేని కరెన్సీ నోట్లు ఉన్న వీడియో చూపించి బెదిరించారు. సుభా సింగబోష్ తీరుపై నా కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు’’ అని మంగ్లీ ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.